
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఏడాదికాలంగా నిలకడగా ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా ఆడటమే గాక సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ లో అయితే ఏకంగా మూడు సెంచరీలతో భీకర ఫామ్ లో ఉన్నాడు. కానీ ఏడాదికాలంగా గిల్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఒక్క చెత్త ఇన్నింగ్స్ తో పోయింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరుగుతున్న కీలక పోరులో గిల్.. 15 బంతుల్లో 13 పరుగులు చేసి స్కాట్ బొలాండ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ నిష్క్రమించిన తర్వాత టీమిండియా ఫ్యాన్స్ అతడిని ఆటాడుకున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అంటే ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కాదని.. నువ్వు ఆడేది అల్లాటప్పా బౌలర్లతో కాదని.. అంతేగాక అక్కడి పిచ్ లు కూడా ఇండియాలో లాగా ఉండవని గుర్తు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. గిల్ ఔటయ్యాక పలువురు అభిమానులు ట్విటర్ లో స్పందిస్తూ.. ‘శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. నువ్వు వరల్డ్ బెస్ట్ టీమ్ తో ఆడుతున్నావు. అదేదో బంగ్లాదేశ్ టీమో లేక ఐపీఎల్ ఫ్రాంచైజో కాదు. నీకంటే శిఖర్ ధావన్ వందపాళ్లు నయం....’, ‘టెస్టు క్రికెట్ లో వరెస్ట్ ప్లేయర్. ఇతడిని టీమ్ నుంచి తీసి పడేసి పృథ్వీ షాను తీసుకురండి’అని కామెంట్స్ చేస్తున్నారు.
‘రోహిత్ శర్మ మరోసారి ఐసీసీ ఫైనల్స్ లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ అయితే ఓవల్ ను కూడా ఇండియాలో మాదిరిగా స్లో పిచ్ లు అనుకుంటున్నాడేమో.. అతడు ఐపీఎల్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కు తేడా తెలుసుకోవాలి..’, ‘ఆరెంజ్ క్యాప్ గెలవగానే అందరూ గిల్ ను సచిన్, కోహ్లీతో పోల్చారు. ప్రిన్స్, ఫ్యూచర్ కింగ్ అని ట్యాగ్ లు కూడా తగిలించారు. కింగ్ అవుతాడో లేదో తెలియదు గానీ ఇవాళ ఔట్ అయిన తీరును చూస్తే ఇంత దరిద్రండా ఆడటం కంటే బెంచ్ లో కూర్చున్నదే బెటర్..’అని దుమ్మెత్తిపోస్తున్నారు.