పురుషోత్తపట్నమా! గాలేరు-నగరి రెండవ దశ నిర్మాణమా! దేనికి ప్రాధాన్యత నీయాలి?
undefined
నిర్థకమైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ,1988లో నాటి ముఖ్యమంత్రి కీ.శే.యన్.టి.ఆర్. శంకుస్థాపన చేసిన గాలేరు - నగరి సుజల స్రవంతి, రెండవ దశ నిర్మాణంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టక పోగా, అలసత్వం ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఏమనాలి?
ఈ రోజు దినపత్రికల్లో సమాచార శాఖ విడుదల చేసిన 'నీరు-ప్రగతి' ప్రకటన చూశాను. నదీ జలాల సద్వినియోగానికి సంబంధించి ప్రభుత్వం క్రియాశీలంగా ఆలోచిస్తున్నందుకు అభినందించాల్సిందే.
అయితే, ఈనాటి ప్రభుత్వ ప్రకటనలో కొట్టొచ్చినట్లు కనపడుతున్న పొరపాటు చూద్దాం.
గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు మ్యాప్ ను ఒకసారి పరిశీలించండి. అమరజీవి యన్.టి.ఆర్. రూపొందించిన ఈ పథకం ద్వారా నగరి వరకు సాగు నీటిని, త్రాగు నీటిని అందించడం లక్ష్యం కదా! కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన చూస్తే ఒకింత ఆశ్చర్యం కలిగింది. అన్ని ప్రాజెక్టుల మ్యాప్ లను ప్రారంభం నుండి చివరి ఆయకట్టు ఉన్న ప్రాంతం వరకు చూపెట్టారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం గండికోట జలాశయం తరువాత ఒక లైన్ గీసి 'గాలేరు- నగరి సుజల స్రవంతి' అని వ్రాసి వదిలేశారు. ఆ మ్యాప్ ను చూస్తే ప్రాజెక్టు మొదటి దశ అంటే 35,000 ఎకరాల ఆయకట్టు ఉన్న పరిథి వరకే పరిమితం చేసినట్లు బోధపడుతున్నది. ఒక వేళ కాని పక్షంలో ప్రజలకు స్పష్టత కల్పించాలని కోరుతున్నాను.
నిజంగానే ప్రాజెక్టును మొదటి దశ వరకే నిర్మాణం చేపడుతుంటే, అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. కడప,ఒంటిమిట్ట,రాజంపేట,కోడూరు, రేణిగుంట, పుత్తూరు,నగరి వరకు విస్తరించి ఉన్న 2.25 లక్షల ఎకరాలకు సాగు నీటిని సరఫరా చేసే లక్ష్యం ఇమిడి ఉన్న రెండవ దశ నిర్మాణ పనులను అటకెక్కించి కూర్చున్నారు. వార్షిక బడ్జెట్లలో నిథులను కూడా కేటాయించడం లేదు. అందు వల్లనే ఈ ప్రకటనలోని మ్యాప్ ను చూసిన మీదట అనుమానం బలపడుతున్నది.
జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు 'కాపర్ డ్యాం' నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేసి, వచ్చే ఆగస్టు నుండి 'గ్రావిటీ' ద్వారా సాగు నీరు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ప్రకటించడం అభినందనీయం. ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని ప్రసార మాధ్యమాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. ఆ వైపున పురోగతి సాధించాలని రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకొంటున్నారు.
అదే సందర్భంలో, పోలవరం ఎడవ కాలువ ద్వారా మరికొన్ని నెలల్లోనే సాగు నీరు సరఫరా కాబోతున్న ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికపై నిర్మించి, నీటి సరఫరా చేయాలని తలపెట్టటంలోని మతలబేంటన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం విధిగా సమాధానం చేప్పాలి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కాదా?
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాసులతో కళకళ లాడిపోతున్నదా? రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో లేదా? రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రతి రూపాయి అత్యంత విలువైనదిగా భావించి, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను సత్వరం పూర్తి చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో కొరవడడం క్షమార్హమా?
కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలోని గాలేరు-నగరి ప్రాజెక్టు, రెండవ దశ నిర్మాణ పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, సాగు నీటి పారుదల శాఖా మాత్యులు గానీ, ఎందుకు నోరు మెదపడం లేదు?
( *టి లక్ష్మి నారాయణ ప్రముఖ రాజకీయార్థిక విశ్లేషకుడు)