మా ఎన్నికల వేడి: బండ్ల గణేష్ పోటీ ఆంతర్యం, ఎవరిపై దెబ్బ?

By team teluguFirst Published Sep 23, 2021, 6:00 AM IST
Highlights

మా (MAA) అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు, సివీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్నారు. అయితే, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి జరిగే పోటీ ఆసక్తికరంగా మారింది. 

మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు ప్యానెల్స్ హోరాహోరీ పోరాటానికి సిద్ధపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ఇప్పటికే ప్రకటించగా, తన ప్యానెల్ ను నేడు గురువారం ప్రకటించనున్నారు. మంచు విష్ణు ప్యానెల్ లో ఉపాధ్యక్షుడిగా బాబూ మోహన్, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు పోటీ చేయడం ఖరారైనట్లు తెలుస్తోంది. మంచు విష్ణు ప్యానెల్ నుంచి మహామహులు పోటీకి దిగుతారని అంటున్నారు. 

మా (MAA) అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు, సివీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్నారు. అయితే, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి జరిగే పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జీవితా రాజశేఖర్ పోటీ చేస్తుండగా, బండ్ల గణేష్ ఇండిపెండెంట్ గా పోటీకి దిగడానికి సిద్ధపడుతున్నారు. బండ్ల గణేష్ జీవితా రాజశేఖర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి మధ్య మాటల యుద్ధం కూడా సాగుతోంది. 

Also read: తన `మా` ప్యానెల్‌తో మంచు విష్ణు మీటింగ్‌.. రేపు క్రేజీ అనౌన్స్ మెంట్‌

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మద్దతు ఉందని చెబుతున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మధ్దతుగా చిరంజీవి సోదరుడు నాగబాబు ప్రత్యక్షంగా ముందుకు వచ్చారు. బండ్ల గణేష్ కూడా తొలుత ప్యానెల్ కు మద్దతు ప్రకటించారు. అయితే, జీవిత ప్రవేశంతో ఆయన తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. 

చిరంజీవి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. బహుశా రాకపోవచ్చు కూడా. మోహన్ బాబు మాత్రం మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. చాలా కాలంగా మోహన్ బాబు, చిరంజీవి మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. మా ఎన్నికలు వీరిద్దరి మధ్య మరోసారి చిచ్చు పెడుతాయా అనే సందేహం కలుగుతోంది. గతంలో వీరు ఒకానొక సందర్భంలో వేదిక మీది నుంచి పరస్పరం వ్యతిరేకించుకున్నారు. 

కాగా, బండ్ల గణేష్ (Bandla ganesh) ఎవరికి ఎసరు పెడుతారనే ప్రశ్న ఎదురవుతోంది. జీవితా రాజశేఖర్ గెలుపుపై ఆయన ప్రతికూల ప్రభావం చూపుతారనే మాట వినిపిస్తోంది. నిజానికి బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడు. ఒకవేళ, చిరంజీవి మద్దతు ప్రకాశ్ రాజ్ కు ఉంటే, బండ్ల గణేష్ ను పోటీ నుంచి విరమింపజేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. చిరంజీవి ఒక్క మాట చెప్తే ఆయన విరమించుకోవడానికి వెనకాడకపోవచ్చు. పవన్ కల్యాణ్ చెప్తే మాత్రం ఆదేశంగా తీసుకుని పాటిస్తారు. ఈ చొరవ చిరంజీవి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.

ఓటర్లు పూర్తిగా ప్యానెల్ కు ఓట్లు వేయడానికి సిద్ధపడితే మాత్రమే జీవితా రాజశేఖర్ గట్టెక్కే అవకాశం ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. లేదంటే బండ్ల గణేష్ జీవిత గెలుపును దెబ్బ తీసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే, తన సేవలు అందరికీ తెలుసు కాబట్టి తాను విజయం సాధిస్తాననే ధీమాతో జీవిత రాజశేఖర్ ఉన్నారు. ఒక వేళ అది జరగకపోతే గతంలో మాదిరిగా మరో వివాదం ముందుకు వస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే.

Also read: 'మా' ఎలక్షన్ లో మాస్ ఫైట్.. జీవిత, బండ్ల గణేష్ కు పోటీగా అతడిని దింపుతున్న విష్ణు

ఇదిలావుంటే, మా ఎన్నికలు (MAA Elections) అక్టోబర్ 10వ తేదీన జరుగుతుంది. అక్టోబర్ 10వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాదులోని పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతుగా నిలిచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి నరేష్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దాంతో ఆయన వారికి వ్యతిరేకంగా వైఖరి తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

click me!