T20 World Cup 2022: దక్షిణాఫ్రికాతో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. సఫారీ బౌలర్ల దాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పేసర్ షోయభ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచకప్ లో సెమీస్ అవకాశాలు బతికుండాలంటే తాము ఆడే ఇతర మ్యాచ్ లు గెలవడంతో పాటు ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌ది. వరుసగా రెండు మ్యాచ్ లు (భారత్, జింబాబ్వే) ఓడిన తర్వాత ప్రపంచకప్ లో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు ప్రధానంగా భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. ఆదివారం పెర్త్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో టీమిండియా గనక విజయం సాధించి ఉంటే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా చేసిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ టపటప కుప్పకూలుతుంటే అక్తర్ ఓ వీడియో ద్వారా స్పందించాడు. మీ మీదే ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కలలు కల్లలయ్యేలా చేస్తున్నారు కదయ్యా.. అని విచారం వ్యక్తం చేశాడు.
వీడియోలో అక్తర్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ కోసం టీమిండియా గెలవాలని నేను ఇంతకుముందే ఓ వీడియోలో చెప్పాను. కానీ వీళ్ల ఆట చూస్తుంటే పాకిస్తాన్ పతనం కోసమే ఆడుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు పోయాయి. ఇక ముందు ఏం జరుగుతుందో తెలియడం లేదు...’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Bhaiyo bahut jaldi main hain? pic.twitter.com/QVIf9Y4bj0
— Shoaib Akhtar (@shoaib100mph)undefined
నిన్నటి మ్యాచ్ లో భారత్.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో ఓవర్ దాకా బాగానే సాగినా లుంగి ఎంగిడి వేసిన ఐదో ఓవర్లో భారత పతనం ప్రారంభమైంది. ఆ ఓవర్లో ఎంగిడి.. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లను ఔట్ చేశాడు. తన తర్వాత ఓవర్లో అతడు కోహ్లీని ఔట్ చేయగా నోర్త్జ్.. దీపక్ హుడా పని పట్టాడు. అనంతరం ఎంగిడి.. హార్ధిక్ పాండ్యాను కూడా ఔట్ చేసి భారత్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. 8.3 ఓవర్లలో భారత్ 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకుని భారత్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
అనంతరం ఫీల్డింగ్ వైఫల్యాలు, క్యాచ్ మిస్ లతో భారత జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. బౌలర్లకు అనుకూలించిన పెర్త్ పిచ్ పై టీమిండియా బౌలింగ్ దళం సఫారీలను కట్టడి చేసినా ఫీల్డింగ్ తప్పిదాలతో భారత్ రెండు వరుస విజయాల తర్వాత టీ20 ప్రపంచకప్ లో ఓటమి మూటగట్టుకుంది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా.. 19. 4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మిల్లర్ (46 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్రమ్ (41 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు మెరుగ్గా ఆడి తమ జట్టుకు విజయాన్ని సాధించిపెట్టారు.