ప్లేఆఫ్స్‌పై కన్నేసిన ఢిల్లీ.. గుజరాత్‌పై గెలిస్తే స్పాట్ పక్కా.. టాస్ గెలిచిన క్యాపిటల్స్

By Srinivas MFirst Published Mar 16, 2023, 7:03 PM IST
Highlights

WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తర్వాత  సూపర్బ్ పర్ఫర్మెన్స్ తో  ప్లే ఆఫ్స్ దిశగా  సాగుతోంది. ఈ క్రమంలో నేడు గుజరాత్ తో తలపడుతున్నది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  ప్లేఆఫ్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ నేడు  గుజరాత్ జెయింట్స్ తో  తలపడుతున్నది.  ఈ లీగ్ లో ముంబై ఇదివరకే ప్లేఆఫ్స్ చేరగా.. తర్వాత బెర్త్ కోసం ఢిల్లీ పోటీ పడుతున్నది.  నేడు  గుజరాత్ ను ఓడిస్తే  మిగతా మ్యాచ్ ల ఫలితాలతో సంబంధం లేకుండా  మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ.. ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది.  ఈ నేపథ్యంలో  బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో  ఢిల్లీ క్యాపిటల్స్.. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ కు రానుంది.  గుజరాత్ బ్యాటింగ్ కు రానుంది. 

ఈ రెండు జట్ల మధ్య  సీజన్ లో ఇదివరకే ఓ మ్యాచ్ జరిగింది. ఈనెల 11న జరిగిన ఆ మ్యాచ్ లో  గుజరాత్..  తొలుత బ్యాటింగ్ చేసి  105 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఢిల్లీ..  7.1 ఓవర్లలోనే బాదేసింది.   షఫాలీ వర్మ 28 బంతుల్లోనే  76 పరుగులతో రాణించింది. 

ఈ సీజన్ లో గుజరాత్ ఇప్పటివరకు  ఐదు మ్యాచ్ లు ఆడి   ఒక్కటే మ్యాచ్ లో విజయం సాధించింది. ఫలితంగా   పాయింట్ల పట్టికలో  అట్టడుగు స్థానంలో నిలిచింది.  ఈ మ్యాచ్ లో కూడా ఓడితే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు   మరింత సంక్లిష్టమవుతాయి.  

ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్,  మెగ్ లానింగ్, మారిజనె కాప్, అలీస్ క్యాప్సీ, జెస్ జానాసేన్ లు మంచి ఫామ్ లో ఉన్నారు.  వీరంతా నేటి మ్యాచ్ లో కూడా తమ విభాగాల్లో బెస్ట్ ఇవ్వగలిగితే గుజరాత్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.  

ఇక గుజరాత్ ఈ సీజన్ లో గెలిచింది ఒక్క ఆర్సీబీతోనే. సోఫియా డంక్లీ, ఆష్లే గార్డ్‌‌‌నర్, అన్నాబెల్ సదర్లాండ్, వెర్హమ్, స్నేహ్ రాణా వంటి సీనియర్లతో పాటు హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన వంటి యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు  సరిగా ఆడలేకపోతోంది. మరి కీలకంగా మారిన నేటి మ్యాచ్ లో గుజరాత్ ఎలా రాణిస్తుందో చూడాలి.  

తుది జట్లు:  ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ మార్పులు చేశాయి. ఢిల్లీ జట్టులో తారా నోరిస్  స్థానంలో పూనమ్ యాదవ్ జట్టులోకి వచ్చింది. గుజరాత్ తరఫున అన్నాబెల్,  మేఘనల స్థానంలో లారా,  అశ్వినిలు తుది జట్టులో ఆడుతున్నారు. 

గుజరాత్ : లారా వోల్వార్డ్ట్,  సోఫియా డంక్లీ,  హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్‌నర్, దయాలన్ హేమలత,  అశ్విని కుమారి, స్నేహ్ రాణా (కెప్టెన్), సుష్మా వర్మ, కిమ్ గార్త్, తనూజా కన్వర్, మోనికా పటేల్ 

ఢిల్లీ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజనె కాప్, తాన్యా భాటియా, జెస్ జొనాసేన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, పూనమ్ యాదవ్ 

click me!