
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భారత జట్టు ఓడిన తర్వాత చాలామంది అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా ఐపీఎల్ పై దుమ్మెత్తిపోశారు. ఐపీఎల్ వల్లే భారత క్రికెట్ జట్టు భవితవ్యం అగమ్యగోచరంలో పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ టోర్నీలు గెలవడం కంటే ఐపీఎల్ ట్రోఫీ గెలవడం చాలా కష్టమని దాదా అన్నాడు.
అంతేగాక కెప్టెన్ గా రోహిత్ శర్మపై తనకు నమ్మకముందని.. అతడు భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీని కచ్చితంగా అందిస్తాడని ఆశాభావ్యం వ్యక్తం చేశఆడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓడిన తర్వాత గంగూలీ ఆజ్ తక్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దాదా మాట్లాడుతూ.. ‘కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత భారత జట్టుకు సారథి అవసరమయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ తో పాటు టెస్టు బాధ్యతల నుంచి కూడా కోహ్లీ తప్పుకోవడంతో సెలక్టర్లు రోహిత్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ టైమ్ లో వారికున్న ఆప్షన్స్ లో రోహిత్ సరైనవాడని భావించి అతడికే సారథ్య పగ్గాలు ఇచ్చారు. ఐపీఎల్ లో అతడు ఐదు ట్రోఫీలు సాధించాడు. ఇంటర్నేషనల్ లెవల్ లో కూడా భారత్ కు ఆసియా కప్, నిదాహాస్ ట్రోఫీని అందించాడు. అందుకే అతడే బెస్ట్ ఆప్షన్ అని సెలక్టర్లు భావించారు. 2021లో కూడా మనం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడి ఓడిపోయినా రెండేండ్ల తర్వాత మనం టీ20 వరల్డ్ కప్ సెమీస్ వరకూ వెళ్లాం...
రోహిత్ పై నాకు పూర్తిస్థాయిలో నమ్మకముంది. రోహిత్, ధోనీలు ఐపీఎల్ లో తలా ఐదు ట్రోఫీలు సాధించారు. ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అంత ఈజీ కాదు. అది చాలా టఫ్ టోర్నమెంట్. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం వరల్డ్ కప్ గెలవడం కంటే కూడా చాలా కఠినమైంది. ఐపీఎల్ లో లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఉంటాయి. ప్లేఆఫ్స్ లో కూడా 3 మ్యాచ్ లు ఆడాలి. అదే వరల్డ్ కప్ లో అయితే ఐదారు మ్యాచ్ లు గెలిస్తే సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఐపీఎల్ లో ఛాంపియన్ అవ్వాలంటే 17 మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది..’అని అన్నాడు.