విజయవాడలోనే గణతంత్ర వేడుకలు... ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

By Arun Kumar PFirst Published Jan 22, 2020, 7:05 PM IST
Highlights

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

అమరావతి: జనవరి 26వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిఅధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లుపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ... గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా  విచ్చేసే రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, మంత్రులు తదితర ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ఈ వేడుకలకు సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్, పోలీస్, ఎన్సిసి తదితర విభాగాలచే నిర్వహించే కవాతు ప్రదర్శనకు సంబంధించిన రిహార్సల్ ప్రక్రియను ఈనెల24వ తేదీ సాయంత్రానికి పూర్తి చేయాలని చెప్పారు.వేడుకలను తిలకించేందుకు వచ్చే విద్యార్ధులు, ప్రజలకు తాగునీరు, మరుగుదొడ్లు, సీటింగ్ వంటి ఏర్పాట్లు సక్రమంగా చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలు ముఖ్యంగా నవరత్నాలను ప్రతిబింబించే రీతిలో వివిధ శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఇంకా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు.

రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ... ఈనెల 24వ తేదీ సాయంత్రానికి గణతంత్ర దినోత్సవ రిహార్శల్స్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.స్టేడియంలో స్థలాభావం, సమయాన్ని  దృష్టిలో ఉంచుకుని వివిధ శకటాల ప్రదర్శనను ఆలస్యం కాకుండా సక్రమంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ 26వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన మినిట్ టు మినిట్ కార్యక్రమ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  26వ తేదీ ఉదయం 9గంటల నుండి ఈ వేడుకలు ప్రారంభం అవుతాయని తెలిపారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.మహ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ... గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలు విద్యార్ధులు అధిక సంఖ్యలో వేడులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ... ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు, బందోబస్తు ఏర్పాట్లు తదితర అంశాలను వివరించారు.

విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ... వేడుకలు జరిగే స్టేడియం ప్రాంగణంతో పాటు నగరంలో వసతి కల్పిస్తున్న 9ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని తెలిపారు. అదే విధంగా నిరంతర పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ... వేడుకలను తిలకించేందుకు వచ్చిన వారందరికీ కనిపించేలా స్టేడియం ప్రాంగణంలో మూడు ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. అలాగే పటిష్టమైన ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన 14 శకటాల ప్రదర్శనకు గుర్తించడం జరిగిందని చెప్పారు. ముఖ్య అతిధి సందేశం సిద్దం చేయడం తోపాటు తెలుగు,ఆంగ్ల భాషల్లో వేడుకల వివరాలను తెలిపే కామెంటేటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు.

ఆర్అండ్‌బి, ట్రాన్స్‌కో, వైద్య ఆరోగ్యం, ఉద్యానవన, రవాణా, అగ్నిమాపక, ఎపిఎస్పి తదితర శాఖల అధికారులు వారివారి శాఖల పరంగా చేస్తున్న ఏర్పాట్లను సమావేశంలో సిఎస్ కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ ఎఆర్ అనురాధ, శాంతి భద్రతల అదనపు డిజి రవిశంకర్ అయ్యన్నార్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, గవర్నర్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి యం.రవిచంద్ర ఇంకా ఎపిఎస్పి, సిఆర్ పిఎఫ్,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

click me!