
మూవీ ఆర్టిస్టు అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి జిన్నా పేరును ఖరారు చేశారు. అయితే జిన్నా టైటిల్‌పై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ టైటిల్‌ను తొలగించాలని కోరుతూ ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు.‘‘వివాదాలకు కేంద్ర బిందువైన, భారతదేశంలో వేలాది మంది ఊచకోతకు కారణమైన జిన్నా పేరు మీద సినిమాకు సంబంధించిన వివాదానికి తెరలేపడం సిగ్గచేటు. జిన్నా పేరుతో భారతదేశంలో ఒక్క చోటే ఉన్న టవర్‌ను తొలగించాలని మేము ఉద్యమం చేస్తున్నాం. సినిమాలో ప్రచారం కోసం ఏకంగా కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఏడుకొండల మీద.. అన్యమతస్థుడైన జిన్నా పేరు మీద ఒక టైటిల్‌ను తయారు చేసి విడుదల చేయడం సిగ్గుచేటు. మంచు విష్ణుకు జిన్నా జీవిత చరిత్ర, ఈ దేశానికి అతడు చేసిన ద్రోహం తెలుసా..?. సినిమాల్లో ప్రచారం కోసం రామ్‌గోపాల్ వర్మ మాదిరి.. చిల్లర ప్రచారం కోసం ప్రయత్నించడం సరికాదు. హిందూవుల మనోభావాలను గౌరవించి క్షమాపణలు చెప్పి.. ఆ టైటిల్‌ను ఉపసంహరించుకోవాలని బీజేపీ హెచ్చరిస్తుంది’’ అని విష్ణువర్దన్ పేర్కొన్నారు. మరి దీనిపై మంచు విష్ణు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఎందుకంటే మంచు విష్ణు ఫ్యామిలీకి బీజేపీ నేతలతో సత్సబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇక, మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ రైటర్‌గా పేరున్న కోన వెంకట్.. గతంలో విష్ణు హీరోగా నటించిన ఢీ, దేనికైనా రెడ్డి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రంలో పాయల్‌రాజ్‌పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంభాషణలు: భాను, నందు, సంగీతం: అనూప్‌రూబెన్స్, మూల కథ: జి.నాగేశ్వర రెడ్డి అందిస్తున్నారు.
ఇక, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్ వీడియోలో.. ఈ చిత్రానికి టైటిల్ ఏమైతే బావుంటుంది అని విష్ణు అడగగా.. కోనవెంకట్ 'జిన్నా' అని సమాధానం ఇస్తారు. దీనితో విష్ణు జిన్నా ఏంటండీ.. పాకిస్తాన్, మహమ్మద్ అలీ జిన్నా గుర్తుకు వస్తున్నాయి. కాంట్రవర్సీ అవుతుందేమో అంటాడు. దీనికి కోన వెంకట్ బదులిస్తూ.. మనకథలో హీరో పేరు గాలి నాగేశ్వర రావు. అతడి పేరు అతడికే నచ్చదు. దీనితో జి.నాగేశ్వర రావుని 'జిన్నా'గా షార్ట్ ఫామ్ లోకి మార్చేస్తాడు. దీనితో విష్ణు టైటిల్ అదిరిపోయింది అంటాడు.