
నటుడు సాహిల్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళ సాహిల్ ఖాన్ తనను బెదిరించడంతో పాటు గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డాడని పోలీసులను ఆశ్రయించారు. ముంబై పోలీసులు సాహిల్ ఖాన్ తో పాటు మరొక మహిళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓషివారా ఏరియాకు చెందిన 43 ఏళ్ల బాధిత మహిళ కథనం ప్రకారం... డబ్బులు విషయంలో ఒక మహిళ ఫిబ్రవరిలో తనతో జిమ్ లో గొడవ పడింది. ఆ సమయంలో నటుడు సాహిల్ ఖాన్, సదరు మహిళ ఆమెను దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడ్డారు.
అలాగే సాహిల్ ఖాన్, ఆ మహిళ సోషల్ మీడియాలో బాధిత మహిళ పరువు, ఆమె కుటుంబ పరువుతీసేలా పోస్ట్స్ పెట్టారు. తమ గౌరవానికి భంగం కలిగించారు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ఈ విషయాలను ఆమె పొందుపరిచారు. మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పలు సెక్షన్స్ క్రింద సాహిల్ ఖాన్, అలాగే మరో మహిళ మీద ఓషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
బాధిత మహిళ భర్తతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఆయన మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక సాహిల్ ఖాన్... స్టైల్, ఎక్స్క్యూజ్ మీ, అల్లావుద్దీన్ అండ్ రామా వంటి పలు హిందీ చిత్రాల్లో నటించారు.