Micheal Vaughn: టీమ్ ఇండియాకు ఆయన అవసరం ఎంతైనా ఉంది.. ధోనిని ఆకాశానికెత్తిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

By team teluguFirst Published Sep 27, 2021, 1:09 PM IST
Highlights

MS DHONI: త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం ధోనిని టీమ్ ఇండియా సలహాదారుడిగా నియమించడంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మిస్టర్ కూల్ నియామకంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్  వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమ్ ఇండియా మెంటార్ గా నియమితుడైన  జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనిని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ సమర్థించాడు. భారత జట్టుకు  ధోని అవసరం ఎంతైనా ఉందని అతడిని ఆకాశానికెత్తాడు. బీసీసీఐ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచినా  తాను మాత్రం ధోని నియామకాన్ని సమర్థిస్తానని చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 17 నుంచి దుబాయ్, అబుదాబిలలో జరుగనున్న పొట్టి ప్రపంచకప్ కోసం బీసీసీఐ ధోనిని మెంటార్ గా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై  వాన్ మాట్లాడుతూ.. ‘మీకు ఆ బ్రెయిన్ (ధోని) కావాలి. డగ్ అవుట్ లోనే గాక శిక్షణ శిభిరంలోనూ ధోని ఉంటే మిగతావాళ్లు పెద్దగా ఆలోచించాల్సిన పన్లేదు. అతడి నిర్ణయాలు 90 నుంచి 95 శాతం కరెక్ట్ అవుతాయి. అతడొక మాస్టర్’ అంటూ ధోనిని ఆకాశానికెత్తాడు. 

అంతేగాక శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా ధోని అనుసరించిన వ్యూహాలను వాన్ మెచ్చుకున్నాడు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో  అతడికతడే సాటి అని ధోని మరోసారి నిరూపించుకున్నాడని అన్నాడు.  ‘సీఎస్కే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాంబినేషన్స్ కావాల్సి ఉంది. పిచ్ ను బట్టి, బౌలర్ ను బట్టి ధోని దానిని మారుస్తాడు.

ఆర్సీబీ తరఫున మ్యాక్స్వెల్ బౌలింగ్ చేస్తున్నాడని గమనించిన ధోని..  అతడు మరో రెండు, మూడు ఓవర్లు బాల్ వేస్తాడని ఊహించాడు. దాంతో అప్పుడు రావాల్సిన లెఫ్ట్ హ్యాండర్ కు బదులు రైట్ హ్యాండర్ ను పంపాడు. అది స్మార్ట్ క్రికెట్’ అని వాన్ చెప్పాడు. టీ20లలో ధోని అత్యుత్తమ కెప్టెన్ అని, అది ప్రస్తుత టీమిండియాకు కచ్చితంగా లాభిస్తుందని వాన్ పేర్కొన్నాడు. 

click me!