అసలు గోడల చరిత్ర ఏమిటి?
గోడలెందుకు పుట్టినట్టు?
మనిషి తన రక్షణకోసం కనిపెట్టుకున్నవేనా గోడలు?
ఈ మనిషి మొదట్లో శీతవాతాతపాలవంటి ప్రాకృతికాపత్తులనుండి రక్షణకోసం సహజమైన కొండగుహలనో లేక పెద్ద చెట్టు తొఱ్ఱలనో ఆశ్రయించి ఉంటాడు. క్రమేణా ఆయా ఆశ్రయాలనాశించేవారి సంఖ్య ఎక్కువై పోటీ పెరిగి ఉంటుంది. ఆవిధంగా అవసరాలు నూతనావిష్కారాలకు నాంది పలికి ఉంటాయి. గోడలు పుట్టుకొచ్చి ఉంటాయి. చెట్లగోడలు, చెక్కగోడలు, రాళ్లగోడలు, బంకమట్టి పూసిన అతికించిన రాళ్లగోడలు, మట్టినే రాళ్లుగా మార్చి (ఇటుకలు చేసి) కట్టిన గోడలు, రాళ్లనే మట్టిగా మార్చి (సిమెంటు చేసి) కట్టిన గోడలు... ఇలా క్రమాభివృద్ధిని సాధించి ఉంటాడు.
తన కుటుంబసభ్యుల రక్షణకోసం ఇంటి గోడలు
తన గ్రామ/నగరరక్షణకోసం కోట గోడలు
తన చేను రక్షణకోసం ముండ్లకంచెల గోడలు
తన పంటల రక్షణకోసం గాదెలు పాతరల గోడలు
త్రాగునీటి రక్షణకోసం ప్రవాహాలకు అడ్డంగా ఆనకట్టల గోడలు
ఆయా దేశాల నడుమ సరిహద్దుల రక్షణకోసం గోడలు
చివరకు లోకరక్షకుడని మనసారా భావించే జగన్నాథవిశ్వనాథాదినామాంకితుడైన స్వామివారి రక్షణకోసం దేవాలయపు గోడలు కూడా!
చెప్పలేనన్ని ఎన్నో రకాలు!
ప్రపంచంలోకెల్లా మొదటి ఇంజనీర్లు ఇలా గోడలు కట్టడం మొదలు పెట్టినవారా లేక నిప్పును తయారు చేయడం నేర్చినవారా లేక పరుగెత్తే జంతువును పడగొట్టడానికి లేదా పట్టడానికి అవసరమైన పరికరాలు తయారుచేసినవారా అని నాకు పెద్ద సందేహం. వీరిలో ఒకరికి మాత్రమే ఎక్కువ మార్కులు వేయలేక అందరికీ సమానప్రతిపత్తిని ఇస్తూ ఉంటాను.
భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు సహజమైన గోడల్లా నిలిచి ఉన్నాయని చదువుకున్నాము. ఆ గోడల నడుమ సందు కనిపెట్టడం వల్లనే విదేశీయుల దండయాత్రలు ప్రారంభమై ప్రశాంతమైన భారతాన్ని అల్లకల్లోలం చేసిపెట్టాయని సంప్రదాయవాదులు వాపోతూ ఉంటారు. అలా కాదు, హిమాలయాలు అడ్డుగోడల్లా నిలవటం చేత భారతదేశం మిగిలిన ప్రపంచదేశాలతో కలవకుండా చాలాకాలం ఏకాకిగా మిగిలిపోయిందని మరికొందరు వాదిస్తూ ఉంటారు.
ప్రసిద్ధమైన మానవనిర్మితమైన గోడలు చాలా ఉన్నాయి.
వాటిలో చైనా గోడ, బెర్లిన్ గోడ కూడా ఉన్నాయి.
మొదటిదాన్ని ప్రపంచపు అద్భుతమైన కట్టడాలలో ఒకటిగా గుర్తిస్తారు.
రెండవదాన్ని ప్రపంచపు దురహంకారానికి క్రూరత్వానికి చిహ్నంగా అసహ్యించుకున్నారు. ద్వేషించారు. చివరకు కూలదోశారు.
అదేమిటి?
గోడల చరిత్ర ఎక్కడనుండి ఎక్కడకు చేరుకుంటోంది?
ఒక చోట అద్భుతమనిపించుకున్న గోడ మరో చోట ఎందుకు ద్వేషింపబడింది?
గోడ అందరి రక్షణకు చిహ్నంగా ఉన్నంతకాలం నిజంగానే ప్రేమించబడింది. కాని అది క్రమంగా అసమానతలకు చిహ్నంగా మారుతూ ఉండేసరికి దానిపై ద్వేషం కూడా పెరగడం మొదలైంది.
ఒకప్పుడు అందరూ సమానులుగా ఉన్న కాలాన్ని మార్చి కొందరిని పేదలుగా కొందరిని సంపన్నులుగా గుర్తించే కాలాన్ని ఈ గోడే సృష్టించింది. అందుకు పూర్తిగా గోడదే బాధ్యత!
గోడ బయట చలిలో వణుకుతూ ఆకలితో మాడుతున్నవారు కొందరు ఉండగా, గోడల నడుమ వెచ్చదనాన్ని అనుభవిస్తూ, కడుపునిండా తింటూ త్రాగుతూ కొందరు ఉండిన కాలం వచ్చింది. అరిషడ్వర్గాలనబడే కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు కలకాలంలో అమాంతంగా పెరిగాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి గోడలు తమ ప్రధానమైన విధ్యుక్తధర్మమైన రక్షణను విస్మరించి ఇలా అసమానతలను పెంచుతూ మనుషులను విడదీసిపారేస్తూ ఉంటే కలికాలం కాక సత్తెకాలం నడుస్తుందా?
"మీ యింటికి మా యింటికి అడ్డుగోడ ఉందీ" అంటూ ఇద్దరు ప్రేమికులు ఓ సినిమాలో ఓ పాటను బాధగా పాడుకున్నారు. అసలు గోడలుంటేనే కదా ఒక ఇల్లయ్యేది? మరి వీరి బాధేమిటి? ఇళ్లను కూల్చేసి రోడ్లమీద పడి ఉందాం అనే ఉద్దేశమా? కాదు కదా? ఆ ఇంట్లో వారికి ఈ ఇంట్లో వారికి మధ్యలో ఏవో గొడవలు ఉన్నాయని కదా వారి ఉద్దేశం? అంటే వారు చెప్పిన గోడలు ఆ ఇండ్లలోని మనుషుల మనసుల్లో ఉన్నాయన్న మాట! "ఓ! అవునా! అర్థమైంది కాని, ఈ మనుషుల మనసుల్లో గోడలను ఏ మెటీరియల్ తో కడతారబ్బా" అనే సందేహం కూడా రావచ్చు. పైన చెప్పిన అరిషడ్వర్గాలలో ఏదో ఒకటి ఇటువంటి గోడలకు మెటీరియల్ అయ్యుంటుంది.
ఇలా గోడలు అసమానతలు సృష్టించడం ప్రారంభించేసరికి, ఆ గోడలను సాహసించి దూకేవారు కూడా తయారయ్యారు. ఆ దూకినవారు మునుపటి కాలంలో ఉండిన సమానతను మరలా తెచ్చిపెట్టగల ధీరులని సామాన్యులు భావించడం వల్ల వారిపట్ల గౌరవం ఆరాధనభావం కలిగాయి. వారు గొప్ప కథానాయకులయ్యారు. పాతాళభైరవి తోటరాముడు, కోటగోడను గెంతి రాకుమారి మనసునే కాక జనాల అభిమానాన్ని కూడా గెలుచుకున్నాడు. మల్లీశ్వరికోసం కోటగోడ దూకిన నాగరాజుపై మహాప్రభువులు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహించక అనుగ్రహించారు. బజిరంగీ భాయిజాన్ సరిహద్దును గెంతి పాకిస్తాన్ ప్రజల మెప్పును కూడా పొందాడు. అత్తారింటికి దారేదంటూ పోయి ఆమె మనసులోని గోడలను కూలగొట్టి పుట్టింటికి రప్పించిన అల్లుడు అందరి మెప్పునూ పొందాడు. ఇలా గోడలు దూకిన కథలు, గోడలు పగలగొట్టిన కథలు ప్రపంచసాహిత్యం నిండా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. జనాలు వాటిని ఎంతగానో అభిమానించారు. అభిమానిస్తూనే ఉన్నారు. నిజంగా అసమానతలు లేకుంటే ఈ కథలకు ఇంతటి ఆదరణ లభించి ఉండేది కాదు. గోడలు దూకినందుకు ఈ కథానాయకులందరూ తప్పక దండనార్హులై ఉండేవారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికో సరిహద్దులో గోడ కడతానంటున్నాడు. కొన్ని దేశాల వలసదారులు, శరణార్థులు తమ దేశంలోనికి రాకూడదంటూ శాసనాల గోడలు కడుతున్నాడు. ఈ పనులన్నీ అమెరికా ప్రజల రక్షణకోసమేనని ఆయన అంటున్నాడు. కాదు కాదు, మీ విద్వేషమే దీనికి కారణమని కొందరు ప్రపంచవ్యాప్తంగా గొంతెత్తుతున్నారు. ఇదో పెద్ద రగడైంది.
ఇవన్నీ రక్షణ కోసం కడుతున్న గోడలా లేక అరిషడ్వర్గాల మెటీరియల్ తో కట్టబడుతున్న గోడలా అనేది జరగబోయే చరిత్రలో తేలిపోతుంది. ఈ గోడలకు మన కాలంలో పునాదులు త్రవ్వబడుతూ ఉండటం మాత్రమే మనం చూస్తున్నాం. ఇవి శాశ్వతంగా నిలిచే గోడలా కాదా అన్నది మన కాలంలోనే తెలియవచ్చు, లేదా తెలియకపోవచ్చు కూడా.