దళిత యువతిపై మూడు రోజుల క్రితం అత్యాచారం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ సీరియస్ అయ్యారు.
అమలాపురం: సొంత నియోజకవర్గం లో ఓ యువతి అత్యాచారానికి గురై మూడు రోజులవుతున్నా స్థానిక మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ స్పందించకపోవడం విచారకరమని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్ష కుమార్ ఆరోపించారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత యువతిని హర్ష కుమార్ పరామర్శించారు.
అనంతరం ఆయన ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ... నిన్ననే(బుధవారం) కేబినెట్ సమావేశం ముగిసినప్పటికీ ఇప్పటివరకూ బాధితురాలిని పరామర్శించేందుకు మంత్రి బోస్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం నిద్ర పోతుందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలకు తప్పా పోలీస్ లు ప్రజలకు ఉపయోగపడటం లేదన్నారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితులను దిశా ఘటన తరహాలో ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. దోషులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని... అదే గనుక నిజమైతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్ గానీ వైసీపీ నాయకులు గానీ ఇప్పటి వరకూ ఈ దారుణ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. దళితులను కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాలు కోసం మాత్రమే వాడుకోకుండా ఇటువంటప్పుడు సహకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ సత్తా ఏంటో చూపిస్తాం... ఖబర్దార్ అంటూ తీవ్ర ఆవేశంతో హర్షకుమార్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.