అదే కొంప ముంచింది: మొహాలీ వన్డే ఓటమిపై కోహ్లీ అప్ సెట్

By telugu teamFirst Published Mar 11, 2019, 10:46 AM IST
Highlights

తమ ప్రదర్శన పట్ల విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి తమ అంచనా తప్పయిందని అన్నాడు. మంచు వల్ల చివర్లో మత బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదని అన్నాడు. అయితే దీన్ని తమ ఓటమికి సాకుగా చెప్పనని అన్నాడు. 

మొహాలీ: గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడం వల్ల చాలా బాధేస్తోందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించి విజయాన్ని అందుకుంది. 
తమ ప్రదర్శన పట్ల విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి తమ అంచనా తప్పయిందని అన్నాడు. మంచు వల్ల చివర్లో మత బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదని అన్నాడు. అయితే దీన్ని తమ ఓటమికి సాకుగా చెప్పనని అన్నాడు. 

ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృధా కావడం జీర్ణించుకోలేనిదని కోహ్లీ అన్నాడు. స్టంపింగ్‌ అవకాశం చేజారిందని, ఫీల్డింగ్‌ బాగా లేదని అన్నాడు.. డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందని అన్నాడు. టర్నర్ 44వ ఓవరులో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు జరిగిన విషయం వల్ల ఆ సందేహం ఉత్పన్నమవుతోందని అన్నాడు. 

బంతి టర్నర్ బ్యాట్ ను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతిలో పడినట్లు అనిపించడంతో ఇండియా అపీల్ చేసింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదని, దాంతో ఇండియా రివ్యూకు వెళ్లింది. థర్డ్ అంపైర్ రివ్యూలో బ్యాట్ బంతిని తాకినట్లు అర్థమైంది. కానీ తగిన ఆధారం లేదంటూ థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. ఈ విషయాన్నే విరాట్ కోహ్లీ మనసులో పెట్టుకుని డిఆర్ఎస్ పై వ్యాఖ్యనించాడు.

డిఆర్ఎస్ నిర్ణయం తమను ఆశ్చర్యపరిచిందని, ప్రతి ఆటలో అది చర్చనీయాంశంగా మారుతోందని, డిఆర్ఎస్ నిర్ణయం కచ్చితంగా ఉండడం లేదని, అది ఆట ఫలితాన్ని మార్చే సంఘటన అని ఆయన అన్నాడు. 

అస్టన్‌ టర్నర్‌, ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌ల అద్భుతంగా ఆడారని, ప్రత్యర్ధి జట్టు తమ కన్నా బాగా ఆడిందని, వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో తమ కళ్లు తెరచుకున్నాయని కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్‌ ఫలితం మరో మాటకు తావు లేకుండా తమను చాలా బాధపెడుతోందని అన్నాడు.

click me!