ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్స్‌పై సైబర్ నేరగాళ్ళ కన్ను... కర్నూలు ఎస్పీ సూచనలివే

By Arun Kumar PFirst Published Nov 15, 2019, 7:09 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతోందని.. వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా ఎస్పి పకీరప్ప హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇతరులతో పంచుకోకూడని సూచించారు.  

కర్నూల్: '' మీ ఎస్బీఐ అకౌంట్  సస్పెండ్ అయ్యింది... మీ ఎస్బీఐ అకౌంట్ ను తిరిగి పొందుటకు మేము పంపించే లింక్ ను క్లిక్ చేసి అందులో వ్యక్తిగత వివరాలను నింపండి. అప్పుడే మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ తిరిగి ఆక్టివేట్ అవుతుంది'' అని సైబర్ నేరగాళ్ళు ప్రజల బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తి గత సమాచారం సేకరిస్తున్నారని కర్నూల్ ఎస్పీ పకీరప్ప తెలిపారు. ఆ వివరాలను ఉపయోగించి కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని... ఖాతా లోని డబ్బులను మాయం చేస్తారనీ ఎస్పీ హెచ్చరించారు.

''గూగుల్ సెర్చ్ లో వివిధ అంశాలకు సంబంధించిన సేవలను పొందేందుకు పలు కంపెనీల ఫోన్ నెంబర్ ల కోసం గాలించి ఆ నెంబర్ లకు బాధితులు ఫోన్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారన్నారు. అదే విధంగా ఆదోనికి చెందిన ఒక వ్యక్తి మోసపోయి తమకు పిర్యాదు చేయడంతో దీనిపై దృష్టి సారించాం'' అని ఎస్పీ వివరించారు.

read more  విజయా రెడ్డి మర్డర్ ఎఫెక్ట్... ఇబ్రహీంపట్నం రెవెన్యూ సిబ్బంది అతిజాగ్రతలు

'' ఆదోనికి చెందిన ఓ వ్యక్తి క్లబ్ ఫ్యాక్టరీ నందు సన్ గ్లాస్ కోనుగోలు చేశారు. అయితే ఆ సన్ గ్లాసెస్ అందిన తరువాత చూస్తే పగిలిపోయి ఉన్నాయి. దీంతో బాధితుడు వెంటనే  ఇంటర్ నెట్ లో  కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ లో వెతికి ఆ కంపెని కస్టమర్ కేర్ నెంబర్ కి ఫోన్ చేశారు. 

అయితే ఆ కస్టమర్ కేర్ నంబర్ కంపనీది కాదు సైబర్ నేరగాళ్లది. వారు అతడి సమస్య ఏమిటని అడిగారు.  బాధితుడు మాకు పంపిన సన్ గ్లాస్  పగిలి పోయాయి అని తెలిపాడు. అంతటితో సైబర్ నేరగాడు మీ డబ్బులను మీ ఖాతాకు తిరిగి పంపిస్తామని... గూగ్ల్ పే లేదా ఫోన్ పే  ద్వారా డబ్బులను పంపుతాము అని చెప్పాడు. బాధితుడు ఆ మాటలు నమ్మి తన మొబైల్ లో ఫోన్ పే  యాప్ ను ఇన్ స్టాల్  చేసుకున్నాడు.  

ఆ తర్వాత సైబర్ నేరగాడు పంపిన లింక్ ను బాధితుడు క్లిక్ చేసాడు.దీంతో డెస్క్ రిమోట్ కంట్రోల్ యాప్ ద్వారా యాక్సిస్ చేసుకుని బాధితుని యొక్క ఎస్బీఐ అకౌంట్ నుండి రూ. 75 వేల ను సైబర్ నేరగాడు  కాజేసారు'' అని ఎస్పీ వివరించారు.

read more  విశాఖ భూకుంభకోణం... కలెక్టర్ తో సిట్ బృందం భేటి

''అదే  విధంగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ బాగలేకపోవడంతో రీఫండ్ అడిగేందుకు  ఇంటర్నెట్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి ఓ యువకుడు ఫోన్ చేశాడు. అతడి కాల్ ఎత్తిన వ్యక్తి  ఆ యువకుడి ఫోన్ కు ఓ లింక్  పంపించి డౌన్ లోడ్ చేసుకోవాలని... అందులో బ్యాంక్ ఖాతా వివరాలు ఎంటర్ చేయాలని సూచించాడు. దీంతో అతడు ఓటిపి ఎంటర్ చేశాడు. అంతే క్షణాల్లో ఖాతాలో ఉన్న రూ. 4  లక్షలు మాయం అయ్యాయి'' అని మరో ఉదాహరణ వివరించారు.

అందువలన సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా యూపీఐ ట్రాన్స్‌ఫర్ ను ఆధారంగా చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారని...  ప్రజలు సైబర్ నేరగాళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి తెలియని లింక్ లు మీ మొబైల్ లకు వచ్చినప్పుడు వాటిపై క్లిక్ చేయకూడదని ఎస్పీ  తెలిపారు. 

సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు దగ్గరలోని పోలీసు స్టేషన్ లో గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.
 

click me!