ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ డిజి కుమార్ విశ్వజిత్ ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో నూతన డిజిని నియమించింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిద విభాగాలకు చెందిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన అవినీతి నిరోధకశాఖ(ఎసిబి) డీజీ కుమార్ విశ్వజిత్ పై బదిలీ వేటు పడింది. ఆయనస్థానంలో ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్ గా పనిచేస్తున్న పి.సీతారామాంజనేయులు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు.
విశ్వజిత్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఏసిబి డిజిగా నియమితులైన సీతారామాంజనేయులుకు అదనంగా ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతలను కూడా అప్పగించింది. ఇక ప్రస్తుతం రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిగా వున్న ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
undefined
read more పీఎస్ లో జేసీ నిర్బంధం: ఉద్రిక్తత, కార్యకర్త ఆత్మహత్యాయత్నం
ఇటీవల ఏపి ఏసిబి ఉన్నతాధికారులతో సమావవేశమైన సీఎం జగన్ ఆ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసిబి అధికారులు మరింత చురుగ్గా, అంకితభావంతో పనిచేసి రాష్ట్రంలో నుండి అవినీతిని పారదోలాలని సూచించారు. సామాన్య ప్రజలు అవినీతి కారణంగా ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఎసిబిపై వుందని... కానీ ఈ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన వద్ద సమాచారం వుందని సీఎం పేర్కొన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని తగ్గించేందకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను సీఎం నిలదీశారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ లంచం, అవినీతి అనే మాట వినపడకుండా చేయాలని... అందుకు ఏసిబికి ఏం కావాలన్నా సమకూర్చడానికి సిద్దంగా వున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటివరకు తాను ఆశించిన రీతిలో మాత్రం ఏసిబి పనిచేయడం లేదని సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
read more టిడిపికి మరో షాక్... బిజెపి గూటికి కీలక నాయకురాలు
సీఎంతో జరిగిన ఈ సమావేశంలో సీఎస్ నీలం సహానితో పాటు డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం జరిగి రెండురోజులు కూడా గడవక ముందే ఏసిబి డిజి విశ్వజిత్ ను బదిలీ చేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.