
డొమినికా టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆరంగ్రేటం టెస్టు మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్, 387 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 171 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆరంగ్రేటం టెస్టులో అత్యధిక స్కోరు బాదిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్..
ఇంతకుముందు శిఖర్ ధావన్, ఆరంగ్రేటం టెస్టులో 187 పరుగులు చేయగా, రోహిత్ శర్మ తన తొలి టెస్టులో 177 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రికార్డుకి 6 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు యశస్వి జైస్వాల్.. అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోషువా డి సిల్వకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు జైస్వాల్..
రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 229 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. తన ఇన్నింగ్స్‌లో 387 బంతులు ఫేస్ చేసి, ఆరంగ్రేటం టెస్టులో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్..
ఓవర్‌నైట్ స్కోరు 312/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, జైస్వాల్ అవుట్ అయ్యే సమయానికి 350 పరుగులు చేసి.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 200 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అతి పిన్న వయసులో 150+ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్..
ఓవరాల్‌గా అతి పిన్న వయసులో 150 ప్లస్ బాదిన ఐదో బ్యాటర్ యశస్వి జైస్వాల్. పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్, 19 ఏళ్ల 119 రోజుల వయసులో 150 స్కోరు బాది ఈ లిస్టులో టాప్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆర్చీ జాక్సన్, డవ్ వాల్తర్స్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ జార్జ్ హెడ్లీ తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు 21 ఏళ్ల 196 రోజుల వయసున్న యశస్వి జైస్వాల్..
1976లో జావెద్ మియాందాద్ తర్వాత 21 ఏళ్ల వయసులో 150 ప్లస్ స్కోరు బాదిన అతి పిన్న వయస్కుడు యశస్వి జైస్వాలే. 40 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ జారవిడిచాడు. దీంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విరాట్ కోహ్లీ, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు..
11 బంతుల్లో 3 పరుగులు చేసిన టీమిండియా వైస్ కెప్టెన్ అజింకా రహానే, కీమర్ రోచ్ బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. 147 బంతుల్లో 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ కెరీర్‌లో ఇది 29వ టెస్టు హాఫ్ సెంచరీ. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, అంతకుముందు అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో 186 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.