ఒకటి కాదు, రెండు కాదు! టీ20లో 11 మంది బౌలర్లను వాడిన జింబాబ్వే... అయినా దక్కని విజయం...

By Chinthakindhi RamuFirst Published Oct 11, 2022, 1:58 PM IST
Highlights

శ్రీలంకతో వార్మప్ మ్యాచ్‌లో 11 మంది బౌలర్లను వాడిన జింబాబ్వే... 33 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న శ్రీలంక... 

టీ20ల్లో ఒక్కో బౌలర్‌కి నాలుగేసి ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. ఐదుగురు బౌలర్లు పూర్తి కోటా వేస్తే సరిపోతుంది. బౌలర్లపై భారం పడకుండా ఉండేందుకు లేక పరుగులను నియంత్రించే ఉద్దేశంతో సాధారణంగా ఆరు లేదా ఏడుగురు బౌలర్లను వాడుతూ ఉంటాయి.అయితే జింబాబ్వే మాత్రం ఏకంగా 11 మంది బౌలర్లను వాడేసింది. అంటే జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికీ బౌలింగ్ చేసే అవకాశం దక్కిందన్న మాట...

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు శ్రీలంక, జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఏకంగా 11 మంది బౌలర్లను ప్రయోగించినా, శ్రీలంక జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది...

పథుమ్ నిశ్శంక 15 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ధనంజయ డి సిల్వ 16 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేయగా గుణతిలక 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేశడు..

భనుక రాజపక్ష 16 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేయగా ధస్సున్ శనక 13 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు, వానిందు హసరంగ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే తరుపు 9 బౌలర్లు రెండేసి ఓవర్లు బౌలింగ్ చేయగా మరో ఇద్దరికి చెరో ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. చెరో ఓవర్ వేసిన మెడెవెరే, మిల్టన్ శుబ తలా ఓ వికెట్ తీయగా బ్రాడ్ ఎవన్స్, రియాన్ బర్ల్, సికందర్ రజాలకు ఒక్కో వికెట్ దక్కాయి.

189 పరుగుల లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 155 పరుగులకి పరిమితమైంది. రగిస్ చకబ్వా 15 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేయగా క్రెగ్ ఎర్విన్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. 

42 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేసిన వెస్లీ మెడెవేరే రిటైర్ హర్ట్‌గా అవుట్ కాగా సీన్ విలియమ్స్ 2, సికిందర్ రజా 1 పరుగు చేసి నిరాశపరిచారు. 25 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేసిన మిల్టన్ శుబని ధనంజయ క్లీన్ బౌల్డ్ చేయగా రియాన్ బర్ల్ 12, టోనీ మున్యోంగ 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...

అక్టోబర్ 15న శ్రీలంక, నమీబియాతో జరిగిన మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రారంభం కానుంది. అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగి ఆసియా కప్ 2022 టోర్నీని గెలిచిన శ్రీలంక జట్టు, ఆ విజయోత్సహంతో పొట్టి ప్రపంచకప్‌లో ఆడనుంది..  2014లో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ని గెలిచిన శ్రీలంకతో పాటు 2016 టీ20 వరల్డ్ కప్ విజేత వెస్టిండీస్ కూడా ఈసారి క్వాలిఫైయర్ మ్యాచులు ఆడబోతున్నాయ.

click me!