
భారత క్రికెట్ జట్టుతో వరుణుడిది విడదీయరాని అనుబంధం. ఆస్ట్రేలియా వెళ్లినా, వెస్టిండీస్‌కి వెళ్లినా, ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లినా వాన దేవుడు కూడా పాస్ పోర్ట్ లేకుండా టికెట్ వేసుకుని వెంటేవస్తాడు. సౌతాఫ్రికాతో లక్నోలో మొదటి వన్డేకి ఆటంకం కలిగించిన వర్షం, ఢిల్లీలో జరగనున్న మూడో వన్డేని వదల్లేదు...
రాత్రి కురిసిన వర్షం కారణంగా అరుణ్ జైట్లీ స్టేడియం తడిసి ముద్దయ్యింది. పిచ్, అవుట్ ఫీల్డ్‌లో తడి ఎక్కువ ఉండడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు టాస్ జరగాల్సి ఉండగా, వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా 1:30కి సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. ఆ సమయానికి పరిస్థితి మెరుగైతే 1:45కి టాస్ జరిగి, 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది...
తొలి వన్డేలో టీమిండియాపై 9 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది సౌతాఫ్రికా. రెండో వన్డేలో 7 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు సిరీస్‌ని 1-1 తేడాతో సమం చేసింది. దీంతో నేటి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది.
మొదటి రెండు వన్డేల్లో ఫెయిల్ అయిన కెప్టెన్ శిఖర్ ధావన్‌కి నేటి మ్యాచ్ కీలకంగా మారనుంది. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు చేశాడు శిఖర్ ధావన్. అయితే అదే మ్యాచ్‌లో 72 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ ఇంప్రెషన్ అంతా కొట్టేశాడు. గిల్ ఇన్నింగ్స్ కారణంగా గబ్బర్ చేసిన పరుగులను ఎవ్వరూ పట్టించుకోలేదు...
రెండో వన్డేలో స్పీడ్ పెంచి 21 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసి అవుటైన శిఖర్ ధావన్, మూడో వన్డేలో 68 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ధావన్ నుంచి టీమిండియా ఆశించిన పర్ఫామెన్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో 16 బంతుల్లో 4 పరుగులు చేసి అవుటైన శిఖర్ ధావన్, రెండో వన్డేలో 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ కావడం అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తోంది...
ఇంతకుముందు ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత ఇండియాలో పర్యటించింది సౌతాఫ్రికా. ఈ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో సౌతాఫ్రికా గెలవగా, తర్వాతి రెండు టీ20ల్లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో టీమిండియా విజయాలు అందుకుంది. సిరీస్ డిసైడర్‌గా చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో నేటి మ్యాచ్ కూడా అలాగే రద్దు అవుతుందా? అని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
అధికారికంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియాకి ఇదే ఆఖరి మ్యాచ్. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధాన జట్టు, సోమవారం వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడి గెలిచింది.