
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్న ముంబై ఇండియన్స్.. సీజన్ లో తొలిసారి బ్యాటింగ్ లో తడబడింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో.. 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 51, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విజృంభించిన ముంబై బ్యాటర్లు నేటి మ్యాచ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రెచ్చిపోవడంలో సఫలం కాలేదు. ఫలితంగా గుజరాత్ ముందు ఊరించే లక్ష్యం నిలిచింది. మరి గుజరాత్ తొలి మ్యాచ్ లో ఓటమికి బదులు తీర్చుకునేనా..?
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్స్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మంచి ఫామ్ లో ఉన్న ఆ జట్టు ఓపెనర్ హేలీ మాథ్యూస్ డకౌట్ అయింది. గార్డ్‌నర్ వేసిన తొలి ఓవర్ లోనే ఆమె పెవిలియన్ చేరింది.
వన్ డౌన్ లో వచ్చిన నటాలీ సీవర్ (31 బంతుల్లో 36, 5 ఫోర్లు,1 సిక్సర్).. యస్తికా భాటియా (37 బంతుల్లో 44, 5 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి ముంబైని నడిపించింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 74 పరగులు జోడించారు. కిమ్ గార్త్ వేసిన నాలుగో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టింది సీవర్. తనూజా కన్వర్ వేసిన ఆరో ఓవర్లో యస్తికా కూడా రెండు ఫోర్లు సాధించింది. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి సింగిల్ తీయడం ద్వారా ముంబై స్కోరు 50 పరుగులు దాటింది. అన్నాబెల్ వేసిన పదో ఓవర్లో యస్తికా సిక్సర్ బాదింది. పది ఓవర్లకు ముంబై.. ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
కిమ్ గార్త్ వేసిన 11వ ఓవర్లో సీవర్ 6,4 కొట్టి స్కోరు వేగాన్ని పెంచే యత్నం చేసింది. కానీ అదే ఓవర్లో చివరి బంతికి ఎల్బీ రూపంలో ఔటయ్యింది. స్నేహ్ రాణా వేసిన 13వ ఓవర్లో యస్తికా తొలి బంతికి రనౌట్ అయింది. నటాలీ స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. అదే ఓవర్లో అమెలియా కెర్ ఓ బౌండరీ కొట్టగా కౌర్ రెండు బౌండరీలు సాధించింది. కిమ్ గార్త్ వేసిన 14వ ఓవర్లో ఐదో బంతికి కెర్ సింగిల్ తీయడం ద్వారా ముంబై స్కోరు 100 పరుగులకు చేరింది.
ఈ క్రమంలో కౌర్ మరింత రెచ్చిపోయింది. గార్డ్‌నర్ వేసిన 15 వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టిన ఆమె..అన్నాబెల్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అదే ఫీట్ రిపీట్ చేసింది. తనూజా వేసిన 17వ ఓవర్ లో కౌర్ రెండు ఫోర్లు బాదినా చివరి బంతికి కెర్ (19) .. కిమ్ గార్త్ కు క్యాచ్ ఇచ్చింది. ఆ తర్వాతి ఓవర్లో స్నేహ్ రాణా.. ఇస్సీ వాంగ్ ను కూడా బోల్తా కొట్టించింది. సదర్లాండ్ వేసిన 19వ ఓవర్లో హర్మన్ రెండు భారీ సిక్సర్లు కొట్టింది. దీంతో ముంబై స్కోరు 150 దాటింది. ఇక గార్డ్‌నర్ వేసిన చివరి ఓవర్లో హర్మన్ రెండు ఫోర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కానీ అదే ఓవర్లో తర్వాతి బంతికి హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్ తో వెనుదిరిగింది. అమన్ జ్యోత్ కౌర్ కూడా తర్వాతి బంతికే ఔటైంది.