అన్నోచ్చాడు... జగనన్న వచ్చాడన్న నమ్మకం కలిగింది...నాకే కాదు...: మంత్రి పుష్పశ్రీవాణి

By Arun Kumar P  |  First Published Dec 13, 2019, 2:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో దిశ చట్టంపై  చర్చ సందర్భంగా డిప్యూటీ సిఎం పాముల  పుష్పశ్రీవాాణి భావోద్వేగంగా మాట్లాడారు. ఈ చట్టంపై యావత్ మహిళా లోకం ఎంత నమ్మకందో  వుందో ఆమె తన మాటల్లో తెలిపారు.  


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెటిన దిశ చట్టంపై ఒక డిప్యూటీ సీఎంగానే కాకుండా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళగా మాట్లాడటం చాలా గర్వంగా వుందన్నారు. ఇలాంటి చారిత్రాత్మక బిల్లుకు యావత్ రాష్ట్ర మహిళాలోకం సంపూర్ణ మద్థతుని తెలుపుతుందన్నారు. ఇంతగొప్ప మహిళా భద్రతా చట్టాన్ని తీసుకొచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున, ముఖ్యంగా మహిళలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ధన్యవాదములు తెలుపుతున్నట్లు ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. 

''దేశం మొత్తం దిశా ఘటన తర్వాత స్టేట్‌మెంట్లకే పరిమితమైపోతే ముఖ్యమంత్రి జగన్ మాత్రం దేశానికే దిశా నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నాను. ఇంతగొప్ప మహిళా పక్షపాతి అయినటువంటి సీఎం మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా గిరిజనమహిళనైన నాకు అవకాశమిచ్చినందుకు  మరింత గర్వపడుతున్నాను. నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను'' అంటూ  ముఖ్యమంత్రిని ప్రశంసించారు మంత్రి శ్రీవాణి.

Latest Videos

undefined

''ఈ చట్టం మాలో ఒక నమ్మకాన్ని కలిగించింది. నిత్యం నరకంలో నడిచే యావత్‌ మహిళా లోకానికి నమ్మకం కలిగించింది. ఆ నమ్మకం ఎలాంటిదంటే ఈ చట్టం వల్ల న్యాయస్ధానంలో న్యాయదేవత కళ్లకు గంతలు తెరుచుకుని ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపైనా ఆదిపరాశక్తిగా మారి శిక్షిస్తుందన్న నమ్మకం కలిగింది

.ఈ చట్టం పోలీసులు తలపై ఉన్న మూడు సింహాలు, కనిపించని నాలుగో సింహం ఒక్కటై ఆడవాళ్లను హింసించే మానవ మృగాలను వెంటపడి వేటాడుతాయన్న నమ్మకం కలిగించింది. 

ఈ చట్టం అనాదిగా అల్లరిమూకలు, ఆకతాయిలు, అరాచక శక్తులు రాక్షసక్రీడకు బలైపోతున్న మహిళల గుండె మంటల్ని చల్లార్చి గుండె ధైర్యాన్ని నింపిందన్న నమ్మకాన్ని కలిగించింది.

స్త్రీ అంటే అవసరాలు తీర్చే యంత్రంగానో, స్త్రీ అంటే అవమానాల కోసం పుట్టే ప్రాణంగానో, స్త్రీ అంటే రేపిస్టులకు ప్రయోగశాలగానో భావించే ఈ సమాజంలో ఆ స్త్రీకి ఒక రక్షణ కవచంగా ఈ చట్టం ఒకటి వచ్చిందన్న నమ్మకం ఈ రోజు కలిగింది'' అని మంత్రి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. 

read more దిశ చట్టం నేరస్తులకు సింహస్వప్నం: మంత్రి తానేటి వనిత

నిన్నటి వరకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల మానసిక స్దితి చాలా దయనీయంగా ఉండేదని పేర్కొన్నారు. దిశ అత్యాచారం, హత్య చూసిన తర్వాత ఒక్కసారిగా మహిళల మానసిక సంఘర్షణ రోడ్డుకెక్కిందని అన్నారు. 

తండ్రి వయస్సులో ఉన్నవాళ్లు, తమ్ముడిలా చూసినోళ్లు, స్నేహితుడిలా మెలిగినోళ్లు, పాఠాలు చెప్పే లెక్చరర్లు, గుర్తు తెలియని వాళ్లు ఇలా ఎవరు బడితే వాళ్లు ఆడవాళ్లపై అడవి మృగాళ్ల మాదిరిగా దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారని ఆవేదనతో తెలిపారు. మనమేం చేసినా ఎవడూ అడిగేవాడు లేడులే అన్న పొగరుతో రెచ్చిపోతున్నారని... కానీ ఈ రోజు అలాంటి వాళ్లచేతిలో బలైపోతున్న ఆడవాళ్ల తరపున అడిగే చట్టం ఒకటి వచ్చిందన్నారు.   

ఈ చట్టాన్ని అమలుజేసే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్న నమ్మకం యావత్‌ మహిళా లోకానికి కలిగిందన్నారు.నిన్నటివరకు తనకే కాదు ఈ దేశంలోని ఏ మహిళకూ కూడా ఆ నమ్మకం లేనటువంటి పరిస్ధితి ఉందన్నారు. ఇప్పుడు తమ రక్షణపై నమ్మకం పెరిగిందన్నారు.  

''ఇప్పటివరకు మనకు అనేక చట్టాలు ఉన్నాయని... నిర్భయ చట్టం, ఫోక్సో చట్టం, వరకట్న వేధింపులు చట్టం, ఇండియ్‌ పీనల్‌ కోడ్, పటిష్టమైన న్యాయవ్యవస్ధ, గొప్ప పోలీసు వ్యవస్ధ అన్నీ ఉన్నాయి

కానీ దిశ సంఘటన జరిగిన తర్వాత ఆ చట్టాలు శిక్షిస్తాయన్న నమ్మకం ఎవరికీ కలగలేదు. అందుకే దిశను చంపిన మృగాలు దిక్కులేని కుక్క చావు చావాలని చెప్పి ఈ దేశంలో ప్రతీ మహిళా  గొంతెత్తి నినదించింది. 

దిశను దారుణంగా చంపిన ఆ నలుగురూ ఎన్‌కౌంటర్‌ అయితే శెభాష్‌ పోలీస్‌ అని ప్రశంసించడం జరిగింది. చట్టమంటే భద్రత, భయం రెండూ కలిగించాలి... అలా కానప్పుడు అది బలవంతులకు చుట్టం కానీ బలహీనులకు న్యాయం చేసే చట్టం అవదు. అందుకే ఈ పరిస్ధితుల్లో మార్పు తెచ్చేందుకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒక గొప్ప చట్టాన్ని తీసుకురావడం జరిగింది''  అని మంత్రి పేర్కొన్నారు. 

''పాదయాత్ర సమయంలో నేను గానీ, మా పార్టీ నాయకులు గానీ రాష్ట్రంలో ప్రతీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గానీ ఒక మాట చెప్పేవాళ్లం...అదేంటంటే అన్నొస్తున్నాడు మనకు అండగా నిలుస్తాడని చెప్పేవాళ్లం. ఈ రోజు ఈ చట్టం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ నిజంగానే మా అన్న వచ్చాడన్న విశ్వాసం ప్రతీ ఒక్కరిలోనూ కలిగింది. 

ఏపీ అసెంబ్లీలో దిశ చట్టం, మృగాలకు ఉరే సరైన శిక్ష:హోంశాఖ మంత్రి సుచరిత

మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి ఇద్దరు ఆడబిడ్డల తండ్రిగా చలించిపోయినప్పుడు మహిళలుగా ఇక్కడున్న నేను, మా మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఆడబిడ్డకు ఇన్నాళ్లకు మా కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడన్న నమ్మకం కలిగింది. 

ఆ రోజు దిశ చట్టం గురించి సీఎం మాట్లాడటం చూస్తే ఒక ఆడకూతురుకు అన్యాయం జరిగితే స్పందించే ఒక తండ్రి కనిపించాడు. ఒక చెల్లిపై అఘాయిత్యం జరిగితే స్పందించే ఒక అన్న కనిపించాడు. ఒక అక్కకు అఘాయిత్యం జరిగితే స్పందించే తమ్ముడు కనిపించాడు.'' అన్నారు.

''ఈ రోజు చందమామలో మనం అందాన్ని చూస్తాం, వెన్నెలను చూస్తాం. కొంతమంది మాత్రం మచ్చనే చూస్తారు. గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అలాగే కనిపిస్తోంది. ఆ రోజు ఆయన స్పందించిన తీరులో టోల్‌ గేటు మాత్రమే కనిపించింది. అది చందమామలో ఉండే మచ్చ కాదు, వాళ్ల మనసులో ఉండే మచ్చ'' అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. 

click me!