ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం... ఆస్పత్రి వరండాలోనే గర్భిణి ప్రసవం

By Arun Kumar PFirst Published Feb 1, 2020, 9:12 PM IST
Highlights

ప్రభుత్వ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ ఆరుబయటే ప్రసవించిన సంఘటన  వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వికారాబాద్: నిండు చూలాలు నొప్పులతో తల్లడిల్లిపోతున్నా ఆ కసాయిల మనసు కరగలేదు. డాక్టర్లు లేరన్న సాకుతో గర్భిణిని వెనక్కి పంపించారు ఆ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది. అయితే  అప్పటికే చాలాసేపటి నుండి నొప్పులతో తల్లడిల్లిన ఆ మహిళ అదే హాస్పిటల్ వరండాలోనే ప్రసవించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. 

తాండూరు పట్టణం  పక్కనే వున్న ఓ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే హాస్పిటల్ సిబ్బంది మాత్రం డాక్టర్లు లేరని  చెప్పి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వెనక్కి పంపించారు. దీంతో చేసేదేమి లేక అక్కడి నుండి వెళ్లిపోతుండగా పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.

read more  నీటి కాలువలోకి దూసుకెళ్లిన కారు... డాక్టర్ మృతి, భార్యాబిడ్డలు సురక్షితం

దీంతో కుటుంబసభ్యులతో పాటు అక్కడే  వున్న కొందరు మహిళలు  వరండాలోనే మహిళ  ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. చుట్టూ చీరలు కట్టి ప్రసవం చేశారు. ఇదంతా చూస్తూనే వున్న ఆస్పత్రి సిబ్బంది కనీస సాయం కూడా చేయలేదు. అయితే చివరకు మహిళలు ఆ ఆరుబయటే బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ ఘటన మరోసారి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్ధితులను, సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. చేతిలో డబ్బులు లేక ఉచిత వైద్యం దొరుకుతుందని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే నిరుపేదలకు ఎలాంటి వైద్యం అందుతుందో ఈ సంఘటనే తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాలపై దృష్టిసారించి మెరుగైన సేవలు అందేలా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. 

read more  కర్నూల్ లో పసికందు కిడ్నాప్... రెండు గంటల్లోనే చేధించిన పోలీసులు

click me!