మూడో రోజు తొలి సెషన్‌లో మనదే ఆధిక్యం.. అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ అద్భుత పోరాటంతో...

By Chinthakindhi RamuFirst Published Jun 9, 2023, 5:20 PM IST
Highlights

WTC Final 2023 మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన భారత జట్టు... ఏడో వికెట్‌కి అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ శతాధిక భాగస్వామ్యం.. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తొలిసారి ఓ సెషన్‌లో టీమిండియా పూర్తి ఆధిక్యం కనబర్చింది.  అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ అద్భుత పోరాటం కారణంగా మూడో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది భారత జట్టు..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 209 పరుగులు వెనకబడి ఉన్న టీమిండియా, ఫాలో-ఆన్ గండాన్ని అయితే అధిగమించేసింది. అజింకా రహానే 122 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేయగా శార్దూల్ ఠాకూర్ 83 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు.

ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 133 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ ఈ భాగస్వామ్యాన్ని ఎంతసేపు కొనసాగిస్తే టీమిండియాకి అంత మంచిది.

అజింకా రహానే టెస్టు సెంచరీ చేసిన ఏ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోలేదు. రహానే మరో 11 పరుగులు చేస్తే, శతకాన్ని అందుకుంటాడు. దీంతో రహానే సెంచరీ చేయాలని టీమిండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. 


ఓవర్‌నైట్ స్కోరు 151/5 తో మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది...

బోలాండ్ వేసిన మూడో రోజు మొదటి ఓవర్ రెండో బంతికే శ్రీకర్ భరత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 బంతుల్లో 5 పరుగులు చేసిన శ్రీకర్ భరత్‌ని బోలాండ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 152 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా..

అయితే శార్దూల్ ఠాకూర్, అజింకా రహానే కలిసి అద్భుతమైన పోరాటం చూపించారు. అజింకా రహానే తన స్టైల్‌లో క్లాస్ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును కదలిస్తూ ఉంటే... శార్దూల్ ఠాకూర్ మొండిగా క్రీజులో పాతుకుపోయాడు..

శార్దూల్ ఠాకూర్, ప్యాట్ కమ్మిన్స్ వరుసగా బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేసినా వికెట్లకు అడ్డుగోడలా నిలబడ్డాడు శార్దూల్ ఠాకూర్. అంతేకాకుండా శార్దూల్ ఠాకూర్‌కి వెంటవెంటనే లైఫ్స్ దక్కాయి. 

బొలాండ్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ ఇచ్చిన క్యాచ్‌ని ఉస్మాన్ ఖవాజా డ్రాప్ చేస్తే, కమ్మిన్స్ బౌలింగ్‌లో వచ్చిన క్యాచ్‌ని కామెరూన్ గ్రీన్ నేలపాలు చేశాడు. 

ఐపీఎల్ ఫామ్‌ని కొనసాగిస్తూ అజింకా రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన అజింకా రహానే... టెస్టుల్లో 26వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు.. 

అలాగే టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న అజింకా రహానే, ఈ ఫీట్ సాధించిన 13వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌‌‌ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు అంపైర్. అయితే టీమిండియా డీఆర్‌ఎస్ తీసుకోగా ప్యాట్ కమ్మిన్స్ గీత దాటినట్టుగా కనిపించడంతో నో బాల్‌గా తేలింది. ఆ తర్వాత మరోసారి క్యాచ్ అవుట్ కోసం రివ్యూ తీసుకున్న ఆస్ట్రేలియాకి ఫలితం దక్కలేదు..

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకి ఆలౌట్ కాగా టీమిండియా 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 15, శుబ్‌మన్ గిల్ 13, విరాట్ కోహ్లీ 14, ఛతేశ్వర్ పూజారా 14 పరుగులు చేసి అవుట్ కాగా రవీంద్ర జడేజా 48 పరుగులు చేశాడు. 

click me!