మార్కెట్ యార్డుల్లో ఇసుక రాశులు... అందువల్లే ప్రస్తుత పరిస్థితి: జగన్ పాలనపై దేవినేని ఫైర్

By Arun Kumar P  |  First Published Dec 12, 2019, 2:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకూ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులపై మరింత భారాన్ని మోపుతున్నాయని టిడిపి నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వీటిని నియంత్రించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  ఆరోపించారు.  


విజయవాడ: ఏడు నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఉదయం తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించడంలో  జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ నిరసనకు దిగారు. 

పట్టణంలోని ఓ కిరాణదుకాణం వద్దకు వెళ్ళిన దేవినేని నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే కేవలం ఈ ఏడునెలల్లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని ఆరోపించారు. ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో నాయకులు చేసిన ఘనత ఇదేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos

 అనంతరం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం కేవలం ఏడు నెలల పాలనలోనే ప్రజలకు నరకం చూపించిందన్నారు.నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఇక ఉల్లిపాయలు సామాన్య మధ్య తరగతి వారు  కొనే పరిస్థితి లేవన్నారు. నేడు ఉల్లిపాయ 160 నుంచి 200 వరకు ధర పలుకుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పౌర సరఫరాల మంత్రి గాంధీ మహాత్ముడి సాక్షిగా నిత్యావసరాల ధరలు పెరగలేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

read more మద్దతు ధరపై కన్నబాబు సలహా... వెనక్కితగ్గిన జగన్

గుడివాడ రైతు బజార్ లో తొక్కిసలాటలో సాంబయ్య రెడ్డి చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు  చెబుతున్నా మంత్రి మాత్రం తొక్కిసలాట జరగలేదని బుకాయిస్తున్నాడని మండిపడ్డారు. అదే తొక్కిసలాటలో గాయపడ్డ ప్రత్యక్ష సాక్షి శ్యామల అనే మహిళే స్వయంగా సాంబయ్య మరణం గురించి తెలిపిందని  గుర్తుచేశారు. 

''తన ఎదురుగానే  తొక్కిసలాట జరిగిందని... ఒక వ్యక్తి కింద పడిపోగా అతన్ని ఆటోలో తీసుకువెళ్ళారని... ఈ తోపులాటలో తనకు కూడా దెబ్బలు తగిలాయని'' ఈమె చెప్పారని అన్నారు. మంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారని ఉమ ప్రశ్నించారు. 

తొక్కిసలాట జరగనప్పుడు ఉల్లిపాయల స్టాల్ ను రైతుబజార్ నుండి మార్కెట్ యార్డుకు ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలన్నారు. పెరిగిన  ధరలు రైతులకు అందడంలేదని మద్య దళారులు దోచుకుంటున్నారని అన్నారు.  ధాన్యం కొనుగోలులో అడ్డగోలు నిబంధనలతో దళారులకు మేలు చేకూర్చేలా చేస్తున్నారని... ఒక్కొక్క బస్తాకు 200 నుండి 300 రూపాయలు దళారులు దోచుకుంటున్నారంటే మాజీ మంత్రి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 

రైతుల పంటలను నిల్వ చేసుకోవాల్సిన మార్కెటింగ్ యార్డులలో ఇసుక రాశులుగా పోసి అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. మద్యపానం నిషేధం పేరుతో జగన్ మోహన్ రెడ్డి సాధించిన ప్రగతితో మద్యం ఏరులై పారుతుందని అన్నారు. 

read more నీకు మానవత్వం లేదు, దేవుడు చూసుకుంటాడులే: చంద్రబాబుపై జగన్ ధ్వజం

గత ఏడు నెలలలో ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలని ఒక్క తట్ట మట్టి గాని ఒక్క సిమెంట్ గాని ఎక్కడైనా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బూతులు మాట్లాడుతూ అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని దేవినేని  అన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వున్నది రద్దుల ప్రభుత్వం, రంగుల ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని, ఉల్లిపాయలను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఇసుకను ఉచితంగా అందించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
 

click me!