ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరతపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయనకు ముందుజాగ్రత్త లేకే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు.
గుడివాడ: ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో సీఎం జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి చూపిన మార్గంలో పయనిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మెగా రుణ మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని అమలు చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఎవరినీ వెన్నుపోటు పొడవలేదని... శాసనసభ్యులను కొనుగోలు చేయలేదని పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
undefined
ప్రజల ఎన్నో సమస్యలతో దగ్గరికి వస్తే తన తండ్రి చూపిన మార్గంలో సేవ చేస్తానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. మహామహులకే సాధ్యం కాని ముఖ్యమంత్రి పదవిని 151 సీట్లతో గెలుచుకున్న ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలను నిరంతరం నెరవేర్చాలనే తపనతో జగన్ పనిచేస్తున్నారని తెలిపారు.
ఆర్థిక లోటు ఉన్నా పేదవారికి సహాయం చేయాలన్న మహా సంకల్పంతో ప్రాధాన్యత క్రమంలో పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇచ్చిన మాట తప్పడం....మడమ తిప్పడం వైఎస్ కుటుంబ రక్తంలోనే లేదన్నారు.
read more భార్య బ్రాహ్మణి కోసమే లోకేష్ దీక్ష...ఇసుక ఖాతాలో...: రోజా
పాలన చివర్లో పసుపు-కుంకుమ ఇస్తే మళ్లీ అధికారంలోకి రావచ్చనే చంద్రబాబు నక్కజిత్తులు ఫలించలేవని ఎద్దేవా చేశారు. పదవి కోసం సొంత మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎవరి కాళ్లయినా చంద్రబాబు పట్టుకుంటాడని... అటువంటి మోసగాడిని ప్రజల అండతో జగన్ మట్టికరిపించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రూ.22 వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. వీటిని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని జగన్ మాటిచ్చారని తెలిపారు. వచ్చే ఉగాది నాటికి రూ.25 లక్షల ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. జగన్ గురించి చెప్పాలంటే గ్రంథాలు రాయాల్సిందేనని కొనియాడారు.
తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే మానవాతీతుడు జగన్ అని అన్నాడు. ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత వరుసగా 66 రోజులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారన్నారు. బుద్ధిలేని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.వీళ్లు రాజకీయాల్లోకి రావడం మనందరి దౌర్భాగ్యమన్నారు.
read more రాష్ట్రంలో ముద్దాయిల పాలన...జగన్ బయటపడటం కష్టమే...: వర్ల రామయ్య
చంద్రబాబు చేసిన తప్పులను కూడా జగన్ పై నెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా రాక్ సాండ్ తయారీ పరిశ్రమలను ఎందుకు ప్రోత్సహించలేదు చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో 1600 రాక్ సాండ్ పరిశ్రమలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని జగన్ ప్రకటించారని అన్నారు.
రాక్ సాండ్ ను తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వాగులు, వంకలు నుండి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ఇసుక తరలిపోతోంది అని చెప్పే అజ్ఞాని చంద్రబాబని మండిపడ్డారు.ఎన్నికల మేనిఫెస్టోను వచ్చే ఐదేళ్లలో చిత్తశుద్ధితో అమలు చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.
చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించాలని జగన్ చెప్పారన్నారు. రూపాయి అవినీతి లేకుండా ప్రజల కోసం కష్టపడతామని...నిండు హృదయంతో జగన్ దీవించండని కొడాలి నాని డ్వాక్రా మహిళలను కోరారు.