
18 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి చోటు దక్కించుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అజింక్యా రహానే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భారత్ కు ఆపద్భాంధవుడయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట తనదైన క్లాస్ ఇన్నింగ్స్ ఆడి భారత్ ను పోటీలోకి తెచ్చాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి భారత్ ను పోటీ లోకి తెచ్చిన రహానే.. జడేజా తో కలిపి ఐదో వికెట్ కు 71 పరుగులు జోడించాడు. ఆ తర్వాత శార్దూల్ తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో రహానే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
కమిన్స్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ బాదిన రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో అర్థ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. 2021లో కూడా భారత్ డబ్ల్యూటీసీ పైనల్స్ ఆడినా ఒక్కరూ కూడా అర్థ సెంచరీ సాధించలేదు. ఆ మ్యాచ్ లో కూడా భారత్ తరఫున ఫస్ట్ ఇన్నింగ్స్ లో రహానే 49 పరుగులు చేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు.
ఐసీసీలోని వివిధ ట్రోఫీలలో హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు :
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : సచిన్ టెండూల్కర్ (2000)
వరల్డ్ కప్ ఫైనల్ : వీరేంద్ర సెహ్వాగ్ (2003)
టీ20 వరల్డ్ కపన్ ఫైనల్ : గౌతం గంభీర్ (2207)
డబ్ల్యూటీసీ ఫైనల్ : అజింక్యా రహానే (2023)
రెండేండ్ల క్రితం ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయిన రహానే.. దేశవాళీతో పాటు ఐపీఎల్ - 16 లో కూడా రాణించి భారత జట్టులోకి తిరిగొచ్చి టీమిండియాకు సేవియర్ గా మారడం గమనార్హం.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో మూడో రోజు బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా ఆదిలోనే శ్రీకర్ భరత్ వికెట్ కోల్పోయినా శార్దూల్ తో కలిసి రహానే భారత ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నాడు. 59 ఓవర్లు ముగిసేసరికి భారత్.. ఆరు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. రహానే (122 బంతుల్లో 89 నాటౌట్, 11 ఫోర్లు, 1 సిక్స్), శార్దూల్ ఠాకూర్ (77 బంతుల్లో 36, 4 ఫోర్లు) లు క్రీజులో ఉన్నారు.