Breaking News : ఏపీలో రక్తమోడిన రహదారులు... రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు (సిసి ఫుటేజి)

By Arun Kumar P  |  First Published Nov 22, 2023, 11:34 AM IST

విశాఖపట్నంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.  లారీ, ఆటో ఢీకొనడంతో ఎనిమిది మంది చిన్నారులు గాయపడ్డారు. 


విశాఖపట్నం : వేగంగా దూసుకొస్తున్న లారీకి సడన్ గా స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఆటో అడ్డువచ్చింది. దీంతో లారీ అదేవేగంతో ఆటోను ఢీకొట్టడంతో విద్యార్థులు అమాంతం ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇలా ఆటోలోని విద్యార్థులంతా రక్తంతో తడిసి, నొప్పితో విలవిల్లాడిపోతూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ భయానక ప్రమాదం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నంకు చెందిన కొందరు విద్యార్థులు రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం ఆటోలో స్కూల్ కి బయలుదేరారు. అయితే ఆటో డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా ముందువెనక చూసుకోకుండా ఆటోను నడపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లారీ వేగంగా దూసుకొస్తున్నా పట్టించుకోకుండా ఆటోను ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. దీంతో లారీ అదేవేగంతో లారీపైకి దూసుకువచ్చింది. దీంతో ఆటో అమాంతం పల్టీలు కొట్టగా అందులోని చిన్నారులు ఎగిరి రోడ్డుపై పడగా మరింకొందరు దానికిందే చిక్కుకుపోయారు. 

Latest Videos

వీడియో

వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులను కాపాడారు. గాయాలతో రోడ్డుపైపడిన విద్యార్థులను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఇలా రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఎనిమిదిమంది విద్యార్థుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. మిగతా ముగ్గురు విద్యార్థులు ప్రథమచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 

Read More  ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు అలర్ట్..

ఈ ప్రమాదానికి సంబంధించిన సిసి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని అర్థమవుతోంది.  ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విశాఖ డిసిపి శ్రీనివాస్ పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు ఆటో డ్రైవర్ ను పోలీసులు విచారిస్తున్నారు.  

ఇదిలావుంటే ఇవాళ తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘోర రోడ్డుప్రమాదమే చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం కేతనకొండ గ్రామ సమీపంలో రోడ్డుపక్కన  ఆగివున్న లారీని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మిగతా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు క్షతగాత్రులను కాపాడారు. కారులో ఇరుక్కుపోయినవారిని బయటకు తీసి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చికిత్స అందండంతో ఆరుగురికి ప్రాణాపాయం తప్పింది. 
 

click me!