ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి: ధోనీ-జాదవ్ అలా ఎందుకు ఆడారంటే

By Siva KodatiFirst Published Jul 1, 2019, 1:42 PM IST
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయానికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ-కేదార్ జాదవ్‌లే కారణమని అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయానికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ-కేదార్ జాదవ్‌లే కారణమని అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

కీలక సమయంలో బ్యాట్ ఝళిపించకుండా వీరు సింగిల్స్‌కే పరిమితమయ్యారంటూ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అయితే ధోనీ-జాదవ్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ మద్ధతుగా నిలిచారు.

పిచ్ కారణంగానే వారిద్దరూ నిదానంగా ఆడారని.. ఫ్లాట్ వికెట్ కావడంతో బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదని.. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి విజయం సాధించారని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

బౌండరీల కోసం ధోని చాలా కష్టపడ్డాడని.. కానీ ప్రత్యర్ధి ఆటగాళ్లు వారికి ఛాన్సివ్వలేదని కోహ్లీ తెలిపాడు.  ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో జరిగిన తప్పులపై సమీక్ష జరుపుతామని.. తదుపరి మ్యాచ్‌కు ప్రణాళికలు రచిస్తామని కోహ్లీ వెల్లడించాడు.

టోర్నీలో ప్రతి జట్టూ ఓడిందని.. ఎవరూ ఓటమిని కోరుకోరు.. కానీ ప్రత్యర్ధి జట్టు గొప్పగా ఆడినప్పుడు ఓటమిని అంగీకరించాల్సిందే... ఓటమి నుంచి కోలుకోవడం ఎలానో ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా మాకు తెలుసునన్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలకపాత్ర పోషించిందని.. బౌండరీ చాలా చిన్నగా ఉందని  కోహ్లీ అభిప్రాయపడ్డాడు. దీనిని గుర్తించిన ఇంగ్లాండ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారన్నాడు.

వారి బ్యాటింగ్ విధ్వంసం చూసి ఓ దశలో 360 దాటుతుందనుకున్నానని.. కానీ తమ బౌలర్లు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు అడ్డుకట్ట వేశారని కోహ్లీ తెలిపాడు. మంచి ఆరంభం అందితే గెలుస్తామనుకున్నాం..  కానీ అది కుదరలేదని పంత్, పాండ్యా అద్భుతంగా ఆడారని కోహ్లీ ప్రశంసించాడు. 

click me!