
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఆడిన తొలి మ్యాచ్ లో ఓడినా నేడు ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫర్వాలేదనిపించింది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ.. 20 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో రిచా ఘోష్ (28) టాప్ స్కోరర్. తొలుత బాగా ఆడి తడబడ్డా ఆ జట్టు మిడిలార్డర్, లోయరార్డర్ బ్యాటర్లు మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముంబై బౌలర్లు సమిష్టిగా రాణించి ఆర్సీబీని కట్టడిచేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఆర్సీబీ ఓపెనర్లు ఢిల్లీతో మ్యాచ్ మాదిరిగానే ఊరించి ఉసూరుమనిపించారు. తొలి వికెట్ కు ఇద్దరూ నాలుగు ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. కెప్టెన్ స్మృతి మంధాన.. 17 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 23 పరుగులు చేయగా సోఫీ డెవిన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 16 పరుగులు చేసింది.
క్రీజులో కుదురుకుంటున్నట్టే కనిపించిన ఈ జోడీకి సైకా ఇషాక్ షాకిచ్చింది. ఇషాక్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి డెవిన్ అమన్‌జ్యోత్ కౌర్ కు క్యాచ్ ఇచ్చింది. అదే ఓవర్లో వన్ డౌన్ బ్యాటర్ దిశా కసత్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే ఔటైంది. ఐదో ఓవర్ రెండో బంతికి మంధాన భారీ షాట్ ఆడగా.. బంతి వెళ్లి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఇస్సీ వాంగ్ చేతికి చిక్కింది. ఆదుకుంటుందనుకున్న హీథర్ నైట్ (0) కూడా డకౌట్ అయింది. 4.2 ఓవర్ వద్ద 39-0 గా ఉన్న ఆర్సీబీ.. 5.3 ఓవర్లకు (ఏడు బంతుల వ్యవధిలో) నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 43-4 కు చేరింది.
43కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఎల్లీస్ పెర్రీ.. 7 బంతుల్లోనే ఓ సిక్సర్, బౌండరీతో 13 పరుగులు చేసింది. కానీ అనవసర పరుగుకు యత్నించి ఆమె కూడా రనౌట్ అయింది. ఆ క్రమంలో కనిక అహుజా (13 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి వికెట్ కీపర్ రిచా ఘోష్ (26 బంతుల్లో 28, 3 ఫోర్లు, 1 సిక్సర్) తో ఆదుకునే యత్నం చేసింది. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 34 పరుగులు జోడించారు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని పూజా వస్త్రకార్ విడదీసింది. పూజా వేసిన 12 వ ఓవర్ మూడో బంతికి కనిక భారీ షాట్ ఆడగా వికెట్ కీపర్ యస్తికా భాటియా క్యాచ్ అందుకుంది. రిచా కూడా ఆ తర్వాతి ఓవర్లో భారీ షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద సీవర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. 13.3 ఓవర్లకే ఆ జట్టు 112 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో ఆర్సీబీ 130 పరుగులు చేయడమే గొప్ప అనుకుంటే ఆ జట్టు స్కోరు 150 దాటిందంటే దానికి కారణం శ్రేయాంక పాటిల్ (15 బంతుల్లో 22, 4 ఫోర్లు), మేగన్ (14 బంతుల్లో 20, 3 ఫోర్లు) ల మెరుపులే. ఈ ఇద్దరూ 8వ వికెట్ కు 34 పరుగులు జోడించారు. సైకా వేసిన 16వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన శ్రేయాంక.. సీవర్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా మరో బౌండరీ బాదింది. కానీ అదే ఓవర్లో చివరి బంతికి ఆమె ఔటైంది. మేగన్ చివరి వికెట్ గా వెనుదిరిగింది.ముంబై బౌలర్లలో హీలి మాథ్యూస్ మూడు వికెట్లు తీయగా ఇషాక్ , అమిలియాలు తలా రెండువికెట్లు తీశారు. సీవర్, వస్త్రకార్ లకు చెరో వికెట్ దక్కింది.