డిగ్రీ చదివాను... అయినా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు: మహిళా మంత్రి ఆవేదన

By Arun Kumar P  |  First Published Dec 12, 2019, 6:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతలా వుందో మంత్రి పుష్పశ్రీవాణి స్వయంగా తన అనుభవాన్ని వివరిస్తూ వెల్లడించారు. ఇంగ్లీష్ రాకపోవడంవల్ల ఎలా  ఇబ్బందిపడ్డారో అసెంబ్లీలో వివరించారు.  


అమరావతి: తాను డిగ్రీ చదివినా ఇంగ్లీష్ మీడియంలో చదవని కారణంగా ఇంగ్లీష్ మాట్లాడటం రాదని ఇప్పటికీ బాధపడుతుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి తాను సిగ్గుపడటం లేదని స్పష్టం చేసారు. తెలుగుభాషపై చంద్రబాబునాయుడుకు అంత ప్రేమ ఉంటే సిఎంగా కొనసాగిన సమయంలో 4 వేలకు పైగా తెలుగుమీడియం స్కూళ్లను ఎందుకు మూసేశారో చెప్పాలని నిలదీసారు. పేదలకు కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి వస్తే తెలుగుదేశం పార్టీ అంతరిస్తుందనే దీనికి అడ్డుతగులుతున్నారని ఎద్దేవా చేసారు.

రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అంశంపై పుష్ప శ్రీవాణి మాట్లాడారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో తెలుగుమీడియంలో చదివానని, 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాసైన తాను ఇంగ్లీష్ రాని కారణంగా చదువులో వెనుకబడిపోయానని చెప్పారు. డిగ్రీని ఇంగ్లీష్ మీడియంలో చదివిన కారణంగా తనకు ఇప్పటికి ఇంగ్లీష్ బాగా అర్థమైనా, తిరిగి మాట్లాడలేనని తెలిపారు. 

Latest Videos

దీనికి ఉదాహరణనిస్తూ ఇటీవల విశాఖలో గిరిజన శాఖకు చెందిన గురుకుల విద్యార్థులతో ఏర్పాటైన సైన్స్ ఫేర్ కు ఆ శాఖ మంత్రిగా హాజరయ్యానని.. అందులో పాల్గొన్న విద్యార్థులు తాము ప్రదర్శిస్తున్న అంశాలను గురించి ఇంగ్లీష్ లో వివరిస్తుంటే తిరిగి ఇంగ్లీష్ లో మాట్లాడలేక బాధపడ్డానని చెప్పారు. ఈ విషయం చెప్పుకోవడానికి తాను సిగ్గుపడటం లేదన్నారు. 
 
పేద పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్న జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి ముఖ్యమంత్రి ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చుకోగలిగే ఆస్తి చదువు మాత్రమే కావడంతో చిరుద్యోగుల నుంచి రోజు కూలీ చేసుకొనే పేదల దాకా కూడా తమ పిల్లలను ఏదో ఒక చిన్న ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారని చెప్పారు. 

read more అసెంబ్లీ చీఫ్ మార్షల్ కు మండలి ఛైర్మన్ వార్నింగ్

పదోతరగతి దాకా తెలుగు మీడియంలో చదివి ఆపైన ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీలు చదివినప్పటికి...  పూర్తిగా ఇంగ్లీష్ లోనే మాట్లాడే గ్రూప్ డిస్కషన్ లాంటి పరీక్షల్లో ఇంగ్లీషులో మాట్లాడలేక ఉద్యోగాలు కోల్పోయి నష్టపోయిన తెలుగుమీడియం విద్యార్థులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. కలెక్టర్ పిల్లలైనా, కలెక్టర్ ఇంట్లో పని చేసే పని మనిషి పిల్లలైనా అందరికీ కూడా చదువుకొనే సమాన హక్కు ఉందని...ఆ హక్కును దేశంలోనే మొదటిసారిగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని కితాబిచ్చారు. 

సిఎం తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలు, కూలీలు, వృత్తి పనివారి పిల్లలు కూడా ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటారని... 100శాతం ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లో సువర్ణాధ్యాయం మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ మీడియం రాకతో తెలుగు అంతరిస్తుందనడంలో అర్థంలేదన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా నారాయణ, శ్రీచైతన్య లాంటి ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలిచ్చారని గుర్తు చేసారు. తెలుగు అమ్మ భాష అని, ఈ సృష్టిలో అమ్మ ఉన్నంతవరకూ అమ్మ భాష ఉంటుందని పుష్ప శ్రీవాణి ధీమా వ్యక్తం చేసారు. 

ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తే... రాష్ట్రంలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెస్తే తెలుగు అంతరించిపోతుందంటూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. 

read more  అసెంబ్లీ సాక్షిగా అవమానం.... దళితులంటే ఆయనకు అంత చులకనా: మంత్రి సురేష్

వాస్తవానికి ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తే అంతరించేది తెలుగు కాదని తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. ముందు ఇంగ్లీష్ ను వ్యతిరేకించి ప్రజలను రెచ్చగొట్టాలని చూసారని... ప్రజల వద్ద తమ పాచిక పారక పోవడంతో యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పరిపాలనలో ఎన్నడైనా తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా చేయాలని కనీసం ఆలోచనైనా చేసారా అని ప్రశ్నించారు.తెలుగుపై అంత ప్రేమ ఉంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో 4వేలకు పైగా తెలుగుమీడియం స్కూళ్లను ఎందుకు మూసేశారో చెప్పాలని పుష్ప శ్రీవాణి నిలదీసారు. పేద పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులన్నది ఒక విప్లవాత్మక నిర్ణయమని మంత్రి అభివర్ణించారు.
  

click me!