బంతి తగలకున్నా, ఔటిచ్చిన అంపైర్: తిట్టుకుంటూ మైదానం వీడిన రాయ్

By Siva KodatiFirst Published Jul 12, 2019, 8:14 AM IST
Highlights

పాట్ కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రాయ్.. కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు... కీపర్ అప్పీలు చేయగానే అంపైర్ ధర్మసేన వేలు పైకెత్తాడు. అయితే బంతి తన బ్యాటుకు కానీ.. గ్లోవ్స్‌కు కానీ తగలకున్నా ఔట్‌గా ప్రకటించడంతో రాయ్ షాక్‌కు గురయ్యాడు. 

ప్రపంచకప్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయానికి మరో బ్యాట్స్‌మెన్ బలయ్యాడు. ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియా నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది.

ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్ కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్టార్క్ ఓవర్‌లో రెండు ఫోర్లు, స్మిత్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాది మాంచి ఊపులో ఉన్నాడు.

65 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసిన రాయ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పాట్ కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రాయ్.. కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు... కీపర్ అప్పీలు చేయగానే అంపైర్ ధర్మసేన వేలు పైకెత్తాడు.

అయితే బంతి తన బ్యాటుకు కానీ.. గ్లోవ్స్‌కు కానీ తగలకున్నా ఔట్‌గా ప్రకటించడంతో రాయ్ షాక్‌కు గురయ్యాడు. రివ్యూకి వెళ్లాలని భావించినప్పటికీ  అవి అయిపోవడంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.

కానీ.. అంపైర్‌తో మాత్రం వాదనకు దిగాడు. మైదానంలోనే నోటికి పనిచెబుతూ రెచ్చిపోయాడు. మైదానంలోని స్క్రీన్‌పై వేసిన రీప్లయిలో రాయ్ ఔట్ కాలేదని తేలింది. అది చూసిన రాయ్ మరింతగా రెచ్చిపోయాడు.

బౌండరీ లైన్ దాటేవరకు తిడుతూనే ఉన్నాడు. దీంతో అతడి ప్రవర్తన చర్చనీయాంశమైంది. ఫైనల్‌కు ముందు అతనిపై రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటాడోని ఇంగ్లాండ్ జట్టులో ఆందోళన నెలకొంది. 

click me!