హంద్రీ నదిలో పారింది నీళ్ల కంటే రక్తమే జాస్తి

 |  First Published May 26, 2017, 10:44 AM IST

 

Latest Videos

undefined

హంద్రి నదిలొ నీళ్లు లేవు కాని హంద్రి పరివాహక గ్రామాల్లొ నెత్తురు నిత్యం ఊరుతుంది.తినటానికి తిండి లేక ఈప్రాంత ప్రజలు చెన్నై-బాంబే రైలు ఎక్కి బొంబాయికి సుగ్గి(వలస) పోతుంటే ఫ్యాక్సన్ నాయకులు ఆధిపత్యం కోసం హత్యలు చేస్తున్నారు/చేయిస్తున్నారు. ప్రతి మరణం మీద నాకు సానుభూతి వుంది,కాని హంతకులు అందరు విలన్లు; హతులందరు హీరోలు కారు,అసలు ఫ్యాక్సన్ కథల్లొ హీరోలు వుండరు.ప్రజలు మాత్రం ఎప్పుడు బాధితులే.

 

ఈ పొస్టును రాజకీయాలు పక్కన పెట్టి చదవండి,ఫ్యాక్సన్ రక్కసికి బలైన కుటుంబాల కోణంలో చూడండి.


చారిత్రకంగా పత్తికొండ ప్రాంతం విజయనగర సామ్రాజ్య కేంద్రాలైన ఆదోని,గుత్తి మధ్య వుంది.హంద్రి నది ఈ ప్రాంతంలొ పశ్చిమ దిశగా ప్రవహించి కర్నూల్ నగరం మధ్య నుంచి (రాజవిహార్- ప్రభుత్వ హాస్పిటల్ మధ్య పారే మురికి కాలువ హంద్రి నదే!) పారి తుంగభద్రా నదిలొ కలుస్తుంది. ఈ పత్తికొండ ప్రాంతంలొ పత్తికొండ,కోటకొండ/తెర్నేకల్, కప్పట్రాల్ల,మద్దికేర,దేవనకొండ అనే ఐదు పాలెగాళ్ళ జాగీర్లు వుండేవి.ఈ ఐదు జాగీర్లను కలిపి "పంచ పాళం"గా అంటారు.


1802లో తెర్నేకల్ పాలెగాడు "ముత్తుకూరు గౌడప్ప" బ్రిటీష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు.కొన్ని రోజుల యుద్దం తరువాత బ్రిటీష్ పోలీసులు గౌడప్పను పట్టుకోని ఉరితీశారు. తెర్నేకల్లులొ ఇప్పటికి పాత కట్టడాలు వున్నాయి. 1810 నాటికే పాలెగాళ్ల వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకోని పోయింది.ఈ పత్తికొండ ప్రాంతంలొ విజయనగర సామ్రాజ్యం సైన్యంలొ ప్రధాన భూమిక పోషించిన "బోయ" జనాభ ఎక్కువ. తరువాత కురబలు,గొల్లలు,ఈడిగ(గౌడ్లు,శెట్టిబలిజలుగా ఇతర ప్రాంతాల్లొ పిలుస్తారు).


పత్తికొండ ప్రాంతంలో హంద్రి నది వున్నా అక్కడ తాగు నీటికి ఇప్పటికి ఇబ్బందే.ఈప్రాంతంలొ వేల ఎకరల్లో వున్న ఈత చెట్లు స్థానిక ప్రజలకు ప్రధాన జీవనోపాధి.ఇంత వెనుకపడ్డ ప్రాంతంలొ మిగిలిన రాష్ట్రంలో మరెక్కడ లేనంత మంది ఫ్యాక్సన్ నాయకులు వున్నారు.ప్రతి 3,4 ఊర్లకు కలిపి ఒక ఫ్యాక్సన్ నాయకుడు వున్నాడు.ఒక మండలంలో ఇద్దరు,ముగ్గురు ఫ్యాక్సన్ నాయకులు వున్నారు.

  
పేరుకు చిన్న ఫ్యాక్సన్ నాయకులే కాని ఈప్రాంతంలో జరిగినన్ని హత్యలు మరెక్కడ జరగలేదు,ప్రభుత్వ రికార్డుల ప్రకారమే కనీసం 250 మందికి పైగా ఫ్యాక్సన్లొ చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 500 కన్నా చాలా ఎక్కువ వుంటుంది. కప్పట్రాల్ల వెంకటప్పయ్య నాయుడు (ఫోటో) ఒక్కడే 200 మందిని చంపాడని స్థానికులు చెప్తారు.


పత్తికొండ నియోజకవర్గంలొ ముగ్గురు ఎమ్మెల్యేలు(ఒకరు సిట్టింగ్, ఇద్దరు మాజిలు),ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ప్రత్యర్ధుల చేతిలొ హత్యకావించపడ్డారు.పత్తికొండ లో  హత్యారాజకీయాలు  1979 నుంచి మొదలయ్యాయి.


ఎర్రగుడి ఈశ్వర రెడ్డి (ఇంటిపేరు కంకిరెడ్డి,ఊరిపేరు ఎర్రగుడి. ఊరి పేరుతో పిలవటం ఇక్కడి అలవాటు.) 1955లో ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టి తరుపున పోటిచేసి కాంగ్రేసు హనుమంతారెడ్డి చేతిలో ఓడిపోయారు.1957లో హనుమంతారెడ్డి అకాల మరణం(సహజ)తో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ లక్ష్మినారయణ రెడ్డి గెలిచారు.

 

1962లొ జరిగిన ఎన్నికల్లొ కురబ వర్గానికి చెందిన నరసప్ప గెలిచారు.నరసప్ప ఈప్రాంతంలొ బలమైన నాయకుడిగా ఎదిగారు.1962,72,78లో గెలిచాడు.1974లో వెంగళరావ్,1978 చెన్నారెడ్డి మంత్రి వర్గాల్లొ మంత్రిగా పనిచేశారు.


1964లో సిపిఐ నుంచి చీలి సిపిఎం ఏర్పడింది.ఎర్రగుడి ఈశ్వర రెడ్డి సిపిఎం తరుపున 1967లొ కాంగ్రేస్ నరసప్పను ఓడించి గెలిచాడు.1972,1978లొ పత్తికొండ నుంచి సిపిఎం,సిపిఐ  పోటిపడటం వలన కాంగ్రేసు నరసప్ప సులభంగా గెలిచారు.


1978లో పత్తికొండ సమితి అధ్యక్షుడైన "పాటిల్ రామకృష్ణా రెడ్డి" ఇండిపెండెంటుగా పోటి చేసి రెండవ స్థానలో నిలిచి నరసప్ప చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.సిపిఎం ఈశ్వరరెడ్డికి 9,500 ఓట్లు వచ్చాయి. ఎన్నికలు ముగిసిన తరువాత సిపిఐ & కాంగ్రేసులోని కొందరు స్థానిక నాయకులు కలిసి ఈశ్వరరెడ్డిని 04 ఆగస్టు -1979న బస్సులొ నుంచి దింపి చంపారు. ఈశ్వరరెడ్డికి ఫ్యాక్సన్ లేదు,శత్రువులు కూడ లేరు.కేవలం రాజకీయ కారణాలతోనే చంపారు.ఈశ్వరరెడ్డి హత్య పత్తికొండ హత్యా రాజకీయాల్లొ మొదటి నాయకుడి హత్య.


2.మహబలేశ్వర గుప్త


1983 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి హవా కొనసాగినా కర్నూల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రేస్ 4 ఎమ్మెల్యే స్థానాలు (ఎమ్మిగనూర్, కోడుమూర్,డోన్,పత్తికొండ) కోట్ళ విజయభాస్కర్ రెడ్డి ప్రభావంతో కాంగ్రేస్ గెలిచింది.


ఫ్యాక్సన్ నియోజకవర్గాలైన డోన్,పత్తికొండలో టిడిపి "వైశ్యు"లను పోటికి దించింది.డోన్లో కాంగ్రేస్ తరుపున కెఇ కృష్ణమూర్తి టిడిపి సేగు వెంకట రమణయ్య శెట్టి మీద,పత్తికొండలో కాంగ్రేస్ తిమ్మారెడ్డి టిడిపి మహబలేశ్వర్ గుప్త మీద గెలిచారు.


1985 ఎన్నికల్లొ పత్తికొండ నుంచి టిడిపి మహబలేశ్వర గుప్త కాంగ్రేస్ పాటిల్ రామకృష్ణా రెడ్డి మీద 3500 స్పల మెజారిటితో గెలిచారు. మహబలేశ్వర గుప్త ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే 27-Apr-1985న పత్తికొండ పోలీస్ స్టేషన్ దగ్గరే ఒడిపోయిన రామకృష్ణా రెడ్డి కిరాయి హంతకులతో చంపించాడు .


3.పాటిల్ రామకృష్ణా రెడ్డి

 

మహబలేశ్వర గుప్త హత్యకు ప్రతీకారంగా ఆయన భార్య "సుబ్బరత్నమ్మ" భర్త చనిపోయిన 50 రోజుల్లోపే 11-Jun-1985న కర్నూల్ టౌన్లో సిల్వర్ జూబ్లి కాలేజి దగ్గర కిరాయి హంతకులతో చంపించారు.


4. పాటిల్ శేషి రెడ్డి

1989 ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఫ్యాక్సన్ సంబంధం లేని వారికి కాంగ్రేస్ తరుపున టికెట్ ఇవ్వలని తలచి యువకుడు MSC(Agri)లో Gold Medal సాధించిన "పాటిల్ శేషిరెడ్డి"కి టికెట్ట్ ఇచ్చారు.అంతకు ముందు హత్య చేయబడ్డ రామకృష్ణా రెడ్డి,ఈ శేషిరెడ్డి ఇద్దరి ఇంటిపేరు "పాటిల్" కాని వీరికి దగ్గరి బంధుత్వంలేదు.శేషిరెడ్డి తండ్రి తెర్నేకల్ సోమిరెడ్డి 600 ఎకరాల భూస్వామి,వీరికి ఫ్యాక్సన్ లేదు.


శేషిరెడ్డి 1989లో TDPకి చెందిన కొత్త నాయకుడు హచ్చప్ప మీద గెలిచాడు.శేషిరెడ్డి అనుచరులు "అగ్రహారం ప్రభాకర రెడ్డి" తండ్రిని స్థానిక గొడవల్లొ చంపారు.ఈహత్యలొ శేషిరెడ్డి పాత్రలేదు కాని ప్రతర్ధులు సహజంగానే శేషిరెడ్డి చంపించాడని భావించారు.1996 లోక్ సభ ఎన్నికల్లొ కోట్ల తరుపున గోనుగుండ్లకు ప్రచారానికి వెళ్ళిన శేషిరెడ్డిని "పరప్ప" అనే వ్యక్తికి చెందిన రైస్ మిల్లులొ ప్రభాకర్ రెడ్డి వర్గం హత్యచేసింది.పరప్పను కూడ శేషిరెడ్డితో పాటు చంపారు. 2009లొ శేషిరెడ్డి భార్య "నీరజరెడ్డి" కాంగ్రేస్ తరుపున ఆలూరు నుంచి MLAగ గెలిచారు.భర్త శేషిరెడ్డి హత్యకు ప్రతీకారంగా ప్రభాకర్ రెడ్డి మరియు అతని బావమరిది లక్ష్మికాంత్ రెడ్డిలను కర్నాటకలో చంపించి వేరు వేరు ప్రాంతాల్లొ పూడ్చిపెట్టారని కర్ణాటక పోలీసుకు నీరజా రెడ్డి మీద కేసు పెట్టారు,కేసు ఇప్పటికి కొనసాగుతుంది.

 

5.కప్పట్రాల్ల వెంకటప్పనాయుడు

 

1994లో టిడిపి ఎస్వీ సుబ్బారెడ్డికి పత్తికొండ నుంచి టికెట్టు ఇచ్చింది. ఎస్ వి సుబ్బారెడ్డి అంతకు ముందు పలుసార్లు ఆళ్ళగడ్డ నుంచి కాంగ్రేస్,ఇండిపెండేంటుగా,1983లో టిడిపి తరుపున ఎమ్మెల్యే గా గెలిచారు.సుబ్బారెడ్డిగారు నాదెండ్ల వర్గంలోకి వెళ్ళటంతో 1985లో ఆయనకు కాకుండ ఆయన భార్య మేనల్లుడు "భూమా శేఖర్ రేడ్డి"కి(భూమా నాగిరెడ్డి అన్న) టిడిపి టికెట్టు ఇచ్చింది. 1989లొ కూడ శేఖర్ రేడ్డికే ఇవ్వటంతో సుబ్బారెడ్డి కాంగ్రేసులో చేరి కోయిలకుంట్ల నుంచి 1989లో పోటిచేసి ఓడిపోయారు.


 

పత్తికొండ హత్యలతో టిడిపి  కొత్తవారికి టిక్కెటు ఇవ్వాలని సుబ్బారెడ్డి గారికి టికెట్టు ఇచ్చింది.సుబ్బారెడ్డిగారిది ఆళ్ళగడ్డ అయిన ఆయిన కూతురు నాగరత్నమ్మ & అల్లుడు రామచంద్రా రెడ్డి పత్తికొండలొ సినిమా హాల్ & లిక్కర్ షాపులు నడపుతుండటంతో ఆప్రాంతంలో మంచి సంబంధలు వుండేవి. సుబ్బారెడ్డి  94,99,2004లో పత్తికొండ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. సుబ్బరెడ్డిగారి రాకతో పెద్దనాయకుల హత్యలు ఆగిపోయినా టిడిపి మండల స్థాయి నాయకుడిగా వున్న "కప్పట్రాల వెంకటప్పయ్య నాయుడు" విపరీతమైన హింసకు పాల్పడ్డాడు.


కప్పట్రాల వెంకటప్పయ్య నాయుడు "బోయ" నాయుడు,వీరి పూర్వికులు విజయనగర సైన్యంలో నాయకులు.కప్పట్రాల అనే చిన్న ఊరి గోడవల్లొ వందల మంది ఇరువర్గాల గొడవల్లొ చనిపోయారు. కప్పట్రాల ఫ్యాక్సనులో ముఖ్యులైన కళావంతుల(చేనేత వర్గం),వారం(చేనేత వర్గం),ఎరుకల కిష్ట్రప్ప ,వెంకటప్పయ్య నాయుడు(బోయ) అందరు బలహీన వర్గాలకు చెందినవారే!ఎవరు భూస్వాములు కాదు,1996 ముందు కనీసం మండల స్థాయి పదవులు కూడ వీరికి లేవు.


కళావంతుల వర్గానికి చెందిన "వారం" కిష్టప్ప కప్పట్రాల్ల గ్రామానికి 1955 ప్రాంతం నుంచి 20 సంవత్సరాలకు పైగా సర్పంచ్ గా పనిచేశాడు.కిష్టప్ప దాదాపు 16 గ్రామాల మీద ఆదిపత్యం చేసేవాడు.అప్పట్లో వెంకట్టప్పయ్య చిన్న పిల్లొడు, వారం కిష్టప్పతో సత్ సంబంధాలు వుండేవి. వెంకటప్పయ్య పెద్దవాడయ్యక స్థానిక కరణం అతన్ని నాయకుడిని చెయ్యటానికి బాగా సహకరించాడు.

27 సంవత్సరాల వయస్సులొ వెంకటప్పయ్య కప్పట్రాల్ల సర్పంచ్ అయ్యాడు.ఇక్కడి నుంచి కప్పట్రాల్ల ఫ్యాక్సన్ మొదలైంది.వారం కిష్టప్ప అల్లుడు వెంకటప్పనాయుడి ఇంటి మీద 1975/76లో వెంకట్టప్ప వర్గం దాడి చేయగ రంగప్ప చనిపోయాడు. 1976లో కోటకొండలో రంగన్న,చిన రంగన్న,బోయ బొజ్జన్నలను వెంకటప్పయ్యనాయుడు వర్గం హత్యచేసింది.ఈహత్యలతో వారం కిష్టప్ప గ్రామన్ని వదిలి వెళ్ళాడు. 1980లొ వెంకటప్పయ్య మీద శత్రు వర్గం కర్నూల్ టౌన్ల్లొ దాడి చేసి చనిపోయాడని వదిలేసి పొయ్యారు.కొన ఊపిరితో వున్న వెంకటప్పయ్యను కెఇ తండ్రి,మాజి ఎమ్మెల్యే అయిన "మాదన్న" ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికించాడు.అప్పటి నుంచి వెంకటప్పయ్య కెయి అనుచరుడిగా వున్నాడు.


1989లో కాంగ్రేసు అధికారంలోకి రావటంతో వెంకటప్పయ్య ఫ్యాక్సనుకు బ్రేకులు పడ్డాయి,పైగా ఆయన గురువుకెఇ కూడ 1989లో కాంగ్రేసులొ చేరి ఎమ్మెల్యే అయ్యాడు. కోట్ల ముఖ్యమంత్రి అయిన తరువాత వెంకటప్పనాయుడు కోట్ల వర్గంతో రాజీ చేసుకున్నాడు. 1994లొ టిడిపి గెలవటం,1998లో కెఇ  మళ్ళి టిడిపి లో చేరటంతో వెంకట్టప్పయ్య ఫ్యాక్సన్ హింస పెరిగింది.


వెంకటప్పయ్య నాయుడు సొంత బావ మాదారపు రంగప్పనాయుడు శత్రువులతో చేతులు కలిపాడన్న అనుమానంతో 1998లో పత్తికొండ లోని హోటల్లో వెంకట్టప్పయ్య చంపించాడు.వెంకటప్పయ్యనాయుడు 1998లొనే తన గురువు అయిన కరణం బంధువు విశ్వనాథశర్మను చంపించాడు.వెంకటప్పయ్య నాయుడు ప్రతర్ధ్యులు వారం మునిరంగడు, ఎరుకల కృష్ణ 1998లొ పోలీసు ఎంకౌంటర్లొ చనిపోయారు.1995-1999 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీస్ ఎంకౌంటర్లలో టిడిపి నాయకుల ప్రతర్ధ్యులు మాత్రమే చనిపోవటం,ఒక్క టిడిపి మద్దతు దారుడు కూడ చనిపోకపోవటం అప్పట్లొ విమర్శలకు దారి తీసింది.


2001లో కప్పట్రాల్లొ వెంకట్టప్పయ్య నాయుడి ఇంటి మీద ప్రత్యర్ధ్యులు దాడి చేశారని,వెంకట్టప్పయ్య ప్రతిదాడిలొ 7 మంది చనిపోయారని పత్రికల్లొ వార్తలు వచ్చాయి.అసెంబ్లీలో దీని మీద పెద్ద చర్చ జరిగింది.వెంకట్టప్పయ్యే ప్రత్యర్ధులను వెంటాడి చంపాడని కాంగ్రేసు ఆరోపించింది.


2001లొ వెంకట్టప్పయ్య టిడిపి తరుపున కర్నూల్ జిల్లా పరిషత్తు చైర్మనగా అవుతారని ప్రచారం జరిగింది.ఫ్యాక్సన్ వలన బాబుగారు వెంకట్టప్పయ్య చైర్మన్ను చెయ్యలేదని SV వర్గం, వెంకట్టప్పయ్య జడ్ పి ఛెయిర్మన్ అయితే భవిషత్తులో ఎమ్మెల్యే  సీటుకు పోటిపడతాడని కెఇ నే అడ్డుకున్నాడని మరో వర్గం ప్రచారం చేసింది.2004లో కాంగ్రేస్ ప్రభుత్వం రావటంతో వెంకటప్పయ్య ఆత్మ రక్షణ ధోరణిలో పడ్డాడు,ప్రత్యర్ధ్యులతో రాజికి ప్రయత్నం చేశాడు కాని వారు అంగీకరించలేదు.


17-మే-2008న కోర్టుకు వెళ్తున్న వెంకటప్పయ్య నాయుడు వాహనాన్ని లారితో కొట్టి బాంబులు వేసి కత్తులతో నరికి చంపారు.ఆవిధంగా వెంకటప్పయ్య నాయుడు చరిత్ర ముగిసింది. వెంకటప్పయ్య నాయుడు హత్యలో వారం కిష్టప్ప కూతురు పద్మ (ఫోటో),కళావంతుల ప్రభాకర్,మద్దిలేటి నాయుడు(వెంకటప్పయ్య చంపించిన సొంత బావ రంగప్ప కొడుకు) కాంగ్రేస్ నాయకులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి,చెరుకులపాడు నారాయణ రెడ్డితో సహా 23 మంది నిందితులు. ఆదోని కోర్టు కోట్ల హరి చక్రపాణి రెడ్డి,చెరుకులపాడు నారాయణ రెడ్డిల మీద కేసు కొట్టేసింది,మిగిలిన 21 మందికి జీవిత ఖైదు విధించింది.


6.చెరుకులపాడు నారాయణరెడ్డి


ఫ్యాక్సన్ సమసిపోయింది గత 10 సంవత్సరాలుగా పత్తికొండ ప్రశాంతంగా వుంది అనుకుంటున్న సమయంలొ గత వారం చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్ధులు హత్యచేశారు.


నారాయణ రెడ్డి వెల్దుర్తి మండల స్థాయి నాయకుడు,ఈమధ్య పత్తికొండ నియోజకవర్గ స్థాయికి ఎదిగాడు.సొంత ఊరు చెరుకులపాడులొ ఫ్యాక్సన్ వుంది.


1983లో చెరుకులపాడు నారాయణరెడ్డి తండ్రి శివారెడ్డి అనుచరులు, బోయ పెద్ద ఎల్లప్ప,చిన్న ఎల్లప్ప అనే ఇద్దరిని చంపారు.1988 అక్టోబర్లొ పెద్ద ఎల్లప్ప కుమారులు శివారెడ్డిని చెరుకులపాడులో చంపారు. ఎల్లప్ప కెయి వర్గం వాళ్లు.దీనితో చెరుకులపాడు నారాయణరెడ్డికి కెయి కుటుంబానికి పరోక్ష్య ఫ్యాక్సన్ మొదలైంది.శివా రెడ్డి హంతలుకు నారాయణరెడ్డి వర్గం ఎమ్మిగనూర్లో అయ్యప్ప స్వామి దుస్తుల్లొ వెళ్ళి చంపారు.2006 లో నారాయణరెడ్డి వర్గం బీసన్న అనే అతన్ని చంపారు. బీసన్న కూడ నారాయణరెడ్డి వర్గమే కాని ఊర్లో వచ్చిన తగాదల వలన వచ్చిన విభేధాలతో చంపారు.బీసన్న భార్య నారాయణరెడ్డితో రాజి కావటంతో కేసు వీగిపోయింది.


2004లో పత్తికొండ నుంచి కాంగ్రేసు తరపున ఓడిపోయిన నీరజా రెడ్డి 2009 నియోజకవర్గాల పునఃవిభజన తరువాత ఎస్ సి రిజర్వుడు నుంచి జెనరల్ సీటుగా మారిన "ఆలూరు" నియోజకవర్గం నుంచి పోటి చెయ్యటంతో చెరుకులపాడు నారాయణరెడ్డి కాంగ్రేసు తరుపున పత్తికొండ టిక్కెటు ఆశించారు.అప్పటివరకు టిడిపి లో వున్న ఎస్వీ సుబ్బారెడ్డి కుటుంబానికి కాదని బాబుగారు  కెఇ తమ్ముడు,మాజి మంత్రి అయిన కెఇ ప్రభాకరుకు టికెట్టు ఇవ్వటంతో చివరి నిముషంలొ ఎస్వీ కుటుంబం కాంగ్రేసులొ చేరి ఎస్వీ మోహన్ రెడ్డి టిక్కెట్ తెచ్చుకున్నారు.

 


నారాయణరెడ్డిని సంతృప్తి పరచటానికి 2013లో ఆయన భార్య శ్రీదేవిని జిల్లాసహకార బ్యాంక్ చైర్మెన్ చేశారు.


స్థాయి పెరగటమొ లేక వయస్సు తెచ్చిన మార్పో కాని నారాయణరెడ్డి 2009 తరువాత నుంచి ఫ్యాక్సనుకు పూర్తి దూరంగా వుంటు నియోజకవర్గ అభివృద్ధి పనులు చూసు కున్నారు. పత్తికొండ ప్రాంతంలో హంద్రి-నీవ పనుల్లొ చాలా ముఖ్యపాత్ర పొషించాడు.


2014లొ పత్తికొండ నుంచి కాంగ్రేసు తరుపున పోటిచేసి 32,000 ఓట్లు సాధించారు.పత్తికొండ నుంచి మొదటిసారి పోటిచేసిన (అప్పటి వరకు డోన్ నుంచి పోటి చేశేవారు) K.E.కృష్ణమూర్తి YCP కోట్ల హరిచక్రపాణి మీద కేవలం 7,600 మెజరిటీతో గెలిచారు.


2014లో కాంగ్రేసు తరుపున బొత్సా సొదరుల తరువాత అత్యధిక ఓట్లు వచ్చింది చెరుకులపాడు నారాయణరెడ్డికే!


2014 ఎన్నికల్లొ YCP తరుపున ఓడిపోయిన కోట్ల హరి ఒకదశలొ TDPలో చేరుతారని వార్తలు వచ్చాయి,ఆయన వివిధ కారణాలతో రాజకీయంగా స్థబ్ధంగా వుండిపోయారు.YCP నారయణరెడ్డిని పత్తికొండ ఇంచార్జిగా నియమించింది.


2019 ఎన్నికల్లొ కెఇ వారసుడు శ్యాం పొటిచేస్తాడని కెఇ ప్రకటించాడు.


2014 ఎన్నికల తరువాత అక్రమ ఇసుక అధికార పార్టి నాయకులకు ప్రధాన ఆదాయ వనరు అయ్యింది.


పత్తికొండ పరిధిలొ హంద్రి నదిలొ అక్రమ ఇసుకు రవాణాకు టాక్టర్లు పోవటానికి వీలుగా నదిలొపలికి ట్రాక్ నిర్మించారు.దీని మీద నారాయణరెడ్డి ఆధ్వర్యంలొ కొందరు రైతులు హైకోర్టుకు వెళ్ళారు.హైకోర్టు ఈ విషయం మీద తీవ్రంగా స్పందించింది.

 


ఇసుక అక్రమరవాణ అధికార పక్ష్యం చేస్తుందా లేక అధికారంలో లేని వారు చేస్తారా? అన్నది అందరికి తెలిసిందే! కాని కొర్టుకు సాక్ష్యాలు కావాలి,సాక్ష్యాలు ఇసుక ర్యాంపుల కింద పూడిచి పెట్టిన తరువాతే అక్రమ రవాణా జరిగేది!


చెరుకులపాడు నారాయణరెడ్డికే 2019లొ వైసిపి టికెట్టు అని ప్రకటించటం కెఇ వర్గానికి మింగుడు పడని విషయమే కెఇ శ్యాం నారాయణరెడ్డి వ్యతిరేక వర్గానికి ఆర్ధికంగా సహాయపడుతు, వర్గాన్నిపెంచుకోవటానికి గ్రామాల్లొ జాతరలు,శుభకార్యాలు ఘనంగా జరిపిస్తున్నాడని నారాయణ రెడ్డి వర్గం ఆరోపించింది.


మొన్న 21-మే -2017న నారాయణరెడ్డి వాహనాన్ని ట్రాక్టర్లతొ ఢీకొట్టి కత్తులతో నరికి బండరాళ్ళతో తల పగలకొట్టి ప్రత్యర్ధ్యులు చంపారు.బీసన్న కొడుకు రామాంజనేయులు మొదటి ముద్దాయిగా, కెఇ శ్యాం 14వ ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు.


నారాయణరెడ్డి లైసెన్సుడు రివాల్వర్ రెన్యువల్ గత 50 రోజులుగా పెండింగులో వుంది.నారాయణరెడ్డి దగ్గర తుపాకి లేదన్న విషయం ప్రత్యర్ధ్యులకు తెలియటం వలనే దాడిచేసి చంపారని నారాయణరెడ్డి కుటుంబం ఆరోపించింది. నారాయణరెడ్డి ఇంటి మీద గత మార్చిలొ ప్రత్యర్ధ్యులు దాడి చేశారు.మార్చిలోనే నారాయణ రెడ్డి హైకోర్టులో వేయించిన ఇసుక అక్రమ రవాణా కేసు మీద కొర్టు తీవ్రంగా స్పందించింది అయినా పోలీసులు ఆయన రివాల్వర్ రెన్యువల్ మీద నింపాదిగా వ్యవహరించారు. 1996లో శేషిరెడ్డి హత్య జరిగినప్పుడు కూడ ఆయనకు సెక్యూరిటి లేదు.ఆయన సెక్యూరిటి కోసం హైకోర్టుకు వెళ్ళారు,విచారణ జరక్కముందే హత్యకు గురయ్యారు.


సెక్యూర్టి లేనప్పుడే ప్రతిపక్ష్య నాయకులు హత్యలు గురికావటం మీద ఎవరు అనుమానాలు వ్యక్తం చెయ్యకుడదు...ప్రభుత్వం ఫ్యాక్సన్ను ఉక్కుపాదంతొ అణిచివేస్తుంది,చట్టం తన పని తాను చేసుకోని పోతుంది...చనిపోయిన ప్రతిపక్ష్య నాయకుల సమాధుల సాక్ష్యంగా!


ఇది చదివి ఫ్యాక్సన్ను అసహ్యించుకొండి...వారి పార్టి అధికారంలొ లేనప్పుడు ఫ్యాక్సన్ నాయకుల ప్రాణాలకు గ్యారెంటిలేదు,వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరం.

 

click me!