బుధవారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న సంఘటనలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అసెంబ్లీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు.
అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదాలనుకున్న ప్రజలు వైసిపి పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని...ఇప్పుడు అదే ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ పై ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని అన్నారు.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసింది తమ ప్రభుత్వమేనని అన్నారు.
వైసిపి కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారని ఆరోపించారు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో 90శాతం తమ కార్యకర్తలే ఉన్నారని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు.
4లక్షల మంది కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాటానికి 20లక్షల మంది పొట్టకొడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మంగళవారం తాము ధీటుగా సమాధానం చెప్పటంతో ఇవాళ(బుధవారం) ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు.
read more వైసిపి ప్రభుత్వంలో రెడ్డిల పెత్తనం... జాబితా బయటపెట్టిన ఎమ్మెల్యే
వాళ్లకు అనుకూలంగా మాట్లాడుకుంటూ తమ వాదన చెప్పే అవకాశం సభలో ఇవ్వట్లేదని ఆరోపించారు. రోజూ ఆందోళన చేసి సభకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. పల్లె వెలుగు బస్సుల్లోనే 50శాతం చార్జీలు పెరిగాయని తెలిపారు. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అహంభావంతో ఎంత కొవ్వెక్కి ప్రవర్తిస్తున్నారో ప్రజలకు తెలుస్తోందని...సభలో ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉంటే మైక్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సభాపతి ప్రవర్తన పద్దతిలేకుండా ఉందని మండిపడ్డారు. మైక్ ఇమ్మని అడిగితే అధికార పక్షంలో పదిమందికి అవకాశం ఇచ్చి మమ్మల్ని తిట్టిస్తున్నారని అన్నారు. ఆయన సభా సాంప్రదాయాలు పాటించడంలేదన్నారు.
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతుంటే చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా రాయలసీమకు నీటి వినియోగంపై దృష్టి పెట్టలేదన్నారు. వరద వస్తే తన ఇంటిని ముంచాలనే శ్రద్ధ సీమ ప్రజలకు నీరిచ్చేదానిపై పెట్టలేదని మండిపడ్డారు.
read more జగన్ కీలక నిర్ణయం: అసైన్డ్ భూముల అమ్మకాలు రద్దు, షాక్‌లో కొనుగోలుదారులు
టిడిపి హయాంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నీటిపారుదలకు 73వేల కోట్ల పైచిలుకు ధనాన్ని ఖర్చు పెట్టామన్నారు. పోలవరంలో ఈ ఏడు నెలల్లో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదన్నారు. రాయలసీమ నీరు ఇవ్వాలని తొలిసారిగా సంకల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు.
రాయలసీమకు ద్రోహం చేసింది మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డేనని విమర్శించారు. మిగులు జాలాలు వద్దని ట్రిబ్యునల్ కు లేఖ ఇచ్చింది వైఎస్సేనని తెలిపారు. సీమ ప్రజలకున్న హక్కులను సరెండర్ చేసి ఇప్పుడు గొప్పలు మాట్లాడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.