ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా వుండేందుకు వైసిపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడిని సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించిన తర్వాత అమరావతిలో నిరసనలు మిన్నంటాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు, సామాన్య ప్రజానికంతో పాటు వివిధ రాజకీయ పార్టీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. మరోవైపు రాజధాని మార్పును సవాల్ చేస్తూ మరికొందరు కోర్టులను ఆశ్రయించారు.
అయితే ఎట్టిపరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్ణయంపై వెనక్కి తగ్గకూడదని భావిస్తున్న సీఎం జగన్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో న్యాయపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజధాని కేసుల వాదనకు మాజీ అటార్నీ జనరల్‌ను నియమించారు. ఈ మేరకు ఏపీ సర్కార్
ఓ ప్రకటన విడుదలచేసింది.
READ MORE బలహీన వర్గం వాడినే... కానీ బలహీనున్ని కాదు : టిడిపికి తమ్మినేని హెచ్చరిక
హైకోర్టులో రాజధాని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులు వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది. ఆయన ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ తదితర అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించేందుకు రోహత్గీని నియమించారు. ఇకపై ఆయా కేసులన్నింటినీ రోహత్గీయే వాదించనున్నారు.