యావత్ దేశాన్ని కలచివేసిన దిశ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించిన విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత తప్పుబట్టారు.
అమరావతి:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఫైర్ అయ్యారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ కళ్యాణ్ అనడం సరికాదని... కేవలం రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా...? అని అన్నారు. ప్రజా నాయకుడు అని చెప్పుకునే పవన్ మహిళా సంరక్షణపై ఇలాగేనా మాట్లాడేది అని సుచరిత చురకలు అంటించారు.
హైదరాబాద్ లో అత్యంత కిరాతకంగా జరిగిన దిశ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పవన్ ఎప్పటిలాగే అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు... ఇప్పటికైనా కొంచెం బాధ్యతగా మాట్లాడాలని అన్నారు. ఇంత సీరియస్ క్రైమ్ కు పాల్పడిన వారికి రెండు దెబ్బలతో శిక్షించాలనేది అవగాహన రాహిత్యం కాకుంటే ఇంకేంటని హోంమంత్రి అన్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును కూడా తాను గెలుచుకోలేని పవన్ గురించి ఎక్కువగా మాట్లాడకూడదన్నారు.
read more జస్టిస్ ఫర్ దిశ: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన తృప్తి దేశాయ్ అరెస్ట్
మత మార్పిడి అంటూ పవన్ స్పీచులు దంచుతున్నాడని...కానీ ఎవ్వరూ ఎవ్వరిని బలవంతంగా మతం మార్చరు కదా అని అన్నారు. ఎవరికి ఇష్టమైన దేవుళ్లను వాళ్లు పూజించుకునే స్వేచ్ఛ మన దేశంలో ఉందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ పార్టీతో ఉన్నారో అర్థంకావడం లేదని...దీనిపై ఆయనే క్లారిటీ ఇవ్వాలన్నారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆర్డినెన్స్ ను తీసుకురాడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు జరుగుతోందని హోమంత్రి వెల్లడించారు.
దిశా ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ రేపిస్టులను తోలు ఊడేవరకు కొట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఓ నలుగురు కామాంధులు ఓ యువతిని నడిరోడ్డుపైనే కిడ్నాప్ చేసి అత్యాచారం చేసే స్థాయికి మన సమాజం చేరిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను అక్కాచెల్లెళ్ల మధ్య పుట్టి పెరిగానని.. ఆడబిడ్డ ఇంటి నుంచి బయటకెళ్లొచ్చిన తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి పడే బాధ తనకు తెలుసునన్నారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు కొందరు జూనియర్ ఆర్టిస్టులు వేధింపులు ఎదుర్కొవడం తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.
read more మరో దారుణం: తల్లీని రాయితో కొట్టి, బిడ్డను గొంతు కోసి.. కాల్చేశారు
అలాంటి పరిస్ధితుల్లో వాళ్లు ఇళ్లకు వెళ్లేసరికి కర్ర పట్టుకుని నిల్చొనేవాడినని, లేదంటే తన కారు ఇచ్చి పంపించేవాడినని పవన్ గుర్తు చేశారు. మన ఇంటి, సమాజంలోని ఆడబిడ్డల మాన, ప్రాణాలను రక్షించలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటని జనసేనాని ప్రశ్నించారు.
నాయకులు ఇలా ఉండబట్టే కొందరు ఆడపిల్లలపై రెచ్చిపోతున్నారని పవన్ ఆరోపించారు. నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్‌లో ఉంటే జనం వెళ్లి వారిని ఉరి తీయాలని, చంపేయాలని డిమాండ్ చేస్తున్నారని పవన్ గుర్తుచేశారు.
ఆడపిల్లపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నలుగురు చూస్తుండగా బెత్తంతో తోలు ఊడిపోయేలా కొట్టాలని పవన్ డిమాండ్ చేశారు. దేవతలు సైతం అభయ హస్తంతో పాటు ఆయుధాలతో ఉండేది సమాజాన్ని ఇలా నడపాలనే అని జనసేనాని తెలిపారు.
కర్నూలులో సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి ఉదంతాన్ని పవన్ గుర్తుచేశారు. ఈ ఘటనలో ఆ పాప అత్యాచారానికి గురై మరణించడం వల్లే చనిపోయిందని ఆధారాలు చెబుతుంటే.. రెండు రోజుల క్రితం అలాంటిదేమి జరగలేదని ప్రకటన వచ్చిందని జనసేనాని వెల్లడించారు.