
కన్నడ పవర్ స్టార్, దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న మరణించారు. ఈరోజుతో అప్పు చనిపోయిన సరిగ్గా ఏడాది గడిచిపోయింది. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఇప్పటికీ అభిమానులు, కుటుంబీకులను బాధిస్తోంది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గతేడాది జరిగిన అత్యంత విషాదకర సంఘటనను ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. అయితే, అప్పు మరణించి నేటికి సంవత్సరం పూర్తవడంతో.. మొదటి వర్థంతికి భారీ ఏర్పాటు చేస్తున్నారు.
వేల మందికి అప్పు సేవా కార్యక్రమాలు అందించిన విషయం తెలిసిందే. పిల్లలకు చదువుతో పాటు, వైద్యం పరంగానూ రోగులను ఆదుకున్నారు. ఆయన చేసిన సేవతో వేలాది కుటుంబీకుల్లో వెలుగులు నిండాయి. దీంతో, పునీత్ మొదటి వర్థంతి సందర్భంగా అప్పు జ్ఠాపకార్థం అభిమానులు, కుటుంబీకులు భారీ విగ్రహాన్ని తయారు చేయించారు. గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష దాదాపు నాలుగు నెలల పాటు విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పటికే లోకల్ ఎమ్మెల్యే విగ్రహాన్ని ఆశిష్కరించారు. వర్థంతి సభలోనూ విగ్రహన్ని ఆశిష్కరించబోతున్నట్టు తెలుస్తోంది.
అప్పు కుటుంబ సభ్యులు, అభిమానులతో పాటు ప్రభుత్వం తరుపున కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాలను చేసిన పునీత్ ఖ్యాతిని గుర్తిస్తూ కన్నడ ప్రభుత్వం 'కన్నడ రత్న' బిరుదుని కూడా ప్రకటించింది. నవంబర్ 1న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో ఈ బిరుదును అందించబోతున్నారు. దీనికోసం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. సౌత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాబోతున్నారు.