WPL: ఆట ఆరంభానికి ముందే అమ్మాయిలు అదుర్స్.. టికెట్లు ఖతం..

Published : Mar 04, 2023, 02:46 PM IST
WPL: ఆట ఆరంభానికి ముందే అమ్మాయిలు అదుర్స్.. టికెట్లు ఖతం..

సారాంశం

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)  తొలి సీజన్ లో భాగంగా నేటి నుంచి  మ్యాచ్ లు మొదలుకానున్నాయి. ఆడుతున్నది మొదటి సీజన్ అయినా అమ్మాయిలు మాత్రం ఆడకుండానే  రికార్డులు సృష్టిస్తున్నారు. 

మహిళల ప్రీమియర్ లీగ్  ప్రారంభ ఎడిషన్ లో నేడు (శనివారం) రాత్రి  7.30 గంటలకు తొలి మ్యాచ్ జరుగనున్నది. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ లీగ్ ను విజయవంతం చేయడానికి  బోర్డు  అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే  ఎంత చేసినా  అమ్మాయిల మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారా..? లేదా..? అన్న అనుమానం  బోర్డు పెద్దలను వెంటాడుతున్న వేళ  బీసీసీఐకి ఆ బెంగ తీరింది. తొలి మూడు రోజుల పాటు ఈ లీగ్ లో  ఆడే మ్యాచ్ లకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.  

ఐదు జట్లు పాల్గొంటున్న ఈ సీజన్ లో  తొలి మూడు రోజుల్లోనే ఆ టీమ్ లు ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు కూడా డబ్ల్యూపీఎల్ లో తొలిసారిగా తమ అభిమాన ఆటగాళ్ల ఆట  చూసేందుకు ఎగబడుతున్నారు. 

ఈ లీగ్ లో నేడు ముంబై - గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుండగా రేపు (ఆదివారం) బెంగళూరు - ఢిల్లీ తో పాటు యూపీ-గుజరాత్  మ్యాచ్ జరుగనుంది. ఇక సోమవారం ముంబై - బెంగళూరు మ్యాచ్  ఉంది. ఈ మూడు రోజులకూ  మ్యాచ్ టికెట్లు  మొత్తం అమ్ముడుపోయాయి.  

డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ను విజయవంతం  చేసేందుకు బీసీసీఐ టికెట్ రేట్లను రూ. 100, రూ. 250, రూ. 400 గా కేటాయించిన విషయం తెలిసిందే.  ఇక  అమ్మాయిలు, మహిళలకైతే ఎంట్రీ ఉచితం.  కాగా  నేడు రేపు వారాంతపు సెలవులు కావడంతో  మైదానాలు ఫుల్ కాబోతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా  సోమవారం  ముంబై - బెంగళూరు మ్యాచ్ కు  కూడా టికెట్లు  అమ్ముడైపోవడం గమనార్హం.  ఐపీఎల్ లో  ఈ ఫ్రాంచైజీలకు ఉన్న బ్రాండ్ వాల్యూ.. టికెట్ రేట్ల తగ్గింపు.. మహిళలకు ఉచిత ప్రవేశం.. కారణాలేవైనా  స్టేడియాలు నిండితే అది బీసీసీఐతో పాటు  ఆడే ఆటగాళ్లకూ  మంచిదే. 

సాధారణంగా ఐపీఎల్ లో ముంబై - చెన్నై మ్యాచ్ తో పాటు ముంబై-బెంగళూరు మ్యాచ్ కూ క్రేజ్ ఉంటుంది.  ఈ రెండు జట్లలో కావాల్సినంత మంది స్టార్ ఆటగాళ్లు.. లెక్కకు మిక్కిలి వినోదం  ముంబై - బెంగళూరు  మ్యాచ్ లకు సొంతం. ఇప్పుడు  డబ్ల్యూపీఎల్ లో కూడా ఇదే  క్రేజ్ రిపీట్ అవుతుండటం గమనార్హం.  కాగా  ముంబై-బెంగళూరు మ్యాచ్ బ్రబోర్న్ వేదికగా జరుగనున్నది.   

 

ఇటీవలే భారత్ - ఆస్ట్రేలియాల మధ్య వాంఖెడే వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్  ను వీక్షించడానికి 35 వేల మంది హాజరైన సంగతి తెలిసిందే.  భారత్ లో ఒక మ్యాచ్ ను చూడటానికి ఇంతమంది హాజరుకావడం ఇదే ప్రథమం. కానీ నేటి నుంచి మొదలుకాబోయే  డబ్ల్యూపీఎల్  మ్యాచ్ లు మాత్రం ఆ రికార్డులను బ్రేక్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. మరి  బీసీసీఐ లక్ష్యం నెరవేరుతుందా..?  తెలియాలంటే  మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. 

 

డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు... 

డబ్ల్యూపీఎల్ మీడియా, డిజిటల్ హక్కులను  వయాకామ్ 18  (జియో) దక్కించుకున్న విషయం తెలిసిందే.   నేటి నుంచి జరుగబోయే మ్యాచ్ లన్నీ  టెలివిజన్ లో అయితే  స్పోర్ట్స్ 18 ఛానెల్ లో చూడవచ్చు. అదే యాప్ లో చూడాలనుకుంటే జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారాలుంటాయి.  ప్రస్తుతానికి జియో సినిమా యాప్ లో  రుసుములేమీ చెల్లించకుండానే  ఉచితంగానే మ్యాచ్ లను వీక్షించొచ్చు.  

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర