ఆంధ్రాలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' విడుదలైంది.. కానీ!

By AN TeluguFirst Published May 2, 2019, 2:57 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన  లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం వివాదాలు ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు కనపడటం లేదు.

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన  లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం వివాదాలు ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు కనపడటం లేదు. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించిన ఈ చిత్రం ఆంధ్రాలో ఎలక్షన్స్ సమయంలో రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నించారు. 

కానీ ఎలక్షన్ కోడ్ వల్ల, కోర్ట్ తీర్పు వల్ల కుదరలేదు.    వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌  రిలీజైంది.  ఈ క్రమంలో ఎన్నికల తర్వాత మే 1వ తేదీన సినిమాను విడుదల చేయాలని భావించింది. అయితే అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు.

అంతేకాదు సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన తేదీకి రెండు రోజుల ముందుగానే అన్నీ జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం సినిమా విడుదల చేయకూడదంటూ ఉత్తర్వులు వెళ్లాయి. ఏ రాజకీయ నాయకుడి బయోపిక్ అయినా సరే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే విడుదల చేయాలని ఈసీ స్పష్టం చేసింది.  అయితే మే ఒకటో తేదీనే విడుదల చేస్తామని చెప్పిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర టీమ్ అలాగే చేసారు. ఏపీలోని కొన్ని ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.

ఈ సినిమాను కడప నగరంలోని రాజా థియేటర్‌లో, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్‌లలో విడుదల చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో పట్టణంలోని శ్రీరామా కళామందిర్, శ్రీసాయి కళామందిర్ థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు ధియేటర్లకు చేరుకుని సినిమాను ప్రదర్శించిన ధియేటర్లపై కేసులు నమోదు చేశారు ఎన్నికల సంఘం అధికారులు.  అయితే వర్మ పంతం నెగ్గించుకున్నట్లు అయ్యింది కానీ కలిసొచ్చింది ఏమిటనేది మాత్రం ఎవరికీ అర్దం కాలేదు. 

click me!