అతిత్వరలో... కడప ప్రాజెక్టులపైనా రివర్స్ టెండరింగ్...: మంత్రి సురేష్

By Arun Kumar P  |  First Published Oct 24, 2019, 4:36 PM IST

మంత్రి ఆదిమూలపు సురేష్ కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  


కడప: ఆరు సంవత్సరాల తర్వాత  కడప జిల్లా అభివృద్ధిలో సమీక్ష కమిటీ సమావేశం జరగడం మంచి పరిణామమని ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.  
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిపెరిగిన జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా పనిచేయడమే సంతోషంగా వుంటే ఇలా అభివృద్ది కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మరింత సంతోషాన్నిస్తోందన్నారు. 

కడప డిఆర్సీ సమావేశంలో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  2014 ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకర్గాల్లోనూ, 2 లోక్ సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సిపి అభ్యర్ధులే గెలుపొందారని గుర్తుచేశారు.ఇలా అన్ని స్థానాలను ప్రతిపక్షమే కైవసం చేసుకోడాన్ని చూసి ఓర్వలేక ఇక్కడి అభివృద్దిని తొక్కిపెట్టారని అన్నారు.కనీసం డీఆర్సీ మీటింగ్ కూడా జరగనివ్వలేదని...జిల్లా అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. 

Latest Videos

undefined

గత ఐదేళ్లలో ఎందుకు టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి సమీక్ష సమావేశం జరపలేదో చెప్పాలి..? అని మంత్రి ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేసిన జిల్లాకు ఇంచార్జ్ గా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

జిల్లాలో అనేక సమస్యలపై అధికారులతో చర్చించామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ముసుగులో టీడీపీ నేతలు భారీ అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నా 5  సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారని తెలిపారు.  రైతులకు 100 కోట్ల బకాయిలు ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జిల్లాలోని గాలేరు నగరి, ఇతర ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వాపోయారు. 

రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి లాభం చేకూరుతుందన్నారు. జిల్లాలో కూడా ఈ నెలాఖరులోగా వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. కడప స్టీల్ ప్లాంట్, రాజోలి ఆనకట్ట, కుందు లిఫ్ట్ ఇరిగేషన్ లు డిసెంబర్ లో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. 

పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధి ద్యేయంగా అధికారులు కృషి చేయాలి సూచించారు.పాలనలో పారదర్శకత, నిబద్ధత ఉండాలని సూచించారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. నాయకులందరు ప్రజల్లోకి వెళ్ళాలని సూచించారు. 

రాజన్న రాజ్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న నమ్మకం వుందని పేర్కొన్నారు. పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలను చూడటం లేదన్నారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులను కలుపుకుని ముందుకు వెళతామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను తుంగలో తొక్కి చంద్రబాబు పాలన అందించారని..తాము మాత్రం ప్రజాస్వామ్యబద్దంగానే పాలన సాగిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. 


 

click me!