"ఎంతెంత దూరం" అంటూ ఇంటివెనకాలున్న కాగితం పూల చెట్లదగ్గర ఆడుకుంటున్నాము.ఇంతలో మా చెల్లెలు వచ్చి పెదనాన్న పిలుస్తున్నాడని చెప్పింది.ఇంట్లో "జగితి"(ఇంట్లో మనుషులు,పిల్లల్లా పెంచుకునే పశువులు కలిసి ఉండే కడప్జిల్లా పల్లెల్లో వాటిని వేరు చేస్తూ ఉన్న పొడవాటి అరుగు)మీద కూర్చున్న మా పెదనాన్న "సరే ముగ్గురమే ఎట్లపోతాం?బెరినపోయి కాల్లుమొకం కడుక్కోనిరాపోబ్బీ ప్యాటకు పోవాల" అన్నాడు..అది 1974-75 కాలం.వేసవి సెలవులు గడపడానికి మా పెదనాన్న ఊరికిపోయిన నేను ఎగిరి గంతేసాను.ప్యాట అంటే మరేదో కాదు బంగారు వ్యాపారం లో రెండవ బాంబేగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ప్రొద్దటూరును చుట్టు పక్కల గ్రామాలవారు అలా వ్యవహరించేవారు.
ఇంతకూ ఆ ప్యాటకు పోవడానికి కారణం..పెళ్లి కుదిరిన మా లక్ష్మక్కకు నగలు చేయించాలి.కాబోయే పెళ్లి కూతురు,మా పెదనాన్న,పెద్దమ్మ తోడుగా నేనూ బయలుదేరాము.
ఒక చిన్న సందులో కరణం బల్లల వెనకాల వ్యాపారులు,ముందు సిరిచాపల మీద మేము కూర్చున్నాము.బంగారంగడాయిన రెండు హారాలు ఎదురుగా పెట్టి ఒకటి దొరబాబు సెట్,మరొకటి వాణిశ్రీ సెట్ అని చెప్పాడు.మా అక్క దొరబాబు సెట్ ఎంపికచేసుకుంది.ఆ తర్వాత 4 గాజులు,తాళిబొట్టు సరడు,కమ్మలు,వంకీ ఉంగరం,వెండి మెట్టెలు చేయమని పురమాయించారు.ఆ తర్వాత సొందర్య సిల్క్స్ లో అక్కకు 5,6 వందల విలువ చేసే ప్రేం నగర్ జరీ బుట్టీల చీరలు కొన్నారు.తిరిగి వస్తూ నాకో రంగు సోడా,శేరు బూందికారా కొనిచ్చారు.అంతేకదా మగపిల్లలను ఇలాంటి కొనుగోళ్లకు తీసుకుపోతే ఖర్చు తక్కువలో పనవుతుంది.అదే అమ్మాయిలను తీసుకుపోతే వాళ్లే వెండి గజ్జెల మీదో,చిన్న బంగారు హంసల పతకం మీదో మనసుపారేసుకుని వేధిస్తారు కదా!
undefined
సరే ఆ తర్వాత 20 రోజులకు పెద్దమ్మ,పెదనాన్న ప్యాటకు పోయి దగ్గరివాళ్లందరికీ బట్టలు,చేయించిన నగలు తెచ్చారు...ఆ తర్వాత మా పెదనాన్న మిత్రుడికి ఆ నగల బరువు,కూలి,తరుగులున్న కాగితాన్ని...ఊర్లో ధర్మకాటాలో నగల తూకం వేయించి చూసుకున్న వివరాలు చెప్పాడు. సరే మొత్తానికి పెళ్లి జరిగింది.అప్పట్లో కాస్త కలిగినవారైతే గోదుమ రవ్వ ఉప్మా,లేని వారైతే బొరుగుల తిరగవాత(ఉగ్గాని) టిఫిన్ పెట్టేవాళ్లు.నేల మీద పొడవాటి జంపుకానాలు పరచి విస్తర్లలో లడ్డు,జాంగ్రీ,చిత్రాన్నం తో భోజనాలు పెట్టారు.
ఇక ఆ పెళ్లిలో హైలెట్ మా బావుకు మా పెదనాన్న హైదరాబాద్ నుంచి తెప్పించిన రిస్ట్ వాచ్.అల్లాటప్పానా?నెలవరకు కీ ఇవ్వాల్సిన పనిలేదు.అప్పటి మార్కెట్ లో ట్రెండ్ సెట్టింగ్ వాచ్.. బ్లాక్ డయల్ హెచ్ ఎం టి వాచ్ ఖరీదు 240 రూపాయలు.
దేవుడా నేనెప్పుడు పెద్దోడినవుతానో?పెళ్లెప్పుడు జరిగి అలాంటి వాచ్ పెట్టుకుంటానో!!!!!
***
కాలచక్రం గిర్రున 20 ఏళ్లు తిరిగింది....నా పెళ్లి జరిగింది...అప్పటి మార్కెట్ ట్రెండ్ 2500 రూపాయల Titan watch....
***
అప్పటికే రోజూ పేపర్లలో దంకెల్ ప్రతిపాదనలు,GATT,IMF,world bank,Globalization గురించి చదివాము..ప్రధాని పీవి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు...జరగబోయే పెరిణామాల గురించి ఎవరి ఊహాగానాలు వారివి....
కాల చక్రం ఎవరికోసం ఆగదుగా...మరో 20 ఏళ్లు గడిచాయి...
అక్క,అన్నల పిల్లలు వివిధదేశాల్లో స్థిరపడ్డారు..డాలర్లలో డబ్బులు వచ్చేసాయి...కొత్తకొత్త మాల్స్ పుట్టుకొచ్చి వ్యాపారాలు దగద్దగాయమానం గా వెలుగుతున్నాయి...
పాపం మనసా తుళ్లి పడకే పాట పాడుకుంటూ ఆ హీరోయిన్ వేసుకున్న పూల చీటి గుడ్డను లంగాగా వీధి అరుగుమీద టైలర్తో కుట్టించుకుని,ఓణీ వేసి కిలోమీటరున్న దూరంలో ఉన్న కాలేజ్ కు నడచివెళ్లిన మా చెల్లెల్ల...అదేనండీ ...అప్పుడు వెండి పెట్టీల కోసం,పూల లంగాల కోసం పేచీపెడతారని పెళ్లి కొనుగోళ్లకు తీసుకుపోని చెల్లెల్ల పిల్లల పెళ్లిల్ల తంతు మొదలైంది....
ఇక చూడాలి.... ఆ హమ్ ఆప్ కే హై కౌన్ లాంటి సినిమాల ప్రభావం వచ్చేసింది...
అప్పట్లో పెళ్లి బట్టలు కొన్నందుకు అంగడాయిన ఒక తెల్లని పలుచని టవల్ లో బట్టలు కట్టిస్తే దాన్ని జాగ్రత్తగా దాచి వధూవరుల నడుమ తెరగా పెడితే...ఇప్పుడు ఒక పట్టు వస్త్రం,దాని చివర్లలో పూసల హారాలు,కలంకారి పైంటింగ్స్ ఉండాలి...పెళ్లిలో వాడే ఐరేణి కుండలు,కొబ్బరి గిన్నెలు,కొబ్బరి బోండాలు...అన్నీ డిజైనర్ల రూప కల్పనలే....
అంతెందుకు?పెళ్లి సెట్టింగులకు Event managers,సంగీత్ డ్యాన్సులకు choreographers వచ్చారు....
ఇక పూల చీటి గుడ్డల చెల్లెల్లు తమ కూతుర్లు,కోడళ్ల కోసం ముందు రోజు ఫంక్షనలకే లెహెంగా అంటూ 60-80 వేల లంగాలు కుట్టిస్తున్నారు....
అప్పట్లో మా అక్క దొరబాబు సెట్ ఎంపికచేసుకోవడానికి కారణం నెక్లెస్ తో పాటు వచ్చే కమ్మలే కాకుండా మ్యాచింగ్ ఉంగరం ఉండటం(ఆవిడదేనా తెలివి?కట్నంలో ఒప్పుకున్న బంగారాని కి సరిపోయే దాన్లోనే ఆ ఉంగరమూ సర్దారు)...ఇక మా చెల్లెల్లా?అక్బర్ తాత బాబర్,స్వయంగా అక్బర్ పాల్గొన్న పానిపట్ యుద్ధం గురించి పరీక్షల్లో రాయటానికే అవస్థలు పడ్డా జోధా అక్బర్ సినిమా ప్రభావంతో డబ్బులు కుమ్మరించి జోధా భాయ్,జోధ్పురి నగలు తెచ్చారు(కూలీలు,తరుగులు,బంగారం నాణ్యత దేవుడికే తెలియాలి)....మొత్తానికీవిధంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసేస్తున్నారు....
ఇవన్నీ నిన్నా మొన్న జరిగిన బళ్లారి గనుడు,ఒక మంత్రి,ఒక పత్రికా సంపాదకుడి ఇల్లలో పెళ్లిల్లు కావు...2-3 లక్షల జనాభా ఉన్న టౌన్లలో మధ్యతరగతి,ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న వేడుకలు.....ఒకానొక సమయంలో జయలలిత పెంపుడు కొడుకు వివాహంలో ఆవిడ,శశికళ ధరించిన నగలను అబ్బురంగా ఇంగ్లీష్ పత్రికల్లో జనాలు చూసారు...నేడవి మధ్యతరగతి నగలయ్యాయి....
ఇక సామాన్యులూ పెళ్లిమండపం పూల అలంకారాలకే లక్షలు పెట్టాల్సివస్తుంది..ఇక భోజనాలు సరేసరి..తినేవాటికన్నా పారేసేవెక్కువయ్యాయి...అంతా కేటరింగ్....
-------మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి పథకంలో భాగంగా 2.5 లక్షలు ఖర్చు చేయవచ్చన్నారు....ఇదేనా రేపు నల్లధనం అరికట్టి అన్ని చెల్లింపులూ కార్డ్ ద్వారా అన్నప్పుడు ఈ వైభవోపేతమైన పెళ్లిల్లు జరుగుతాయా?
కష్టార్జితం,అకౌంటేడ్ మనీ తో ఇవి సాధ్యమా? జనాలు మళ్లీ నిరాడంబరత వైపు పోగలరా? ఇంత దూరమొచ్చాక అది సాధ్యమేనా?
ఎంతెంత దూరం ఆటలో ప్రారంభించిన చోటే తిరిగి మొదలు పెట్టాగలం...జీవితంలో ఇది సాధ్యమా?
ఎంతెంత దూరం......చానా చానా దూరం.....