మహిళల టీ20 ప్రపంచకప్: తిప్పేసిన పూనమ్, ఆసీస్‌‌పై భారత్ ఘన విజయం

By Siva KodatiFirst Published Feb 21, 2020, 4:48 PM IST
Highlights

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మహిళల జట్లు శుభారంభం చేసింది. శుక్రవారం సిడ్నీలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మహిళల జట్లు శుభారంభం చేసింది. శుక్రవారం సిడ్నీలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

తొలుత టాస్ ఓడి బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతీ మంధాన 10, షెఫాలీ వర్మ 29 మెరుపు ఆరంభం అందించారు. వీరిద్దరి జోరుతో భారత్ నాలుగు ఓవర్లకే 40 పరుగుల చేయడంతో భారీ స్కోరు సాధిస్తుందని అంచనా వేశారు.

అయితే ఆసీస్ స్పిన్నర్ జొనస్సెన్ రంగంలోకి దిగడంతో పరిస్ధితి మారిపోయింది. ఆమె స్మృతీ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లను ఔట్ చేసింది. ఈ దశలో దీప్తి శర్మ 49తో కలిసి జెమియా రోడ్రిగ్స్ 26 ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడీ కుదురుకుంటున్న సమయంలో డెలీస్సా కిమ్మిన్స్  బౌలింగ్‌లో జేమియా ఔటైంది.

అయితే వేదా కృష్ణమూర్తి 9తో కలిసి దీప్తి చివరి వరకు పోరాడింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో జోన్నెసన్ 2, ఎలిసా పెర్రీ, దెలిస్సా కమ్మిన్స్ తలో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్‌కు మంచి ఓపెనింగ్ లభించింది. ఓపెనర్ల బెత్ మూనీ 6, హీలీ 51 మంచి ఆరంభం ఇచ్చారు. అయితే జట్టు స్కోరు 32 వద్ద ఉండగా శిఖా పౌండే బౌలింగ్‌లో బెత్ ఔటయ్యింది. ఆ తర్వాత నుంచి భారత బౌలర్లు రెచ్చిపోయారు.

స్పిన్నర్ పూనమ్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. ఆమె వరుస బంతుల్లో రెచెల్ 6, పెర్రీ 0, జోనసెన్ 2‌లను ఔట్ చేశారు. అయితే గార్డెనర్‌ 34తో కలిసి ఓపెనర్ హీలీ ధాటిగా ఆడుతూ జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చారు. ఈ సమయంలో మరోసారి మ్యాజిక్ చేసిన పూనమ్.. హీలీని ఔట్ చేసింది.

కానీ గార్డెనర్ మాత్రం మొండిగా పోరాడింది. మధ్యలో శిఖా పాండే విజృంభించి చివరి వరుస బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసింది. దీంతో గార్డెనర్‌కు సహకరించే వారే కరువయ్యారు. ఈ దశలో జట్టు స్కోరు 113 వద్ద ఉండగా అషీగ్ గార్డెనర్ సైతం ఔటవ్వడంతో ఆసీస్ ఓటమి ఖరారైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే 115 పరుగులకు ఆస్ట్రేలియా కథ ముగిసింది. భారత బౌలర్లలో పూనమ్ పాండే 4, శిఖా పాండే 3 వికెట్లు పడగొట్టారు. 

click me!