Usain Bolt: క్రికెట్ లోకి అడుగుపెట్టనున్న జమైకన్ పరుగుల చిరుత..! టీ20 లలో బోల్ట్ ను ఆపతరమా..?

By Srinivas MFirst Published Dec 9, 2021, 11:00 AM IST
Highlights

Usain Bolt: స్వయంగా అథ్లెట్ అయిన బోల్ట్ కు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే కూడా ఇష్టమట. ఆ ముచ్చటను తీర్చుకోవడానికే బోల్ట్ ఫీల్డ్ లోకి దిగుతున్నాడు. 

ప్రపంచంలో అత్యంత వేగవంతంగా పరుగులు తీయడంలో రికార్డులు నెలకొల్పిన పరుగుల యంత్రం ఉసేన్ బోల్ట్ త్వరలో క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. ఒలింపిక్స్ లో ఎనిమిది బంగారు పతకాలు సాధించి  కొద్దిరోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ జమైకన్ పరుగుల చిరుత.. త్వరలోనే క్రికెట్ ఆడనున్నట్టు సమాచారం. స్వయంగా అథ్లెట్ అయిన బోల్ట్ కు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే కూడా ఇష్టమట. ఆ ముచ్చటను తీర్చుకోవడానికే బోల్ట్ ఫీల్డ్ లోకి దిగుతున్నాడు. టీ20 క్రికెట్ లీగ్ లు ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో వాటిలో ఆడేందుకు బోల్ట్ ఆసక్తి చూపుతున్నాడు. 

మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించతలపెట్టిన ఓ టీ20 లీగ్ లో భాగమవ్వాలని బోల్ట్ భావిస్తున్నాడని తెలుస్తున్నది. ఈ మేరకు భారత్ కు చెందిన ఓ డిజిటల్ స్పోర్ట్స్ ఛానెల్.. బోల్ట్ ను సంప్రదించినట్టు సమాచారం. అయితే దీనిపై సదరు ఛానెల్  ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన  పూర్తి వివరాలు  తెలిసే అవకాశముంది. 

రన్నింగ్ ట్రాక్ నుంచి బోల్ట్ తప్పుకున్నా అతడి రికార్డులు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో బోల్ట్ పాల్గొంటాడని భావించినా.. అతడు మాత్రం  వాటిపై అంతగా ఆసక్తి చూపలేదు. ఏదేమైనా వంద మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2009  ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో బోల్ట్.. 9.58 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అయితే టోక్యో లో ఈ రికార్డు బద్దలవుతుందని చాలా మంది భావించారు. కానీ ఒక్క స్ప్రింటర్ కూడా ఆ రికార్డుకు దగ్గరగా కూడా రాలేదు. 

ఇక రన్నింగ్ పక్కనబెడితే  బోల్ట్ కు క్రికెట్ పట్ల మక్కువ ఎక్కువ. తన తండ్రికి బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని ఈ జమైకన్  లెజెండ్ చెప్పాడు. తన దేశానికే చెందిన ఆటగాల్లు క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్ లు ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా టీ20 లీగ్ లలో ఈ ఇద్దరూ వారి విధ్వంసక ఆటతీరుతో దూసుకుపోతున్నారు. వారి బాటలోనే బోల్ట్ కూడా టీ20 లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  బోల్ట్.. గతంలో భారత్ లో యువరాజ్ తో కలిసి ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు. 

 

Running into the week 💥⚡️ pic.twitter.com/LXybdBRpq1

— Usain St. Leo Bolt (@usainbolt)

బోల్ట్ గనుక టీ20లకు వస్తే అతడు ఏ విభాగంలో రాణిస్తాడని ఇప్పటికే అతడి ఫ్యాన్స్ పందేలు వేసుకుంటున్నారు. పరుగుల వీరుడిగా గుర్తింపు పొందిన బోల్ట్.. బౌలింగ్ చేస్తే బెటరని పలువురు చెప్పుకుంటుండగా.. బాగా పరిగెత్తగలిగే బోల్ట్ బ్యాటర్ గా వస్తే చూడాలని ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్యాటర్ గా వస్తే మాత్రం భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కంటే బోల్ట్ వేగంగా పరుగెత్తగలడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 

వికెట్ల మధ్య పరిగెత్తడంలో ధోనిది ప్రత్యేక శైలి. గతంలో ఓ టీ20  మ్యాచ్ సందర్భంగ ధోని.. రెండు పరుగులు తీయడానికి వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తాడు. అప్పుడతడి వేగం గంటకు 31 కిలోమీటర్లు. ఒకవేళ బోల్ట్.. తన వంద మీటర్ల రికార్డు (9.58 సెకండ్లు) మాదిరి పరిగెత్తితే.. ధోని లా రెండు పరుగులు తీసే వేగం గంటకు 38 కిలోమీటర్లు అవుతుంది. మరి బోల్ట్..  బ్యాటర్ గా ఉండి వికెట్ల మధ్య పరుగెత్తుతాడా..? లేక బౌలర్ గా ఉండి అత్యంత వేగవంతమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేస్తాడా..? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది. 

click me!