
ముంబై వేదికగా మూడు రోజుల క్రితం ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ వరుసగా రెండు విజయాలతో దూసుకుపోతున్నది. ఆల్ రౌండ్ ప్రదర్శనలతో అదరగొడుతున్న ఆ జట్టు విజయాలలో బౌలర్ సైకా ఇషాక్ కీలక పాత్ర పోషిస్తున్నది. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన ఈ స్పిన్ సంచలనం.. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో కూడా రెండు కీలక వికెట్లు తీసింది. ప్రస్తుతం ఈ సీజన్ లో ఆమె హయ్యస్ట్ వికెట్ టేకర్ (6)గా ఉంది.
ఆట ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను తన స్పిన్ ఉచ్చులో బిగిస్తున్న ఇషాక్.. ముంబై ఇండియన్స్ టీమ్ లో స్టార్ అయిపోయింది. దీంతో నెట్టింట ఆమె నేపథ్యం గురించి తెగ వెతుకుతున్నారు.
ఎవరీ ఇషాక్..
27 ఏండ్ల ఇషాక్.. బెంగాల్ (కోల్‌కతా) లోని సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వర్థమాన క్రికెటర్. కాలిఘాట్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూ ఆమె క్రికెట్ జర్నీ ప్రారంభమైంది. స్పిన్ ఆల్ రౌండర్ అయిన ఇషాక్.. బెంగాల్ అండర్ -19, అండర్ - 23 టీమ్ లకు ఆడింది. బెంగాల్ రాష్ట్ర జట్టులో రాణించిన తర్వాత ఆమె దేశవాళీ టోర్నీలు ఆడేందుకు పిలుపువచ్చింది.
ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఆడకపోయినా ఆమె ఇండియా - డి, ఇండియా -ఏ ఉమెన్ తో పాటు ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ (2021, 2022) లలో పాల్గొంది. నిలకడగా రాణించిన ఆమె డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చింది. బెంగాల్ కే చెందిన జులన్ గోస్వామి చొరవతో ముంబై ఇండియన్స్ ఇషాక్ ను రూ. 10 లక్షల బేస్ ప్రైస్ తో కొనుగోలు చేసింది. గోస్వామి మార్గదర్శకత్వంలో ఇషాక్ తొలి రెండు మ్యాచ్ లలో అంచనాలకు మించి రాణించింది.
గుజరాత్ తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచ స్థాయి ప్లేయర్లు అయిన అన్నాబెల్ సదర్లండ్, వెర్హమ్ లను ఔట్ చేసింది. అదే ఊపులో మాన్సి జోషి, మోనికా పటేల్ లను ఔట్ చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక నిన్న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా తొలి నాలుగు ఓవర్లలోనే మంధాన, డెవిన్ లు రెచ్చిపోయి ఆడుతున్న వేళ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇషాక్ కు బంతినిచ్చింది. కెప్టెన్ నమ్మకాన్ని ఆమె వమ్ము చేయలేదు. తొలుత డెవిన్ ను ఆ తర్వాత దిశా కసత్ ను ఔట్ చేసి ఆర్సీబీకి షాకిచ్చింది.
ముంబై జట్టులో నటాలీ సీవర్, హేలీ మాథ్యూస్, అమెలియా కెర్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఇషాక్ తన ప్రదర్శనలతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది. ఇదే ప్రదర్శనలు నిలకడగా కొనసాగిస్తే ఆమె త్వరలోనే భారత మహిళల జట్టులోకి చోటు దక్కడం ఎంతో దూరంలో లేదంటున్నారు క్రికెట్ పండితులు. మరి తొలి రెండు మ్యాచ్ లలో అదరగొట్టిన ఇషాక్.. తదుపరి మ్యాచ్ లలో ఏం చేస్తుందో చూడాలి.