అన్నమయ్య-గీత- ఆరుద్ర భావ సారూప్యం

 |  First Published Nov 14, 2016, 5:21 AM IST

 

Latest Videos

undefined

ఆ అమ్మాయికి అత్తింటి ఆరళ్లు ఒకవైపు.వేరుకాపురం పెడితే భర్త స్నేహితుడి కాముకత్వం మరోవైపు.నిరాశానిస్పృహల్లో మునిగిన ఆవిడ తన ఇష్టదైవం రాముని మ్రోల పాడుకుంటోంది "రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా" అంటూ...రాముని పాదం సోకి అహల్యగా మారిన రాయినైనా కాకపోతిని,ఆదికావ్యం రాసిన బోయ వాల్మీకిని కాకపోతిని,ఇంకా గుహుడి పడవను కాకపోయాను,భక్తిరాజ్యాన్నేలిన పాదుకను కాకపోతిని,సీతను రక్షించబోయి అసువులు బాసిన జటాయువును కాలేకపోయాను,వారధి నిర్మాణంలో పాలుపంచుకుని రాముడి అనుగ్రహానికి పాత్రమై ఆయన వేలి గురుతులు మోసిన ఉడుతనైనా కాలేకపోయాను....సీతమ్మను బాధించి గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చిన ఘనత రాముడికిచ్చిన కాకినైనా కాలేకపోయాను..అల్పజీవులన్నింటికీ ఈ భాగ్యం దొరకినా మనిషిగా జన్మించి మదమత్సరమ్ములు రేపుతున్నా అంటూ వాపోతుంది.

బాపు రమణల దృశ్య కావ్యం "గోరంతదీపం" సినిమాలోని ఈ పాట అంతకుముందే ఆరుద్ర రాయగా ప్రైవేట్ ఆల్బంగా వచ్చినా సంగీతానికి మరిన్ని సొబగులు అద్దుతూ సినిమాలో వాడారు.

నిజానికి ఈ భావనలు అంతకుముందు 600 ఏళ్ల క్రితమే అన్నమయ్య వెలిబుచ్చాడు...

ఇదుగో ఈ సంకీర్తన.....

రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు

దీము వంటి బంటననే తేజమే నాది॥

 

వారధి దాటి మెప్పించ వాయుజుడనే గాను

సారె చవుల మెప్పించ శబరిగాను

బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండగాను

ఏరీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో॥

 

ఘనమై మోచి మెప్పించ గరుడుడనే గాను

కొన కామసుఖమిచ్చు గోపిక గాను

వినుతించి మెప్పించ వేయినోళ్ళ భొగిగాను

నిన్నెట్లు మెప్పింతు నన్ను గాచే దెట్లా॥

 

నవ్వుచు పాడి మెప్పించ నారదుడనే గాను

అవ్వల ప్రాణమీయ జటాయువు గాను

ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి

అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా॥ 

***

ఇక అన్నమయ్య సంకీర్తనల్లో ఒక కీర్తన ఉంది....

అందరి వసమా హరినెరుఁగ

కందువగ నొకఁడుగాని యెరఁగఁడు // పల్లవి //

 

లలితపు పదిగోట్లనొకఁడుగాని

కలుగఁడు శ్రీహరిఁ గని మనఁగ

ఒలిసి తెలియు పుణ్యులకోట్లలో

ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని // అందరి //

 

శ్రుతి చదివిన భూసురకోట్లలో

గతియును హరినె యొకానొకఁడు

అతిఘనులట్టి మహాత్మకోటిలో

తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని // అందరి //

 

తుదకెక్కిన నిత్యుల కోట్లలో

పొదుగునొకఁడు తలఁపున హరిని

గుదిగొను హరిభక్తుల కోట్లలో

వెదకు నొకఁడు శ్రీవేంకటపతిని // అందరి /

 

నిజానికి ఈ కీర్తనకు ప్రేరణ భగవద్గీతలో సప్తమ అధ్యాయమైన  జ్ఞాన విజ్ఞాన యోగం లోని ఈ శ్లోకం..

మనుష్యాణాం సహస్రేషు  కశ్చిద్యతతి సిద్దయే 

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః

మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే

యతతాం ఆపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి సిద్ధతః

మనుష్యులలో వేయిమందిలో ఒకడు సిద్ధత్వమునకు యత్నించుచున్నాడు.యత్నించెడి సిద్ధులలోనూ ఒకానొకడు నన్ను యదార్థముగా తెలుసుకొనుచున్నాడు.

***

ఇక శ్రీరామకృష్ణ పరమహంస దైవాన్ని పొందటాని భక్తుడికి తీవ్ర వేదన ఉండాలంటాడు.నీటిలో తల ముంచినవాడికి పైకి రావాలనే తపనలా,ఒక ఇంటిలోని దాసి నా రాజా,రాణి అని పిల్లలను ఆడించినా తన ఇల్లు,పిల్లలు గుర్తున్నట్లు,వేశ్యకు విటులమీద దృష్టి ఉన్నట్లు,లోభికి ధనంపై దృష్టి ఉన్నట్లు భక్తుడు పరితపించాలంటాడు.

అవే భావాలను చెబుతున్న అన్నమయ్య ఈ కీరతనూ చదవండి.... 

ప|| పరమజ్ఞానులకు ప్రపన్నులకు | మరుగురుని మీద మనసుండవలదా ||

 

చ|| ఆకలి గొన్నవానికి అన్నముపై నున్నట్లు | యేకత నుండవలదా యీశ్వరునిపైని |

కాకల విటుల చూపు కాంతలపై నున్నట్లు | తేకువ నుండవలదా దేవుని మీద ||

 

చ|| పసిబిడ్డలకు నాస పాల చంటిపై నున్నట్లు | కొసరి భక్తి వలదా గోవిందు పైని |

వెస తెరువరి తమి విడి తలపై నున్నట్లు | వసియించ వలదా శ్రీ వల్లభు మీదటను ||

 

చ|| నెప్పున ధనవంతుడు నిధి గాచి యుండునట్లు | తప్పక శ్రీ వేంకటేశు తగుల వద్దా |

అప్పనమైన భ్రమ ఆలజలాల కున్నట్లు | ఇప్పుడే వుండ వలదా ఈతని మీదను ||

 

 

 

 

click me!