జగన్ రాజీనామా చేయాల్సిందే...కానీ ఆయనేం నీలం కాదుగా...: సోమిరెడ్డి

By Arun Kumar PFirst Published Nov 1, 2019, 2:28 PM IST
Highlights

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టు ప్రజలందరు కోరుకున్న తీర్పునే ఇచ్చిందని టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   

అమరావతి: ఆర్థిక నేరాల కేసులో వ్యక్తిగత హాజరుమినహాయింపు కోరుతూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ లో సీబీఐ కోర్టు ప్రజలందరూ కోరుకున్న తీర్పునే ఇచ్చిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. దేశాధ్యక్షులైనా, పంచాయతీ సర్పంచ్ అయినా రాష్ట్రానికి సీఎం అయినా అతిపెద్ద కంపెనీల అధినేతలయినా ఆర్థిక నేరాల కేసులో చట్టానికి ఎవరూ అతీతులు కాదనే విషయాన్ని కోర్టు మరోసారి స్పష్టం చేసిందన్నారు.

దేశంలో న్యాయవ్యవస్థ అందరికీ సమానమనే తీర్పు రావడం అభినందనీయని అన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన బృందంలో ఇప్పటికీ మార్పురాలేదని...

 కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో కూడా తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారని అన్నారు. శుక్రవారం కోర్టుకు హాజరైతే రూ.60 లక్షలవుతుందని తప్పుడు సమాచారం ఇచ్చారని...ఇది కూడా నేరమేనని అన్నారు.

 read more సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

ఈ కేసు విషయంలో ఎంత ఖర్చయినా జగనే స్వయంగా పెట్టుకోవాల్సిందేనని... ఏపీ సీఎంగా వున్న కాలంలో వచ్చిన కేసు కాదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతమైన కేసని అన్నారు. 

ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నా గన్నవరం నుంచి హైదరాబాద్ కు రానూపోనూ రూ.5 లక్షలకు మించదని అన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా కల్పించాల్సిన రక్షణ ఖర్చులు రెండు నుండి మూడు లక్షలకు మించబోవన్నారు. మొత్తంగా కేవలం రూ.10 లక్షల్లోపే ఖర్చవుతుందని... కానీ రూ.60 లక్షల రూపాయలు ఖర్చవుంతోందని సాకు చూపించి కోర్టు నుండి మినహాయింపు కోరారని సోమిరెడ్డి ఆరోపించారు. 

కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీబీఐ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత జగన్ రాజీనామా చేయాలని చాలా మంది కోరుతున్నారు..కానీ ఇవి పాత రోజులు కాదు కదా అని అన్నారు. 

read more  YS Jagan: జగన్ కు సిబిఐ కోర్టు షాక్.. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందే...

నీలం సంజీవరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రైవేటు బస్సులు జాతీయ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక ఈ కేసు విషయంలో రాజీనామా చేయాలో...వద్దో జగన్ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

 ఐదు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పేరును కోర్టులో పిలిస్తే వెళ్లి బోనులో నిలబడటమంటే విలువలకు తిలోదకాలిచ్చినట్టే కదా అని అన్నారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో ఏడాది లోపు తీర్పు ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చింది..కానీ తీర్పు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కూడా పక్కాగా అమలుకావాలని ఆశిస్తున్నామన్నారు.

తప్పులు చేసిన వారు ఎంతటివారైనా ఎలాంటి మినహాయింపులు ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల విషయాల్లోనూ కోర్టులు విచారణ పూర్తి చేసి త్వరగా తేల్చేయాలని కోరుతున్నామని సోమిరెడ్డి పేర్కొన్నారు. 

click me!