దొరికినకాడికి దండుకుందాం రండి...

Asianet News Telugu  
Published : Jan 31, 2017, 05:01 AM ISTUpdated : Mar 28, 2018, 04:58 PM IST
దొరికినకాడికి దండుకుందాం రండి...

సారాంశం

Stockholm syndrome అనే ఓ మాటుంది. దీనికి సరళమైన అర్థం ఏమిటంటే తమను చెరబట్టిన వారిని అర్థం చేసుకునే తత్వం. వారిపై సానుభూతి చూపించడం. వారిలో హీరోదాత్తతను చూసి తమకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోవటం. వారిని క్షమించడం. ’కుటుంబం కుటుంబమే ఉప్మాతిని బతుకుతున్నారా’ అని ఏదో సినిమాలో మహేష్ బాబు అన్నట్టు - వర్తమాన సమాజం తమను చెరపట్టిన వారిని భరిస్తోంది, క్షమిస్తోంది. అంతేకాదు వారిని ’అర్థం చేసుకుంటోంది’. అసంఖ్యాక అవినీతి బాగోతాల్ని విని బతుకుతోంది. ఎంత ప్రమాదకరమెంత దారుణమెంత విషాదం!

 

ఆ ఉపోద్ఘాతానికి ఇంకా సింపుల్ అర్థం - 'ఆడు మగాడ్రా బుజ్జీ' ! 

 

అందంగా ఉండడం, తెలివితో ఉండడం, చక్కగా మాట్లాడడం, ధనికంగా ఉండడం, ఆధునికంగా ఉండడం, ఆరడుగులు ఉండడం, ఆరు ప్యాకులతో ఉండడం, అధికారంలో ఉండడం - ఇవీ తులమానాలు. కొలమానాలు. సహజ న్యాయం అనేదేమీ లేదు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఈ విశేషణాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఆదరణ. మనదేశం స్వేచ్చావాయువులు పీల్చడం మొదలుపెట్టి 70 ఏళ్ళు కావస్తున్నది. ఎపుడో 1969లో ఇందిరా గాంధీ గరీబీ హఠావో నినాదం యిస్తే, నిన్న మొన్న మీడియాలో వచ్చిన రిపోర్టు దేశంలో ధనికులకు పేదలకు మధ్య వ్యత్యాసం తారాస్థాయిలో ఉందని. ఈ డెబ్భై ఏళ్ళలో మనం నిజానికి సాధించింది ఏమీ లేదని.  తాతలు తాగిన నేతుల వాసన చూస్తూ జబ్బలు ఎగరేసుకోవడం తప్ప మరింకేమీ మనం చేసేందుకు కనపడడం లేదని. బహుశా ఈ స్వస్వరూప జ్ఞానపు వెలుగు భరించలేకే 'స్టాక్‌హోమ్ సిండ్రోమ్' కు గురి అవుతాం అనుకుంటా. 

 

'ఏమైనా కానీ ఆయన అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు'

'తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నాడు'

'ఎవరు చేయడం లేదు అవినీతి? ఈయన ఒక్కడేనా చేసింది?'

'అసలు కుటుంబం మొత్తం యెంత మంచి వక్తలు'

 

ఇలా మానసిక భావప్రాప్తులతో కాలం గడపడం వల్ల ఇంక మనం చేయాల్సిన పనులేమీ ఉండవు. ఆ నిశ్చింతతో వీకెండ్ కోసం ఎదురు చూస్తూ గడిపివేయవచ్చు.

 

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ, వ్యాపార, సినీ, మీడియా కుటుంబాలనూ... వారిముందు మోకరిల్లుతున్న నాగరక జనాన్ని చూస్తే జాలీ కోపమూ రావడం లేదూ? లేదు. అసహ్యం వేస్తున్నది. సంస్కారం నేర్పని, తర్కానికి తావులేని తామరతంపర 'మర్యాదపురుషులు'గా తయారవుతున్న నవీన నాగరీక యువతను చూస్తే నీరసం వస్తున్నది. 

 

'సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా' అని మధురవాణి అన్నట్టు... పోనీ, అంతా కలిసి ఓ పనిచేద్దామా? ప్రభుత్వాల లాగే మనమూ 'క్రమబద్ధీకరణ' చేసేద్దాం. అన్ని రంగాల్లో అవినీతి, బంధుప్రీతి, ధనస్వామ్యాలను చట్టబద్దం చేసి, అందులో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి యిచ్చేయమందాం. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుంది. 

 

హిపోక్రసీ పక్కన పెట్టి... నీతిలోనో అవినీతిలోనో నా వాటా అడగడం కోసం సిద్దంగా ఉన్నాను. మెజారిటీ ప్రజలు కోరుకునేది భవ్య భారతమైనా భ్రష్ట భారతమైనా - వారి తీర్పును గౌరవిస్తానని హామీ ఇస్తున్నాను.

 

మరి, మీరు? 

PREV
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?