బదులు తీర్చుకుంటారా..? మళ్లీ బలవుతారా..? ముంబైతో మళ్లీ తలపడుతున్న గుజరాత్.. టాస్ ఓడిన హర్మన్

By Srinivas MFirst Published Mar 14, 2023, 7:03 PM IST
Highlights

WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో గెలిచి జోరుమీదున్న ముంబై ఇండియన్స్ నేడు ఐదో మ్యాచ్ కు సిద్ధమైంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన గుజరాత్  జెయింట్స్ తో ఆ జట్టు తలపడనుంది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)  తొలి సీజన్ ను మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ - గుజరాత్  జెయింట్స్ నేడు రెండో అంచె పోరుకు దిగుతున్నాయి.   డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం  ప్రతీ జట్టు (ఐదు) తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా తొలి అంచె పోరు  ముగిసింది. నిన్నట్నుంచే రెండో అంచె పోటీలు మొదలయ్యాయి. ఇక  ముంబైతో తాము ఆడిన తొలి మ్యాచ్ లో ఓడిన గుజరాత్ జెయింట్స్.. ఈ మ్యాచ్ లో అయినా  ప్రతీకారం తీర్చుకుంటుందా..? లేక గత మ్యాచ్ మాదిరిగానే బలౌతుందా..? అనేది ఆసక్తికరం.  బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  స్నేహ్ రాణా నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి తొలుత  బౌలింగ్ ఎంచుకుంది.  ముంబై బ్యాటింగ్ కు రానుంది. 

ఆడిన నాలుగు మ్యాచ్ లలో గెలిచి ఎదురే లేని ముంబై..  నేటి మ్యాచ్ లో కూడా గెలిచి  ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నది. మరోవైపు గుజరాత్.. ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనే గెలిచి పాయింట్ల పట్టికలో   నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆ జట్టుకు ముంబైతో మ్యాచ్ గెలవడం అత్యావశ్యకం.  

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న  ముంబైని ఓడించడం గుజరాత్ కు అంత వీజీ కాదు.  యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్, హర్మన్ ప్రీత్ కౌర్, అమెలియా కెర్, పూజా వస్త్రకార్ లతో   ముంబై బ్యాటింగ్  దృఢంగా ఉంది. బౌలర్లలో  కూడా ఇస్సీ వాంగ్,  సీవర్ తో పాటు స్పిన్నర్ సైకా ఇషాక్ సంచలన ప్రదర్శనలతో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది.  

కాగా  గుజరాత్ ఈ లీగ్ లో ఆర్సీబీతో  మ్యాచ్ లో తప్ప మిగిలిన మూడు మ్యాచ్ లలో ఓడింది.   ఢిల్లీతో ఆడిన గత మ్యాచ్ లో  దారుణంగా ఓడిన గుజరాత్.. ముంబైపై  గెలవడం అంత  ఆషామాషీ కాదు. సీజన్ తొలి మ్యాచ్ లో ముంబై.. తొలుత బ్యాటింగ్ చేసి 207 పరుగుల భారీ స్కోరు చేయగా తర్వాత గుజరాత్.. 64 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో హర్మన్ సేన 143పరుగుల భారీతేడాతో గెలుపొందింది. 

తుది జట్లు : ఈ మ్యాచ్ కోసం గుజరాత్ రెండు మార్పులు చేసింది. లారా, వెర్హమ్ స్థానంలో సోఫీ డంక్లీ,  అన్నాబెల్ ఆడనున్నారు. ముంబై జట్టు తాము గత మ్యాచ్ లో ఆడిన టీమ్ తోనే బరిలోకి దిగుతోంది. 

ముంబై :  యస్తికా భాటియా,  హేలీ మాథ్యూస్, నటాలి సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్, దహర్ గుజ్జర్,  అమెలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమారియా కాజి,  జింతమని కలిత, సైకా ఇషాక్ 

గుజరాత్ : సబ్బినేని మేఘన, సోఫీ డంక్లీ, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్‌నర్, అన్నాబెల్ , సుష్మా వర్మ, దయాలన్ హేమలత,  స్నేహ్ రాణా (కెప్టెన్), కిమ్ గార్త్, మాన్సి జోషి,  తనూజా కన్వర్

click me!