ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరతను తగ్గించడానికి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్రమ రవాణాను అడ్డుకోడానికి బార్డర్లపై నిఘా పెట్టే ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం తదితర అక్రమ రవాణా నియంత్రించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నీలం సాహ్ని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దులతో పాటు ప్రధాన ప్రాంతాల్లో త్వరలో 439 చెక్ పోస్టులు అందుబాటులోకి తేనున్నట్లు సీఎస్ వెల్లడించారు. వీటి ద్వారా నిరంతరం పర్యవేక్షించి అక్రమ రవాణాను అడ్డుకుంటామని అన్నారు.
శుక్రవారం అమరావతి సచివాలయంలో చెక్ పోస్టుల ఏర్పాటు విషయమై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భగా సిఎస్ మాట్లాడుతూ... ప్రతిపాదిత చెక్ పోస్టుల నిర్మాణం సిబ్బంది నియామకాన్ని చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ప్రతి చెక్ పోస్టులోనూ ఒక పోలీస్ సిబ్బందితో పాటు మరో ముగ్గురు ఇతర ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. అదే విధంగా ఏర్పాటు చేస్తున్న ప్రతి చెక్ పోస్టుల్లో సిసి కెమెరా ఏర్పాటు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్డి వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. చెక్ పోస్టులు ఏర్పాటు నిర్వహణ విషయంలో భూగర్భ గనులు శాఖ పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
read more ప్రభుత్వమే కాదు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా... జగన్ ప్రభుత్వ కీలక ప్రకటన
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని... కావున ప్రతిపాదించిన చెక్ పోస్టులను పూర్తిగా ఏర్పాటు చేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సిఎస్ నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ... ఇప్పటికే 216 చెక్ పోస్టుల నిర్మాణం పూర్తికాగా మరో 130 చెక్ పోస్టుల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు.
read more మేకవన్నె పులినే ప్రజలు నమ్మారు... ఇప్పుడు వారికి అర్థమవుతోంది: కళా వెంకట్రావు
ఈ సమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ గిరిజా శంకర్, డిజి ఎస్పిఎఫ్ ఎన్.వి సురేంద్ర బాబు, అదనపు డిజిపి శాంతి భద్రతలు రవి శంకర్ అయ్యన్నార్, భూగర్భ గనులు శాఖ కార్యదర్శి రామ్ గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.