“ప్రేమ అనగానేమి?” అని ప్రశ్నింపజేసి, ప్రశ్నించినవాడితోనే “ప్రేమ అనగా రొండు హృదయాలు ఒకే పన్ థాన నడచుట” అని జవాబు కూడా చెప్పించారు, ముళ్లపూడి వెంకటరమణగారు తన “ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ” అనే కథలో.
undefined
మనకు తెలిసిన ప్రేమలన్నీ చాలా మటుకు ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సాగినవే. ప్రేయసీ ప్రియులు ఒకరికోసం మరొకరు తపించడం. వారి ఎడబాటులో విరహాన్ని అనుభవించడం. మన జీవితపు వినోదం లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన సినిమాలూ, సినిమా సంగీతమూ మొత్తంగా కాకపోయినా, అధిక శాతం ఈ అంశం పైనే వుంటాయి. ఉదాహరణకి “ప్రేం నగర్”, “ప్రేమాభిషేకం” సినిమాలూ, హిందీ చలన చిత్రం “బాబీ” అచ్చంగా ప్రేమ మీదే వచ్చిన చిత్రాలు. ఇక పాటల విషయాని కొస్తే “ఈ నాటీ ఈ బంధమేనాటిదో”, (మూగమనసులు), “చిటపట చినుకులు పడుతూవుంటే” (ఆత్మబలం), “చేతిలో చెయ్యేసి చెప్పుబావా” (దసరా బుల్లోడు), “మనసు గతి ఇంతే” (ప్రేం నగర్), లాంటి మధ్యతరం పాటలు ప్రేమభావాలకు ప్రతీకలయ్యాయి.
ఈ ప్రపంచం మొత్తం ప్రేమ గానీ, వికటించిన ప్రేమ వల్లగాని మాత్రమే నడుస్తోంది అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అంతే కాదు ప్రేమ అనేది మనిషి పొందగల్గిన ఒక మహత్తర వరం. సరైన దిశలో వుంటే ఈ ప్రేమ మనిషిలొ వ్యక్తిత్వ వికాసాన్నీ, ప్రేరణనూ కలిగించి, అతణ్ణి ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ప్రపంచాన్ని అందంగా చూపిస్తుంది. జీవితానికి నిండుదనం ఆపాదిస్తుంది. వికటిస్తే అధః పాతాళానికి తోసేస్తుంది.
సలీం అనార్కలీ, హీర్ రాంఝా, దేవదాసు పార్వతీ, రోమియో జూలియట్, షిరీన్ ఫర్హాద్, లైలా మజ్ఞు లు, ఇలా చరిత్రలో నిలిచిపోయిన ప్రేమ జంటలు ఎన్నో. కానీ ఏ ప్రేమజంట కథ కూడా సుఖాంతకం కాలేదు. సలీం మీది ప్రేమతో అనార్కలి సజీవ సమాధి అయిపోయింది. హీర్ ప్రేమలో రాంఝా దేశ ద్రిమ్మరి అయిపోయి, చివరికి విషం తాగి హీర్ తో పాటు మరణించాడు. పార్వతి ప్రేమలో దేవదాసు తాగుబోతయ్యాడు.
ప్రేమ అనేది అత్యద్భుతం, అవసరం అని అందరూ అంగీకరిస్తారు. కాని అదేమిటీ అన్నదాని మీద ఎవ్వరూ ఏకీభవించరు. ప్రేమ ను నిర్వచించడం కష్టమే కాదు అసాధ్యం కూడా. ప్రేమంటే ఏమిటి? అన్న ప్రశ్న కు నిఘంటువుల్లో రకరకాల అర్థాలుండవచ్చు. ఫ్రేమ ఎన్నిరకాలు అన్న ప్రశ్న కు అంతర్జాలం లో వందల జవాబులుండొచ్చు. ప్రేమను మొత్తంగా అర్థం చేసుకోవడం, మనం ఎలాంటి ప్రేమ పొందుతున్నాము, ఎలాంటి ప్రేమను పంచుతున్నాము అని తెలుసుకోవడం చాలా కష్టం. పూర్వ కాలం లో గ్రీకులు ప్రేమను ఏడు రకాలుగా విభజించారు.
ఒక ప్రేమ స్త్రీ పురుషుల మధ్య అందచందాలకీ, లైంగిక బంధాలకు ప్రాధాన్యత నిస్తుంది. బాహ్య సౌందర్యం, శృంగారం, పట్ల కోరిక, దీని లక్షణం. దీన్లో ప్రేమికులు అందాన్ని పొందాలనీ ఆ అందం తమకే స్వంతమవ్వాలనీ కోరుకుంటారు. ప్రియురాలి కోసం ప్రియుడు, ప్రియుడి కోసం ప్రియురాలూ ఎటువంటి త్యాగాలకైనా వెనుదీయరు.
ఇంకో రకమైన ప్రేమ సోదర ప్రేమ అనొచ్చు. ఇద్దరు మనుష్యులు ఒకేరకమైన విలువలూ, భావాలూ కలిగివుండి పరస్పర అన్నోన్యతను పంచుకోవడం దీని లక్షణం. ఒక కుటుంబం లోని పిల్లల మధ్య, మంచి స్నేహితుల మధ్య వుండే ప్రేమ. దీన్లో పరస్పర లాభాలే కాకుండా, ఆదరణ, నమ్మకం, తోడూ మొదలైన అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. దీన్నే ప్లాటోనిక్ ప్రేమ గా కూడా వ్యవహరిస్తారు.
మరో రకమైన ప్రేమ లో ఆటలూ, పాటలు, నృత్యాలూ, నవ్వులాటలు, పబ్బులూ, షికార్లూ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ భావనలూ, వుంటాయి. “టేక్ ఇట్ ఈజీ పాలసీ” దీని లక్షణం. దీన్ని ఈ తరం యువత కోరుకునే ప్రేమగా ఊహించవచ్చు. ఇది మంచి స్నేహానికీ, శారీరక సంబంధాల మోహానికీ మధ్యలో వుంటుంది. నైతిక పరిధుల్ని గుర్తించి, పరిమితంగా వుంటే మంచిదే. లేకపోతే, ఈ సంబంధం అనవసర అపోహలకూ, అనర్థాలకూ దారి తీయొచ్చు.
మరో ప్రేమ భార్యాభర్తల మధ్య వున్న అనుబంధానికి సంబంధించినది. ఈ ప్రేమ ముఖ్యంగా సేవా నిరతి, విధినిర్వహణ, దీర్ఘకాలిక అభిరుచుల మీద ఆధార పడి వుంటుంది. వ్యక్తిగత గుణగణాలూ, సర్దుబాట్లూ, లక్ష్యాలను పాలుపంచుకోవడం, సహాయ సకారలందించుకోవడం ఈ ప్రేమలో ప్రాధాన్యత వహిస్తాయి. అన్ని ప్రేమ స్వరూపాల్లో కీ దీన్ని అత్యుత్తమ మైనది గా భావించ వచ్చు.
ఇంకో ప్రేమ కుటుంబ పరమైన ప్రేమ. తల్లిదండ్రులూ, పిల్లల మధ్య వుండే ప్రేమ. ఈ ప్రేమ వ్యక్తిగత గుణగణాలకూ, అందచందాలకూ ప్రాధాన్యత నివ్వదు. సుపరిచితత్వం, ఆధార పడిన వారిని ఆదరించడం, పెంపుదలలోని అవసరాలు తీర్చడం, బాధ్యతా, ప్రతిఫలం కోరని అనురాగాన్ని పంచడం దీని ముఖ్య లక్షణాలు.
మరో రకమైన ప్రేమ అపరిచిత వ్యక్తులపైనా, ప్రకృతి పైనా, దేవుడి మీదా వుండే ప్రేమ. పరస్పర సహకారం, మానవీయత, నిస్వార్థ సేవా ఈ ప్రేమలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కులమత బేధాలూ, లింగభేదాలూ, వయో భేదాలూ వుండవు. ఇది ఒక సార్వజనిక ప్రేమ. మనం మానసికంగానూ సాంఘికంగానూ ఎదగడానికి ఉపకరిస్తుంది.
ఇంకో రకమైన ప్రేమ, తనను తాను ప్రేమించుకోవడం. స్వకీయ ప్రేమ మనిషి కి చాలా అవసరం. ఏ బాంధవ్యాల్లో నైనా తనని తాను ప్రేమించుకోలేనివారు ఇతరుల్ని ప్రేమించలేరు. అయితే, ఈ ప్రేమ రెండు రకాలు. ఒకటి మృదువుగా సాగి మనిషిని ఉత్సాహపరిచి వ్యక్తిగత వికాసానికి దారి తీస్తే, రెండోది మనిషి లో వినోదం పై కోరికా, కీర్తి కండూతి, ధనదాహం తో కూడిన స్వార్థాన్ని కలుగచేస్తుంది. ఇది వికృత పరిణామాలకు దారితీస్తుంది.
వివిధ కాలాల్లో ప్రతి మనిషి లోనూ ఈ ప్రేమల్లో ఒకటి కానీ, కొన్ని కానీ, అన్నీ కానీ వివిధ దశల్లొ, వివిధ స్థాయిల్లో, వుండటానికి అస్కారముంది. నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తి మంచిని కోరుకుంటుంది. కాల్పనిక ప్రేమ ఎదుటి వ్యక్తిని కోరుకుంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు కావాలి అనడమా ? లేక నువ్వు నాకు కావాలి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడమా? ఏది నిజమైన ప్రేమను సూచిస్తుంది? ఏది కాల్పనిక ప్రేమను?