కాదంబరి : తప్పక చదవాల్సిన పుస్తకం

 |  First Published Jan 16, 2017, 4:32 AM IST

బాణభట్టు శ్రీహర్షుని ఆస్థానకవుల్లో ఒకడు. సిఇ 606-645 మధ్య జీవించాడని చరిత్రకారుల అభిప్రాయం.సంస్కృతంలో తొలి గద్యకావ్యం కాదంబరి.ఇది చదివితే సకల శబ్దార్ధజ్ఞానం సిద్దిస్తుందని అంటారు.అద్భుతమైన వర్ణనలు,అలంకారాలు అడుగడుక్కూ కనిపిస్తాయి...


కాదంబరి కి అర్ధం సరస్వతి,కావ్యం,ఆడకోయిల,మద్యం.....కన్నడలో నవలను కాదంబరి అంటారు.
బాణుడి కాదంబరిని విద్వాన్ విశ్వం గారు తెలుగులోనికి అనువదించగా 1962 లో పుస్తకరూపంలో వచ్చింది....తిరిగి ఇన్నేళ్లకు ప్రొద్దాటూరు మాజీ శాసనసభ్యుడు,రచయిత యం.వి.రమణా రెడ్డి గారు తమ కవిత పబ్లికేషన్స్ ద్వారా అందించారు...

Latest Videos

undefined

2


ఇంతకూ ఈ కాదంబరి కథేంటి?


అల్లిబిల్లి అల్లిక కథలో ఎందరో కథ ను చెబుతుంటారు.

 


శూద్రకుడు అనే రాజు ఉంటాడు.ఆయన గుణగణాలు,రాజ్యం,పాలన గురించి పేజీలకొద్దీ వర్ణనలు.ఇవి ప్రతి విషయంలో ఉంటాయి.ఆయన కొలువుకు ఒక మాతంగకన్య పంజరంలో ఉన్న చిలుకను తెస్తుంది.ఆమె సహాయకుడు ఉత్తమమైనవన్నీ రాజుకు చెందాలి కాబట్టి ఈ మాట్లాడే చిలకను బహుకరిస్తున్నామని చెబుతాడు.ఇక రాజుగారు స్నానం చేసి..ఇదీ రెండు పేజీల వర్ణన..చేసి తీరిగ్గా కూర్చున్న తర్వాత వైశంపాయనుడనే చిలుక కథ చెప్పడం మొదలు పెడుతుంది.
వింధ్యారణ్యం అనే అడవిలో(దీని వర్ణనా కొన్ని పేజీలు)ఒకరోజు శబర సైన్యం వేటకు వస్తరు.ముసలి తండి,తల్లి లేని చిలుకపిల్ల గూట్లో ఉంటుంది.తండ్రిచిలుక చనిపోగా గూటినుంచి కిందపడ్డ రెక్కలురాని చిలుక అతికష్టమ్మీద ఒక సరస్సు ఓడ్డుకు చేరుతుంది.అక్కడికి స్నానార్ధమై వచ్చి వచ్చిన ముని బాలకుడు హారీతుడు దీన్ని ఆశ్రమానికి తీసుకుపోతాడు.అక్కడ అతని తండి జాబాలి ఈ చిలుక పూర్వజన్మ వృత్తాంతం చెబుతాడు.(వేట,ఆశ్రమాలు అన్నీ వర్ణనలుంటాయి)


3


ఉజ్జయిని పాలకుడు తారాపీడుడు,మంత్రి శుకనాసుడు ఉంటారు..ఎన్నో పూజలు,దానాలు,వ్రాతల వల్ల వాళ్లకు సంతానం కలుగుతుంది..రాజుకొడుకు చంద్రాపీడుడు,మంత్రి కొడుకు వైశంపాయనుడు...గురుకులంలో విద్యలు నేర్చి నగరానికి చేరాక చంద్రాపీడుని యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది...అంతకుముందు తండ్రి బహుకరించిన ఇంద్రాయుఢమనే గుర్రం ఎక్కి మిత్రుడు వైశంపాయనుడు,రాజపరివార సమేతంగా దిగ్విజయ యాత్రకు బయలుదేరుతాడు.ఒకరోజు ఆటవికుల జంట ను వెంబడిస్తూ చంద్రాపీడుడు ఒక సరోవరం చెంతకు చేరుతాడు.అక్కడ గుహలో తపస్సు చేసుకునే గంధర్వకాంత మహాశ్వేతా దేవి తన కథ చెబుతుంది.

 4


మహాశ్వేత ఒకనాడు వనవిహారానికి వచ్చి ఒక మునికుమారుడు పుండరీకున్ని చూసి మోహిస్తుంది.అతనూ ప్రేమపెంచుకుంటాడు.నివాసానికి వచ్చిన మహాశ్వేత తెగించి మళ్లీ వనానికి పోతుంది..ఈలోగా విరహబాధతో పుండరీకుడు చనిపోయి ఉంటాడు.అతని శరీరం నుంచి కాంతిని తీసుకుని ఒక దివ్యపురుషుడు ఆకాశంలో పోతూ పుండరీకుని కోసం నిరీక్షించమంటాడు.పుండరీకుని మిత్రుడు కపింజలుడు ఆ దివ్యపురుషుడిని వెంబడిస్తూ పైకి పోతాడు.
పుండరీకుని కోసం ఎదురు చూస్తూ,తపస్సు చేసుకుంటున్న మహాశ్వేత కథ విన్న ఆమె స్నేహితురాలు కాదంబరి తాను స్నేహితురాలి పెళ్ళయ్యేవరకు వివాహ మాడనని ప్రతిజ్ఞ చేస్తుంది.


మాయాబజార్,షోలే సినిమాల్లో ముప్పావు గంట గడిచాక ఘటోత్కచుడు,గబ్బర్ సింగ్ వచ్చినట్లు మొత్తానికి కథ సగం అయ్యాక కాదంబరి పాత్ర వస్తుంది.

 

 

5


మొత్తానికి మహాశ్వేతతో కలిసి రాకుమారుడు చంద్రాపీడుడు గంధర్వుల హేమకూటనగరం చేరతాడు.అక్కడ కాదంబరి,చంద్రాపీడుల తొలిచూపులో ప్రణయం మొదలవుతుంది.కొన్నాళ్లుండి తిరిగి సైనికుల దగ్గరికొస్తాడు,మల్లీ తన చెలికత్తె పత్రలేఖ(గురుకులం నుంచి వచ్చాక ఇతని సేవకు తల్లి ఇచ్చిఉంటుంది)తో కలిసివెళ్లి ఆమెను కాదంబరి దగ్గర ఉంచి తన సైన్యం దగ్గరికి తిరిగొస్తాడు.రాజాజ్ఞ వల్ల త్వరా తన నగరానికి వెళుతూ మిత్రుడు వైశంపాయనుడికి సైన్యాన్ని అప్పగించి ఇల్లు చేరుతాడు.ఇక ఇక్కడ రాకుమారుడి విరహం,అక్కడ కాదంబరి విరహం.మధ్యలో కాదంబరి సేవకుడు కేయూరక,రాకుమారుడి చెలికత్తె పత్రలేఖల రాయభారాలు....
ఒకరోజు తన సైన్యం వస్తున్న విషయం తెలుసుకుని వారిని కలవడానికి వెళితే మిత్రుడు వైశంపాయనుడు కనిపించడు.అతనొక సరస్సు దగ్గర విరక్తుడై ఆగిపోయాడని సేవకులు చెబుతారు.అతన్ని తిరిగి తీసుకురావాలని తల్లిదండ్రుల అనుమతితో బయలుదేరుతాడు.


అక్కడ మహాశ్వేతను కలుస్తాడు.అప్పుడామె తననొకడు చూసి మోహించి వ్యర్ధప్రలాపాలాడుతుంటే చిలుకలా తప్పో ఒప్పో తెలియకుండా మాట్లాడుతున్నందున చిలుకవైపొమ్మని శపించానని చెబుతుంది.ఆ చిలుకగా మారింది మిత్రుడు వైశంపాయనుడని తెలుసుకుని కుప్పకూలుతాడు చంద్రాపీడుడు.
ఈలోగా అక్కడికొచ్చిన కాదంబరి ఇది చూసి విలపించి చంద్రాపీడుడి శరీరం తాకగనే ఒక దివ్యజ్యోతి బయటకు రాగా ఒక దివ్యవాణి ఈ శరీరం నిర్జీవమైనా చెడదు జాగ్రత్తగా చూసుకొమ్మని చెబుతుంది.


6


రాజులేని బ్రతుకెందుకని పత్రలేఖ,గుర్రం ఇంద్రాయుధంతో కలిసి సరస్సులో దూకుతుంది.అప్పుడు అందులోంచి మహాశ్వేత ప్రియుడు పుండరీకుని మిత్రుడు కపింజలుడు బయటికి వస్తాడు.ఇతను కథ చెబుతాడిప్పుడు.


అప్పట్లో పుండరీకుని ఆత్మ తీసుకుపోయింది చంద్రుడని,వెన్నెలలో విరహబాధతో పుండరీకుడు చంద్రుడిని శపించాడని,అతనూ తిరిగి పుండరీకుడిని శపించినందున ఇలా జన్మలు ఎత్తాల్సి వస్తుందని చెప్పాడని...ఆ విషయం తెలుసుకుని పరుగున వస్తూ ఒక దివ్య విమానాన్ని దాటగా అందులోని వారు తననూ గుర్రంగా పుట్టమని శపించారని చెబుతాడు.

 

7


ఇక ఇక్కడ చిలుకగా పుట్టిన వైశంపాయనుడికి(పుండరీకుడు) ముని తన జన్మవృత్తాంతం చెప్పగా గత జన్మ గుర్తొస్తుంది.ఈలోగా అతని మిత్రుడు కపింజలుడు ఇతనుంటున్న ఆశ్రమం చేరి మిత్రుడితో మాట్లాడుతాడు.పుండరీకుడి తండ్రి శ్వేతకేతు అతని శాపవిమోచంకోసం కర్మకాండలు జరుపుతున్నాడని,అవి పూర్తయ్యేవరకు ఆశ్రమం దాటకూడదని చెబుతాడు.రెక్కలు రాకపోయినా ఆత్రంతో ప్రియురాలికోసం ఎగిరిపోయి పట్టుబడి చండలకన్య దగ్గరికి చేరాడు.
ఆమె ఈ చిలుకను రాజు శూద్రకుడికి ఇచ్చింది.

 


ఈ కథంతా విన్న రాజు చండాలకన్యను తీసుకు రమ్మంటాడు.ఆమె నిజరూపం ధరిస్తుంది.తాను లక్ష్మిదేవినని ఈ పుండరీకుడు/చిలుక తల్లినని చెబుతుంది.పుండరీకుడిగా ఉన్నప్పుడు కామంధుడై చనిపోయాడు,మళ్లీ చిలుకగా ఉన్నప్పుడూ ఆశ్రమం దాటొద్దని తండ్రి చెప్పినా వినక బయలుదేరి పట్టుబడ్డాడు,అతని తండ్రి చేసే కర్మకాండ పూర్తై శాపవిమోచనం అయ్యే సమయం వచ్చినందున మీ దగ్గరికి చేర్చా అని చెప్పి మాయమవుతుంది.ఈలోగా శూద్రక మహారాజుకు పూర్వజన్మ గుర్తొస్తుంది...తాను యువరాజు చంద్రాపీడుడినని...అదే..చంద్రుడని.ఇక తన సేవకురాలు పత్రలేఖ అతని భార్య రోహిణి.

 


శూద్రకుడు/చంద్రాపీడుడు...కాదంబరి కోసం బయలుదేరుతాడు.ఆవిడ మోహావేశంతో అక్కడ చంద్రాపీడుడి శరీరాన్ని కౌగిలించుకోగా అతని ప్రాణం తిరిగివస్తుంది.ఇక కపింజలుడు శాపవిమోచనమైన పుండరీకుని/వైశంపాయనుడిని/చిలుకను తెస్తాడు.

 


అందరికీ పెళ్లిలవుతాయి..గంధర్వరాజ్యం కొన్నాళ్లూ,ఉజ్జయిని కొన్నాళ్లూ పాలిస్తూ ఉండిపోయాడు చంద్రాపీడుడు.
 

8


మొత్తానికి ఇదీ కథ...ఇక భాణభట్టు మొదలుపెట్టిన దీన్ని అతని మరణనంతరం కొడుకు భూషణభట్టు పూర్తిచేసాడు.బాణుడి భాగాన్ని పూర్వభాగమని,భూషణభట్టు భాగాన్ని ఉత్తరభాగమని అంటారు.


తొలి సంస్కృత గద్య కావ్యమైన దీనిలోని వర్ణనలు ఆ తర్వాత ఎందరో అనుసరించారు.ఆముక్తమాల్యద లోని వేట కావచ్చు,కళాపూర్ణోదయంలోని రెండేసి జంటల రెండు రూపాలు కావొచ్చు,ఇతర ప్రబంధ కవుల అంతఃపుర,ప్రకృతి,స్త్రీ సౌందర్య వర్ణనలు కావొచ్చు..అన్నింటికీ మూలం ఈ కాదంబరే...అందుకే "బాణోదిచ్చిష్టం జగత్రయం" (బాణుడు చవిచూడని విషయం ముల్లోకాలలో లేదు)అన్న లోకోక్తి వచ్చింది.

 

9


నిజానికీ కథ ఇప్పుడు చెబితే రచయితను బతకనిచ్చే పరిస్థితుందా?


ఎందుకంటారా?ఈ కథలోని మునికుమారుడు పుండరీకుడు..ఆ తర్వాత మంత్రికుమారుడైన వైశంపాయనుడు/చిలుక జన్మ వృత్తాంతం ఇలా ఉంది...
దేవలోకంలో పూజనీయుడైన శ్వేతకేతువనే మహర్షి ఉంటాడు.నలకూబరుడిని మించిన అందగాడు.పూజాపుష్పాలకోసం ఆకాశగంగలో దిగుతాడు.అప్పుడు సహస్రదళ పద్మం మధ్య కూర్చున్న లక్ష్మిదేవి చూస్తుంది.మహర్షిని చూసి మోహవివశురాలవుతుంది.నేత్రాలు అర్ధనిమీలితాలై ఆనందభాష్పాలు రాలుతాయి.చూపుతోనే ఆయనతో సంభోగ సుఖం అనుభవించింది.వెంటనే పద్మంలో కుమారుడు పుట్టాడు.ఆ పసివాడిని మహర్షికి అప్పగిస్తుంది.పుండరీకంలో పుట్టినందున పుండరీకుడని పేరు పెట్టి మహర్షి పెంచాడు.

 

10


పురాణాలలో లేని ఈ కథ,స్వతంత్రించి రచయిత లక్ష్మిదేవికి కలిగిన కొడుకని ఇవాల్టి సమాజంలో రాస్తే బతకనిస్తారా?


ఈ కాదంబరే కాదు కాళిదాసు కుమారసంభవం లో శివపార్వతుల శృంగార వర్ణనలుంటాయి..అంతెందుకు. ఆదిశంకరుల సౌందర్యలహరిలోనూ అంగాంగ వర్ణనలుంటాయి.
శృంగారం తప్పనే భావన అబ్రహామిక్ మతాల వల్ల వచ్చిందా?లేక పక్క మతం వాళ్లు అంత రిజిడ్ గా ఉన్నందున మనమూ ఉండాలనే భావజాలం పెంచిపోషించిన కొన్ని మత సంస్థల వల్ల వచ్చిందా?


ఏమో ఈ మత అసహనాలు,అవార్డ్ వాపసీలు కలిసి సామాన్యులను ఏ వైపుకు తీసుకుపోతున్నాయో తెలియని అయోమయ కూడలిలో నేటి జనం ఉన్నారు.

click me!