చంద్రబాబుకు కళాకారుల ఝలక్: వైఎస్ జగన్ తో మొర

By Arun Kumar PFirst Published Nov 2, 2019, 3:46 PM IST
Highlights

ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం తమను ప్రచారం కోసం వాడుకుని డబ్బులు చెల్లించచకుండా మోసం చేసిందని విశాఖ కళాకారులు ఆవేధన వ్యక్తం చేశారు. దీంతో వారు ఇవాళ నగరంలో ధర్నా చేపట్టారు.   

విశాఖపట్నం: గత ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట తమతో జిల్లవ్యాప్తంగా ప్రచారం చేయించుకుని డబ్బుల మాత్రం చెల్లించకుండా మోసం చేసిందని విశాఖ కళాకారుల సంఘం  ఆరోపించింది. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అన్యాయంపై ప్రస్తుత ప్రభుత్వమయినా స్పందించాలని... తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 

విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ శివ జ్యోతి ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కళాకారులంతా కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాకు చెందిన సుమారు 49 మంది కళాకారులు చంద్రబాబు ప్రభుత్వం చేతిలో  మోసపోయారని ఆరోపించారు. వివిధ కళా సంస్థలు, కళాకారులతో ప్రభుత్వ పథకాలపై ప్రచార కార్యక్రమాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

అయితే ఎన్నికల కోడ్ నెపంతో స్థానిక  కళాకారులకు రావాల్సిన బకాయిలను గత ప్రభుత్వం చెల్లించకుండా తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రదర్శనం చేస్తే గాని పూటగడవని తమకు గత ప్రభుత్వం మోసగించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు .తనకు రావలసిన బకాయిలపై గతంలో అప్పటి ప్రభుత్వం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

read more  ఆధునిక సాంకేతికతతో రంగంలోకి మెఘా.... పోలవరం పనులు షురూ

 ప్రస్తుత ప్రభుత్వంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇక్కడి కళాకారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమకు రావాల్సిన బకాయిలను చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ ఆందోళన కార్యక్రమంలో విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సబ్బవరం ప్రకాష్ రావు,  ప్రజానాట్యమండలి సభ్యులు నాగేశ్వరరావు, అప్పారావు తోపాటు వివిధ కళాకారులు సంఘాలకు చెందిన ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. 

click me!